e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు విజ్ఞాన, వైజ్ఞాన సంగ్రహాలయం

విజ్ఞాన, వైజ్ఞాన సంగ్రహాలయం

  • సంగారెడ్డిలో సీవీ రామన్‌ మ్యూజియం సిద్ధం
  • రూ.1.40కోట్లతో మ్యూజియంలో 58 రకాల ప్రదర్శనలు
  • కనువిందు చేయనున్న 15 జాతుల డైనోసర్లు
  • ప్రత్యేకంగా 10 నమూనాల గణిత సిద్ధాంతాలు
  • అంతరిక్ష వీక్షణకు ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌
  • 15 మందితో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

మ్యూజియంతో విజ్ఞాన, వైజ్ఞాన పరిజ్ఞానం పెరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ప్రజలు అలాంటి ప్రదర్శనలు తిలకించే, విద్యార్థులు తోటి వారికి వివరించేలా మ్యూజియం రూపుదిద్దుకున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.40 డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌తో బైపాస్‌ రోడ్డులోని పాత డీఆర్‌డీఏ కార్యాలయంలో 58 రకాల ప్రదర్శనలతో ‘సీవీ రామన్‌’ పేరిట మ్యూజియం ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేకంగా ఈ మ్యూజియంలో 10 గణిత సిద్ధాంతాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సిద్ధాంతంతో 100 రకాలుగా గణితశాస్త్రం బోధనకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించారు. బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి, 56 రకాల మొక్కలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా అంతరిక్షంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రజలు వీక్షించేందుకు టెలీస్కోప్‌ను ప్రదర్శనలో పెట్టారు. మ్యూజియం పర్యవేక్షణకు 15మందితో కమిటీ ఏర్పాటు చేయగా, కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సైన్స్‌ మ్యూజియం సంగారెడ్డిలో ఏర్పాటైంది. విద్యావంతులు, విద్యార్థులు, అంతరిక్ష ప్రేమికులను కనువిందు చేయనున్నది.

చారిత్రక ఘట్టాలు తెలిపేవి మ్యూజియాలు…విజ్ఞాన పరిజ్ఞానం పెంచటానికి దోహదపడుతాయి. అలాంటి ప్రదర్శన క్షేత్రం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో సందర్శకులు సందడి చేసేందుకు సిద్ధమైంది. సీవీ. రామన్‌ పేరుతో సైన్స్‌ మ్యూజియాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే 1930లో రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో సైన్స్‌లో దేశం తరపున నోబుల్‌ బహుమతి అందుకుని దేశకీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు రామన్‌. ఆ రోజును(ఫిబ్రవరి 28న) జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకోవడం దేశ ప్రజలు అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి కల్పించారు. 1954లో అప్పటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించి రామన్‌ సేవలకు గుర్తింపు ఇచ్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ రకాల మ్యూజియాలు సందర్శకులను ఆకట్టుకుని తమ తెలివితేటల ప్రదర్శనకు ఉపయోగపడ్డాయి.జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్‌ మ్యూజియం త్వరలో సంగారెడ్డి జిల్లా వాసులనే కాకుండా పలు జిల్లాలు, పక్క రాష్ర్టాల ప్రజలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇందులో 58 రకాల పరిజ్ఞానం పెంపొందించే విధంగా ప్రదర్శనలు అందుబాటులో ఉంచారు. సైన్స్‌ మ్యూజియం ఏర్పాటుకు డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌ రూ.1.40 కోట్లు ఖర్చు పెట్టారు. ముఖ్యంగా అంతరిక్షంలో సూర్య, చంద్ర గ్రహాలు ఏర్పడినప్పుడు ప్రజలు వీక్షించేందుకు టెలీస్కోప్‌ను ప్రదర్శనలో పెట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేకంగా ఈ మ్యూజియంలో
10 నమూనాల గణిత సిద్ధ్దాంతాలను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. మ్యూజియం బాధ్యతలను 15 మందితో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తూ కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో మంత్రి హరీశ్‌రావుతో ప్రారంభించటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సైన్స్‌ మ్యూజియంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…

- Advertisement -

ఇన్ఫిటీ వెల్‌…

ఇది బావి. పైభాగం ప్రదర్శనలో కేవలం మీటరు మాత్రమే కనిపిస్తున్నది. చూస్తే మాత్రం ఎంతో లోతు ఉన్నట్లు అగుపిస్తున్నది. ఇన్ఫిటీ వెల్‌ యొక్క ప్రత్యేకత. ఇది అపోహలాగే కనిపించే ఆకృతి కాదు. నిజమైన బావి లాగా సందర్శకులను కనువిందు చేయనున్నది. ముఖ్యంగా ఇలాంటి పరికరాలు విద్యార్థులను ఆలోచింప జేస్తూ కొత్తవాటిని కనుగొనేందుకు అవకాశం ఉంటుంది.

ఇమేజ్‌ మల్టీప్లేయర్‌…

తన ప్రతిబింబం ఇక్కడ మూడు వైపుల అమర్చిన అద్దంలో ఒక చేతి నుంచి రెండో వైపునకు వస్తున్నపుడు తక్కువ ప్రతిబింబాలు కనిపిస్తాయి. ప్రతిబింబాన్ని ఎదురుగా ఉన్న అద్దంలో ఒక పరావర్తనంతో ఎడమ, కుడి వైపుల ఉన్న అద్దాల్లో చూస్తే లెక్కలేనన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి.

ప్రత్యేక ఆకర్షణగా గణిత సిద్ధాంతాలు…

దేశవ్యాప్తంగా ఉన్న సైన్స్‌ మ్యూజియాల్లో కేవలం జీవ, రసాయన, జంతు ప్రదర్శనలతోనే ఉన్నాయి. కానీ తొలిసారిగా రాష్ట్రంలోనే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్‌ మ్యూజియంలో ప్రత్యేకంగా గణిత సిద్ధాంతాలు 10 ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సిద్ధాంతంతో 100 రకాలుగా గణితశాస్త్రం బోధనకు చర్యలు చేపట్టి గణితంపై వివరించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించారు. సైన్స్‌తో పాటు శాస్త్రవిజ్ఞానంలో గణితానికి కూడా సమతుల్యం ఉందని, ఈ మ్యూజియంలో ప్రదర్శన ఏర్పాటు చేయడమే నిదర్శనం. ప్రతి గణిత బోధకుడు సూత్రం ఆధారంగా విద్యార్థులకు లెక్కలు చెబుతూ గణితంపై పట్టుసాధిస్తే భవిష్యత్‌లో మంచి ఉద్యోగంతో పాటు గుర్తింపు సాధ్యమవుతుంది. దేశంలో ఏ మ్యూజియంలో ఏర్పాటు చేయని విధంగా జిల్లా కేంద్రంలోని సైన్స్‌ మ్యూజియంలో గణిత సిద్ధాంతాలు సిద్ధం చేయడంతో విద్యార్థులు సందర్శనకు వచ్చినప్పుడు వివరాలు తెలుసుకుంటే వారి భవిష్యత్‌ బంగారం కావటానికి దోహదపడనున్నది.

లిప్ట్‌ యువర్‌సెల్ప్‌…

కుర్చీలో కూర్చుని ఇక్కడ అమర్చిన తాడును కిందికి లాగితే ఎంత బరువైనా సరే పైకి వెళ్తున్నది. తాడు లాగుతూ ఉంటే బరువుతో సంబంధం లేకుండా సులువుగా పైకి వెళ్లడం గమనించాలి. కూర్చున్న కుర్చీ పై భాగం చక్రాలకు(పుల్లీస్‌) బిగించి ఉంటాయి. ఒక చక్రం మీ భారాన్ని సగ భాగం తగ్గిస్తున్నది. ఇక్కడ మూడు చక్రాలు(పుల్లీస్‌) బిగి ంచి ఉండటంతో మీరు చేసే పని భారా న్ని చాలా రేట్లు తగ్గిస్తున్నది. అందువల్ల తాడు లాగిన కొద్దీ బరువుతో సంబంధం లేకుండా పైకి వెళ్తున్నది.

పర్యవేక్షణ కమిటీదే ప్రధాన పాత్ర…

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్‌ మ్యూజియం పర్యవేక్షణకు ఏర్పాటు చేసి కమిటీదే పూర్తి బాధ్యత తీసుకోనున్నది. కలెక్టర్‌ అధ్యక్షతన 15 మంది సభ్యులతో కమిటీని నియమించారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, జిల్లా విద్యాధికారి కన్వీనర్‌గా, డీఆర్‌డీవో జిల్లా అధికారి కోశాధికారిగా, జిల్లా సైన్స్‌ అధికారి మ్యూజియం ఇన్‌చార్జిగా, మిగతా 10 మందిలో ఇద్దరు జిల్లా అధికారులు, నలుగురు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నలుగురు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సభ్యులుగా కమిటీలో ఉంటారు. మ్యూజియానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ, పర్యవేక్షణ కమిటీ సభ్యులే చూస్తారు.

ప్లాట్‌ ఇన్‌ ఎయిర్‌…

అద్దం అంచుకు మీ ముక్కు ఆనించి, అద్దం అంచుమీద శరీరం మధ్య భాగంలో ఉండేలా నిలబడాలి. అద్దం వైపు ఉన్న కాళ్లను నెమ్మదిగా పైకి లేపాలి. కాళ్లను పైకి లేపగానే గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తున్నది. ఎదురుగా అద్దం సగభాగంలో కాలు మాత్రమే కనిపిస్తున్నట్లుగా నిలబడగానే ప్రతిబింబం గాలిలో తెలుతున్నట్లు కనిపిస్తున్నది. అద్దం ముందు తన ప్రతిబింబాలను గమనించేందుకు ఇది ఉదాహరణ.

రూ.1.40 కోట్లతో మ్యూజియం…

సాంకేతికంగా పరుగులు పెడుతున్న సమాజంలో నిత్యనూతనంగా కనిపించే కొత్తకొత్త రకాలను ఆస్వాదిస్తున్న ప్రజలకు సైన్స్‌ మ్యూజియంతో సైన్స్‌ పరిజ్ఞానం పెరగనున్నది. సంగారెడ్డి జిల్లా ప్రజలు అలాంటి ప్రదర్శనలు తిలకించి తోటి వారికి వివరించే విధంగా మ్యూజియం రూపుదిద్దుకున్నది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో తొలి సైన్స్‌ మ్యూజియంగా అవతరించి సందర్శకులను కనువిందు చేయనున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.40 డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌తో బైపాస్‌ రోడ్డులోని పాత డీఆర్‌డీఏ కార్యాలయంలో 58 రకాల ప్రదర్శనలతో ఏర్పాటు చేశారు. విద్యార్థుల పాఠ్యాంశాలల్లో (జీవ, రసాయన శాస్ర్తాలు) బోధిస్తున్న విధంగా ఇక్కడ చూసి మరింత పరిజ్ఞానం పెంచుకునే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. ఇప్పటికే సైన్స్‌ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి గ్రామాల వారీగా విద్యార్థులు సందర్శించి నైపుణ్యాన్ని ప్రదర్శించే స్థాయికి ఎదుగుతున్నారు.

మ్యూజియంలో బొటానికల్‌ గార్డెన్‌…

సైన్స్‌ మ్యూజియం ప్రాంగణంలో సందర్శకులు వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా కనిపించే విధంగా పాఠ్యాంశాలల్లో మొక్కల గురించి వివరించేందుకు బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్‌లో 56 రకాల మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రతకోసం ముందస్తు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధించే మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చి నాటారు. దీంతో పాటు మ్యూజియం ఆవరణలో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ 375 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. విద్యార్థులకు సైన్స్‌ మ్యూజియంతో సాంకేతికంగా ఉపయోగపడటమే కాకుండా పాఠ్యాంశాలల్లో బోధించే పాఠాలపై పట్టు సాధించేందుకు ఉపయోగపడనున్నది.

రాష్టంలో తొలి మ్యూజియం

విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించి నేర్చుకునే విధంగా రాష్టంలోనే తొలి మ్యూజియం జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషకరం. మ్యూజియం సందర్శించిన విద్యార్థుల్లో ఏవో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేందుకు ఉపయోగపడనున్నది. మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు చూసి విజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సాధించే అవకాశం కలుగనున్నది. జిల్లాలోని పర్యావరణ వేత్తలు, ప్రజలు, తమ పిల్లలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించి శాస్త్రవిజ్ఞానం పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా రాణించాలి. ముఖ్యంగా విద్యనభ్యసిస్తున్న చిన్నారుల మదిలో తట్టే ఆలోచనలను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే వారు అనుకున్న రంగంలో రాణిస్తారు.

ప్లాటింగ్‌ బాల్‌…

గాలి ఒత్తిడి వల్ల భూమి ఆకర్షణ శక్తితో పరికరంపై ఏర్పాటు చేసిన బంతి గాలిలో ఎగరటానికి స్వీచ్‌ నొక్కగానే ఎగురుతున్నది. ఎందుకంటే వీచే గాలికి ఒత్తిడి తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతున్నది. అల్పపీడన ప్రాంతంలో బంతి చిక్కుకుని పడిపోకుండా నిలబడుతూ ఎగురుతున్నది. ఈ విధానాన్ని బట్టి విమానం ఎగరటానికి ఈ సిద్ధాంతమే మూలమని, విమానం రెక్కలపై ఉపరితలంలో ఏర్పడిన తక్కువ ఒత్తిడి విమానాన్ని గాలిలో తేలియాడేలా చేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలాంటి 58 రకాల ప్రదర్శనలతో సీవీ.రామన్‌ సైన్స్‌ మ్యూజియం సందర్శకులను ఆకట్టుకోనున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement