e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిల్లాలు చెర వీడిన దేవుడి భూములు

చెర వీడిన దేవుడి భూములు

  • ఉమ్మడి జిల్లాలో 534.18 ఎకరాలు స్వాధీనం
  • 23 ఆలయాల పరిధిలో అధికారుల చర్యలు
  • లీజు రూపంలో రూ.19.42లక్షల అదనపు ఆదాయం
  • ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
  • ఆలయాలకు మరింత ఆర్థిక పరిపుష్టి
  • అందరి కష్టాలను గట్టెక్కించే దేవుడికే శఠగోపం పెడుతూ మాన్యం

భూములను కాజేస్తూ వచ్చారు అక్రమార్కులు. దశాబ్దాల తరబడి ఈ తంతు సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోగా, కబ్జా కోరల నుంచి మాన్యం భూములను విడిపించి ఆలయాలకు ఆర్థిక పరిపుష్టి ఏర్పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం ఆలయాలకు ఉండాల్సిన భూములు ఎన్ని? ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూమి ఎంత? మిగతాది ఎవరి ఆక్రమణలో ఉంది? ఇలాంటి విషయాలపై పక్కాగా వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా రెవెన్యూ శాఖ సహకారంతో ఆలయ భూములను స్వాధీనం చేసుకుంటున్నది. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 534.18 ఎకరాల మాన్యం భూముల్లో దేవాదాయ శాఖ బోర్డులు పాతింది. ఈ భూముల లీజు ద్వారా 19.42లక్షల రూపాయల అదనపు ఆదాయం ఆయా ఆలయాలకు చేకూరనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,622 ఎకరాలను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్‌14(నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో దేవాలయాలు, దేవుడి మాన్యాలు, ఆస్తులపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం కొనసాగింది. దీంతో ఆలయాల ఆలనాపాలన కూడా అంతంతమాత్రంగానే సాగింది. భూములు, ఇతర ఆస్తులు ఉన్నా వాటిని సంరక్షించే వారు లేక ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అవుతూ వచ్చాయి. ఇందుకు అప్పటి రెవెన్యూ, దేవాదాయ శాఖలోని కొందరు అధికారుల ఉదాసీనత కూడా కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా చాలా దేవాలయాల భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అనేక ఆలయాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆలయాల పునర్నిర్మాణంతో పాటు అర్చకులను ఆదుకునేందుకు పలు పథకాలను సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చారు. దూపదీప నైవైద్య పథకం ద్వారా ప్రతి నెలా నిధులు విడుదల చేస్తూ ఆలయాలకు పూర్వవైభవం చేకూరేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆలయాల ఆస్తులు, భూములను పరిరక్షించి వాటిని ఆదాయ పరంగా మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఆలయాల భూముల అన్యాక్రాంతంపై దృష్టి సారించింది. రికార్డుల పరంగా ఉన్న భూముల వివరాలను సమ్రగంగా సేకరించి కబ్జాకు గురైతే స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఆలయ అధికారులు కూడా రంగంలోకి దిగారు. దశలవారీగా కబ్జాకోరల నుంచి భూములకు విముక్తి కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా భూముల స్వాధీనం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు.

- Advertisement -

534.18 ఎకరాలు స్వాధీనం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో మొత్తం 1552 ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో 502 ఆలయాల పరిధిలో దేవుడి మాన్యాల కింద విలువైన భూములు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 196 ఆలయాలకు, సూర్యాపేట జిల్లాలో 146 ఆలయాలకు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 160 దేవుడి మాన్యాలు ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఆలయాల పరిధిలోని భూములు పలుచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం ఈ విషయంపై దృష్టి పెట్టి ఒక్కోదానికి విముక్తి కల్పిస్తున్నారు. 2019 మే నుంచి ఇప్పటి వరకు మొత్తం నాలుగు దఫాలుగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మొత్తం 534.18 ఎకరాల భూములను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించారు. రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే అధికారుల సహకారంతో వీటిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేశారు. వీటిన్నింటినీ పక్కాగా వివరాలతో సహా నమోదు చేస్తూ రికార్డుల్లో పొందుపర్చారు. 2019 మేలో మూడు ఆలయాల పరిధిలో 136.18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. 2020 జూన్‌, జూలై, సెప్టెంబర్‌లో చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా మొత్తం 17 ఆలయాల పరిధిలో ఆక్రమణలకు గురైన 352.22 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. 2021 జనవరిలో చేపట్టిన మూడో దఫా స్పెషల్‌ డ్రైవ్‌లో ఒక ఆలయం పరిధిలోని 5.08 ఎకరాలను, నాలుగో దఫా స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రెండు ఆలయాల పరిధిలోని 40.10 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు ఆలయాల భూములపైనా కసరత్తు చేస్తున్నారు. పకడ్బందీ ఆధారాలతో స్వాధీనానికి త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అదనంగా రూ.19.42లక్షల లీజు

దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న భూముల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతున్నది. అధికారుల లెక్కల ప్రకారం స్వాధీనం చేసుకున్న 534.18ఎకరాల లీజు ద్వారా మొత్తం రూ.19,42,200 ఆదాయం సమకూరింది. తొలి దఫా భూముల లీజు ద్వారా రూ. 35వేలు, రెండో దఫా భూముల వల్ల రూ.17,47,200, మూడు, నాల్గవ దఫాల భూముల ద్వారా రూ. 1,60,000 ఆదాయం ఆయా ఆలయాలకు సమకూరింది. వీటి ద్వారా ఆలయాల ఆలనాపాలన, అభివృద్దికి ఆస్కారం ఏర్పడిందని అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ఆలయ భూముల గుర్తింపు.

భూముల స్వాధీనం కోసం చేపట్టిన మొదటి దఫా స్పెషల్‌ డ్రైవ్‌లోనే గతంలో తమ పరిధిలో లేని ఆలయ భూములను సైతం కొత్తగా గుర్తించినట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో శ్రీ తిరుమలనాథస్వామి ఆలయానికి 77.35ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు. గుండ్రాంపల్లి పరిధిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి 57.275 ఎకరాల దేవుడి మాన్యాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇలాగే జిల్లాలో మిగతా ఆలయాల పరిధిలోనూ రికార్డులలను పరిశీలించే పనిని కొనసాగిస్తున్నారు. ఆలయంతో పాటు రెవెన్యూ రికార్డులను సరిచూడడం ద్వారా కొత్తగా భూములను గుర్తించడం, లేదా ఆక్రమణలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాలయల భూములపై సర్వే చేశాం. రెవెన్యూ అధికారుల సహాయంతో రికార్డులను సేకరించి అన్యాక్రంతమైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నాం. దేవుడి మాన్యాలను అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణవేణి, ఈఓ సులోచన, తాసీల్దార్‌ సునితతో కలసి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాం. 534 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నాం.

  • మహేందర్‌కుమార్‌, దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌

అన్యాక్రాంతమైన భూములను వెలికితీస్తాం

జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతమైన ఆలయ భూములను వెలికితీస్తున్నాం. కట్టంగూర్‌ మండలంలోని శ్రీకోదండరామస్వామి ఆలయానికి చెందిన 33 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. దీనిని లీజుకు ఇవ్వడం ద్వారా రూ. 4లక్షలకుపైగా ఆదాయం సమకూరుతున్నది. అన్నెపర్తి, యాదాద్రి జిల్లాలోని మహాదేవపురంలోని ఆలయ భూములను కూడా స్వాధీనపర్చుకున్నాం.
-రుద్ర వేంకటేశం, మేనేజర్‌, నల్లగొండ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana