e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home కామారెడ్డి ప్రజాసమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలి

ప్రజాసమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలి

అధికారులకు కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ ఆదేశం

కామారెడ్డి టౌన్‌, సెప్టెంబర్‌ 20: ప్రజావాణిలో ప్రజలు విన్నవించిన సమస్యలను వారం రోజుల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

‘ప్రజావాణి’కి 42 ఫిర్యాదులు

కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశపు హాల్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులను ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు స్వీకరించారు. ప్రజావాణి సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను సత్వర పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో మొత్తం 42 వినతులు వచ్చినట్లు తెలిపారు.

రోజూ వారి లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ఆరోగ్య కార్యకర్తలు రోజూ వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ్ల కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రతిరోజూ ఆరోగ్య కార్యకర్తలు వందమందికి తప్పనిసరిగా టీకా ఇచ్చేలా చూడాలన్నారు. వంద శాతం ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేసిన గ్రామాల ప్రజా ప్రతినిధులను వైద్య శాఖ ఆధ్వర్యంలో సన్మానించాలని సూచించారు. గ్రామస్థాయిలో వీఆర్‌ఏల సహకారం తీసుకొని ఇంటింటి సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పర్యవేక్షణ బాధ్యతలు డిప్యూటీ డీఎంహెచ్‌వో చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

జాతీయ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం 7650 మెదక్‌ నుంచి రుద్రూర్‌ వరకు చేపడుతున్న జాతీయ రహదారి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ, మిషన్‌ భగీరథ, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. అవసరమైన చోట సర్వీస్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. సమావేశంలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్‌, నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, ట్రాన్స్‌కో, సర్వే ల్యాండ్‌ అధికారులు పాల్గొన్నారు.

దళిత బంధు పై అవగాహన

కామారెడ్డి టౌన్‌, సెప్టెంబర్‌ 20: నిజాంసాగర్‌ మండలంలో 1800 మంది లబ్ధిదారులను దళిత బంధు పథకానికి అర్హులుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో దళితబంధు పథకంపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు తీసుకున్న నగదును ఆర్థికాభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. చిన్న పరిశ్రమలు, వివిధ రకాల వ్యాపారాలు చేపట్టడానికి నగదును ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా స్థాయి అధికారులు లబ్ధిదారులకు గేదెలు, గొర్రెలు, పౌల్ట్రీ వంటి వాటిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement