ఒకప్పుడు దసరా పండుగకు నెల రోజుల ముందు నుంచే దర్జీల వద్దకు జనాలు క్యూ కట్టేవారు. బట్టలు కుట్టే వారికి కూడా చేతినండా పని లభించేది. కానీ నేడు రెడీమేడ్ దుస్తులకు ఆదరణ పెరుగడంతో టైలర్లకు చేతి నిండా పని లేకుండా పోయింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వృత్తి మానేసి ఇతర రంగాలకు వెళ్లగా.. టైలరింగ్‌లో కొనసాగుతున్న వారు అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్నారు.
పండుగ సమయాల్లో టైలర్ షాపులు కస్టమర్లతో కళకళలాడేవి. కానీ ప్రస్తుతం గిరాకీ లేక కళతప్పాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త ప్యాషన్ దుస్తులకు ఆకర్షితులవుతున్న ప్రజలు టైలర్ షాపులకు వెళ్లడం తగ్గించారు. దాంతో పనుల్లేక దర్జీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్నారు. ప్రజలు కేవలం పైపై మెరుగులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, నాణ్యతగా బట్టలు కుట్టే తమను పట్టించుకోవడం లేదని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలలో నాలుగు రోజులు కూడా పని దొరకడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన మెటీరియల్ ధరలు
ప్యాంట్, షర్ట్ కుట్టినందుకు టైలర్లు రూ.600 నుంచి 700 వరకు చార్జ్ చేస్తున్నారు. ఇందులో దుకాణంలో పని చేసే వర్కర్లకు జతకు రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. దీనికి తోడు కరెంట్ చార్జీలు, మెటీరియల్ ధరలు విపరీతం గా పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేదే అరకొర గిరాకీలు కాగా మెటీరియల్ ధరలు కూడా పెరగడం వల్ల వచ్చే ఆదాయం తిండికి కూడా సరిపోని పరిస్థితి నెలకొందని, షాపులు నడిపించ డం కష్టంగా మారిందని టైలర్లు పేర్కొంటున్నారు.
టైలర్ వృత్తి కూడు పెట్టడం లేదు
నేను 24 ఏం డ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాను. గతంలో దసరా వస్తే రెండు నెలలు చేతినిండా పని దొరికేది. బట్టలు కుట్టించుకునేందుకు ప్రజలు క్యూ కట్టేవారు. నావద్ద ముగ్గురు వర్కర్లు పని చేసేవారు. ఇప్పుడు అందరూ రెడీమేడ్ దుస్తులు కొంటున్నారు. మాకు గిరాకీ తగ్గిపోయింది. టైలర్ వృత్తి కూడు పెట్టడం లేదు.
పండుగకు గిరాకీ లేదు
నేను 40 ఏండ్లుగా టైలర్‌గా పని చేస్తున్న. దసరా పండుగకు కుటుంబ సభ్యులందరం కలిసి నెలరోజులు పగలు, రాత్రి పని చేసే వాళ్లం. అన్నం తినే తీరిక కూడా ఉండేది కాదు. నేడు రెడీమేడ్ దుస్తుల రాకతో పని లేకుండా పోయింది. గిరాకీ లేక పండుగ కూడా సంతోషంగా చేసుకోలేక పోతున్నాం.
ప్రభుత్వం ఆదుకోవాలి
20 ఏండ్లుగా టైలర్ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న. రెడీమేడ్ దుస్తుల వల్ల దసరా పండుగకు కొత్త బట్టలు కుట్టించుకునే వారు తగ్గిపోయారు. అరకొర సంపాదనతో కుటుంబ పోషణ భారంగా మారింది. పాత దుస్తుల పని చేయాల్సి వస్తోంది. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలి.