నేడు ‘ప్లవ’ నామ సంవత్సరాది యుగాదికి ఆది ఉగాది

తెలుగు కొత్త సంవత్సరానికి నాంది
పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి ప్రత్యేకత

మెదక్‌ మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 12 : వసంతుని వలపుగీతాలు, కోకిలమ్మ కుహూరాగాలు, మామిడాకుల మంగళనాదాలు, వేపపూల వగరు భాష్యాలు కలిసి వెలిసే పండగే ఉగాది.. భవిష్యత్‌పై కోటి ఆశలను కలిగిస్తూ జీవనగమనంలోని ఎత్తుపల్లాలను గుర్తుచేసే ఉగాది.. ఇంటిల్లిపాదికీ ఇంపైన పండగ.. కాల విభజనలో భూమిక అయిన సంవత్సరంలోని మొదటి రోజును ‘ఉగాది.. యుగాది’.. సంవత్సరాదిగా పిలుస్తారు. చాంద్రమాన సంప్రదాయంలో సంవత్సరంలోని పన్నెండు నెలల్లోని మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా పంచాంగం చెబుతోంది. గతంలోని కష్టనష్టాలు మళ్లీ రాకుండా ఉండాలని, కొత్త సంవత్సరం ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉత్సాహంగా ఈ పండగను జరుపుకొంటారు. ఈ సందర్భంగా వసంతరుతువు ఆగమనంతో స్పందించి హరితకాంతులీనుతున్న చెట్లను చూసి ప్రకృతి పరవశిస్తుంది. మామిడిపూల మకరందాన్ని ఆస్వాదిస్తూ కోకిలలు గొంతు సవరించుకుంటాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని, పూజల్లో పాల్గొనడం ఈ పండగ ఆనవాయితీ. భవిష్యత్‌ శోభాయమానంగా ఉండాలని మహిళలు ఇంటి ముందు రంగవల్లులు అద్దుతారు. మామిడితోరణాలతో గుమ్మాలను అలంకరిస్తారు. ఇంటిల్లిపాదీ ఇష్టదేవతను పూజించి, ఇంటిపెద్దతో ప్రసాదాన్ని(ఉగాది పచ్చడి) తీసుకుంటారు.

అన్నింటా తొలి పండుగ..
తెలుగువారి పండుగల్లో ఉగాది తొలి పండుగ. ఈ పండుగ పుట్టుకకు సంబంధించి అనేక పురాణగాథలున్నాయి. వేదాలను తస్కరించిన సోమకాసురుడి బారి నుంచి వాటిని కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించేందుకు మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడాని పౌరాణికగాథ. శ్రీ మహావిష్ణువు చైత్రశుధ్య పాడ్యమి నాడే మత్స్యావతార గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాచికి ద్వాపర యుగం పూర్తయి, కలియుగం ప్రారంభమైందని కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భువిలో కలి ప్రవేశించిందని, అందుకే ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారమైందని చెబుతారు.

జీవితానుభవాల మిశ్రమ సూచిక ఉగాది పచ్చడి
జీవితంలో మంచీచెడు.. కష్టసుఖాలు అంతర్భాగమని, వాటిని సమభావంతో స్వీకరిస్తే మానసిక ప్రశాంతత చేకురుతుందని ఉగాది పచ్చడి తెలుపుతుంది. వేపపూలు, బెల్లం, ఓమ, కొత్త చింతపండు, లేత మామిడి కాయల ముక్కలు ఉపయోగించి తయారుచేసే ఈ మిశ్రమం శాస్త్రీయంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా విశిష్టతను కలిగిఉంది. చేదు, తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు అనే ఆరు రుచులను మిళితం చేసి ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఆరు రుచులు విచారం, సంతోషం, కోపం, భయం, అయిష్టత, ఆశ్చర్యం అనే ఆరు భావనలను సూచిస్తాయని పురాణోక్తి.

భవిష్యత్‌ ప్రణాళికకు భూమిక.. పంచాంగశ్రవణం
అనేక ఆధ్యాత్మిక ఫ లితాలతో పాటు దేశా నికి వెన్నెముక అయి న రైతు వ్యవసాయం గురించి పంచాంగ ప్రధానంగా తెలియజేస్తుంది. ఆ సంవత్సరంలో వర్షధాన్యాదులు, పంటల దిగుబడి, గాలి వీచే దిశలు, కార్తెలకు సంబంధించిన సమాచారం ముందుగానే తెలియడంతో రైతులు జాగ్రత్తలు తీసుకునే వీలు చిక్కుతుంది. ఫలితంగా రైతులు వ్యవసాయ నిర్వహణపై ఒక అంచనాకు రాగలుగుతారు. ప్రజలు ఆ సంవత్సరంలోని మంచిరోజులు, మూఢాల వివరాలను తెలుసుకోవడంతో శుభకార్యాలను జరుపుకునేందుకు ప్రణాళిక తయారు చేసుకోగలుగుతారు. గ్రహణాలు, భూకంపాల వంటి విషయాలలో ముందే సమాచారాన్ని అందించే భవిష్యదర్శిని పంచాంగం.

  • దివ్యజ్ఞాన సిద్ధాంతి, హైదరాబాద్

పురోహితుల కరదీపిక పంచాంగం
పురహితాన్ని కోరుకునేవారి కరదీపిక పంచాంగం. పంచాంగంలోని అంశాలను ఆధారం చేసుకొని భవిష్యత్‌ను నిర్మించుకోవడం హిందూసాంప్రదాయం. పుట్టిన సమయంలో గ్రహలచలనం, ఆ తర్వాత ఆ వ్యక్తి జీవనంపై ప్రభావాన్ని చూపుతుంది. అందువల్లే జనన సమయ గ్రహస్థితిలోని దోషాలకు పరిహారం చేసుకొనే మార్గాలను పంచాంగం తెలియజేస్తుంది. ఐదు అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అనుసరించడంతో వ్యక్తుల్లోనే కాక వ్యవస్థలోనూ గణనీయమైన మార్పు సాధించవచ్చు. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో పంచాంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  • పార్నంది శంకరశర్మ, భైరాన్‌పల్లి

ఇవి కూడా చదవండి

వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌ను పక్కనపెడతారా? ఇది సరైంది కాదు!

ఎన్ఆర్‌సీ తెచ్చినా.. గోర్ఖాల‌ను వెళ్ల‌గొట్టం

ఆంగ్ సాన్ సూకీపై కొత్త క్రిమిన‌ల్‌ కేసు న‌మోదు

వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌ను పక్కనపెడతారా? ఇది సరైంది కాదు!

ఎన్ఆర్‌సీ తెచ్చినా.. గోర్ఖాల‌ను వెళ్ల‌గొట్టం

2024 క‌ల్లా చంద్రుడిపైకి తొలి మ‌హిళ‌, శ్వేత జాతేత‌ర వ్య‌క్తి

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్