e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home జిల్లాలు పండక్కి పాత బండే!

పండక్కి పాత బండే!

  • బుల్లెట్‌ కావాలంటే నెలకుపైనే..
  • నచ్చిన కారు కొనాలంటే
  • 4 నెలలు ఆగాల్సిందే..

దసరా పండుగకు కొత్త వాహనం కొనడం అన్నది చాలామందికి సెంటిమెంట్‌. ఈసారి మాత్రం నచ్చిన బైకో, కారో కొనుగోలు చేద్దాం అనుకున్న వారికి కొంత నిరాశే ఎదురవుతున్నది. మార్కెట్లో క్రేజ్‌ ఉన్న వాహనాల కొరత ఏర్పడమే ఇందుక్కారణం. పండుగ వేళ కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా..! చేతిలో డబ్బులున్నాయని నచ్చిన బైక్‌, కారు కొని తెచ్చుకుందామనుకుంటే కుదరదు. కనీసం 3 నుంచి 4నెలల పాటు ఎదురు చూడాల్సిందే. ఇప్పటికిప్పుడు బుక్‌ చేసినా.. కారు అయితే డెలివరీ కోసం కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని షోరూమ్‌ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. గతంలో పండుగ వేళ ఆఫర్లు ప్రకటించే కంపెనీలు నేడు వాహనాలను సకాలంలో అందించలేని పరిస్థితి నెలకొంది. కరోనా అనంతరం మధ్య తరగతి ప్రజలు సైతం సొంత వాహనాలకే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కార్ల అమ్మకాలు పెరిగిపోయాయి. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడం తాజా పరిస్థితికి కారణమైంది.

దసరా నాడు ఆయుధ పూజ ఆనవాయితీ. ఆ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. కొత్త అల్లుళ్లకు అత్తింటి వారు కానుకగా వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే, మోటార్‌బైక్స్‌, కార్లు బుక్‌ చేయడానికి తంటాలు పడుతున్నారు. ఎంతైన ఖర్చు చేస్తామని చెప్తున్నా వాహన విక్రయదారులు చేతులెత్తేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షోరూంలో ‘ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌’ మోడల్‌, హోండాలో యూనికాన్‌ కొనుగోలు కోసం పెద్ద ఎత్తున బారులు దీరుతున్నారు. రెండు నెలల తర్వాతే డెలివరీ ఇస్తామని స్పష్టం చేయడంతో నిరుత్సాహ పడుతున్నారు. అదే విధంగా కార్లలో మారుతీ సుజుకీ, హుండాయ్‌, మహీంద్రా కంపెనీల బండ్లు సైతం ఆలస్యం అవుతున్నాయి. కియా కంపెనీ కారు బుక్‌ చేసుకున్న మూడు నెలలకు కానీ రావడం లేదు.

- Advertisement -

చిప్‌ లేకనే తిప్పలు..

గతేడాది కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ఆటో మోబైల్‌ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరత కారణంగా మరోసారి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. కారు మొత్తం వివరాలను నమోదు చేసే సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరత భారీగా ఉంది. దీంతో దసరా, దీపావళి సీజన్లపై ఆశలు అడియాశలయ్యాయని, వచ్చే ఏడాది జనవరి వరకూ సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరత ఉంటుందని ఆయా కంపెనీల డీలర్లు చెప్తున్నారు.

బుల్లెట్‌ బండిపై మోజుతో…

బుల్లెట్‌ బండి నడుపాలన్న కోరికతో షోరూమ్‌కు వచ్చాను. ఎన్‌ఫీల్డ్‌లో క్లాసిక్‌ నచ్చింది. దాన్ని తీసుకుందామని మొత్తం లెక్కలు వేయించి ఫైనల్‌ చేశాను. తీరా బుకింగ్‌ అంటూ రెండు నెలల సమయం పడుతుందని చెప్పారు. దసరా పండుగకు ఆఫర్లు ఉంటాయనుకుంటే.. పైగా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. బండి నడిపేందుకు రెండు నెలలు వేచి చూడాలంటే ప్రాణం ఒప్పుకోవట్లేదు.
ఎస్‌కే జావెద్‌, తిమ్మాపురం

50 రోజుల దాకా పడుతుందన్నారు

దసరా పండక్కి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ బుల్లెట్‌ తీసుకుందాం అనుకున్నాం. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని అన్ని షోరూముల్లో కనుక్కున్నా.. ఎక్కడా బండ్లు లేవు. బుకింగ్‌ చేసిన తర్వాత బండి రావడానికి నెల రోజుల నుంచి 50 రోజుల దాకా పడుతుందని చెప్పారు. దాంతో దసరాకు బుల్లెట్‌ మీద తిరుగాలన్న ఆశ తీరకుండా పోయింది.
రాచరికం నరేశ్‌, మిర్యాలగూడ

ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌కు 2 నెలలు పడుతుంది
దసరా పండుగ కావడంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు కొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ బండి బ్రేకుల్లో అమర్చే సెన్సార్‌ చిప్‌ల కొరత కారణంగా తయారీ ఆలస్యం అవుతుంది. రెండు నెలల సమయం పెడుతున్నాం. ఒక వేళ ఆ లోపే బండి వస్తే పిలిచి ఇస్తున్నాం.

  • మీసాల సుందర్‌,
    రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సేల్స్‌ మేనేజర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement