e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home జిల్లాలు గూడు కేసీఆర్‌ టవర్స్‌ సిద్ధం

గూడు కేసీఆర్‌ టవర్స్‌ సిద్ధం

టేకులపల్లిలో ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం
గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సౌకర్యాలు
మొదటి విడతలో 1,004 ఇళ్లు ప్రారంభం
ఈ నెల 29న మంత్రులు కేటీఆర్‌, అజయ్‌, ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఖమ్మం, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గూడు లేక గోస పడిన పేదలకు సొంతింటి కల సాకారం కాబోతున్నది. అద్దె ఇంటి కష్టాలు తీరనున్నాయి.. చాలీచాలని గదులతో ఇబ్బందులు పడినవారి జీవితాల్లో కొత్త కాంతులు విరజిమ్మనున్నాయి. సొంత గూడు కట్టుకోవాలి.. కుటుంబంతో సంతోషంగా గడపాలన్న బడుగుజీవి ఆకాంక్ష నెరవేరబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పట్టుదల తోడు కావడంతో అన్ని హంగులతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోని గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఖమ్మం నగరం టేకులపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మొదటి విడతలో 1,004 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని ఈ నెల 29న రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అంతేకాదు, అక్కడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మార్కెట్‌, అంగన్‌వాడీ సెంటర్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

పేదలకు గూడు అందించాలన్న తెలంగాణ సర్కార్‌ సంకల్పానికి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దీక్ష, పట్టుదల తోడై ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో అన్ని హంగులతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. మొదటి విడతలో పూర్తయిన 1,004 ఇళ్లను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ నెల 29న ప్రారంభించనున్నారు. అధికారులు ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షల చొప్పున కేటాయించగా మౌలిక సదుపాయాల కోసం మరో రూ.75 వేలు వెచ్చించారు. ఇలా ఒక్కో ఇంటికి రూ.6.05 లక్షల చొప్పున ఖర్చయింది. మొత్తం ఇళ్లకు రూ.60.20 కోట్ల నిధులు ఖర్చయ్యాయి.

- Advertisement -

అన్ని సౌకర్యాలు ఇక్కడే..
లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా డబుల్‌ బెడ్‌రూంలు నిర్మించిన టేకులపల్లి ప్రాంతంలోనే అధికారులు రూ.23 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆధునీకరించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఇదే ప్రాంగణంలోనే రూ.13 లక్షలతో మార్కెట్‌ ఏర్పాటు చేయనున్నారు. అంతర్గత రహదారులను పక్కాగా నిర్మించనున్నారు. ఇళ్ల చుట్టూ ఇప్పటికే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఇళ్లలోకి వెళ్లే దారిలో ఆర్చి నిర్మిస్తున్నారు. లబ్ధిదారుల పిల్లల కోసం నిర్మాణ సముదాయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే అంగన్‌వాడీ కేంద్రం, కిచెన్‌ షెడ్‌ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కు, ఆటస్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలా ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం1,240 గృహాలకు గాను ఇప్పటివరకు 1,004 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన నిర్మాణాలనుక కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 1,240 లబ్ధిదారులను ఒకేసారి ఎంపిక చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు ఇళ్లకు రంగులు వేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ సరఫరా పనులు కూడా పూర్తవుతున్నాయి. ఈ ప్రాంగణం నుంచి నేరుగా నగర ప్రాంతానికి రావడానికి గల ప్రధాన రహదారులన్నింటినీ ఆధునీకరించారు.

టేకులపల్లి ప్రాంతంలో పేదల కోసం మొత్తం 52 బ్లాకుల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో మూడు ఫ్లోర్లు ఉంటాయి. అందులో 24 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని హంగులతో 42 బ్లాకులను పూర్తి చేశారు. మరో పది బ్లాకులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరింత మంది లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరనున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement