సంతానోత్పత్తికి అనుకూలంగా వాతావరణం
నీరు, ఆహార వనరులు పుష్కలం
నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
లక్ష్మీదేవిపల్లి, మార్చి 19: ఒక ఊరిలో పిచ్చుక కనిపిస్తే ఆ ఊరు పచ్చగా ఉన్నట్లు శాస్త్రీయపరంగా ఓ అంచనా. పక్షులు కనిపిస్తున్నాయంటే ఆ ఊరిలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నట్లు. పంటలు బాగా పండుతున్నట్లు. అన్నింటికీ మించి ప్రకృతి నేస్తం పిచ్చుక.. జీవ వైవిధ్యానికి ప్రతీక. పంట చేలల్లో రైతన్నలకు ఎదురుపడే ప్రాణులు. వాటికి ఆహారం అందించేందుకు తన ఇంటి చూరుకు వరి కంకులు కట్టేంత ప్రేమ రైతుకు ఉండేదంటే ఆశ్చర్యమేమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చెరువులు బలోపేతం కావడం, అటవీ విస్తీర్ణం పెరగడం, సాగునీటి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరడంతో తిరిగి జీవుల మనుగడకు అనుకూల వాతావరణం ఏర్పడింది. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
భద్రాద్రి ఫారెస్ట్‌లో 10 రకాల జాతులు..
భద్రాద్రి అటవీ ప్రాంతంలో 10 రకాల జాతుల పిచ్చుకులు ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు వెల్లడిస్తున్నారు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో రకరకాల పక్షులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటున్నాయి. తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని తమ జాతులను కాపాడుకుంటున్నాయి. ఇక్కడే ఆహారం, నీటి వసతి దొరుకుతుండడంతో ఏటా పక్షి జాతులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిచ్చుకల సంరక్షణకు కృత్రిమ గూళ్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
అంతరించిపోవడానికి కారణాలివే..
నాడు పంట చేలు, ధాన్యపు రాశుల వద్ద కిలకిలమంటూ పిచ్చుకలు సందడి చేసేవి. మనిషి అలికిడి వినగానే అక్కడి నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయేవి. ఊళ్లలో పాడు పడిన బావులు, పూరిళ్ల కప్పు అంచులకు, తుమ్మచెట్లకు గూళ్లు కట్టుకుని సందడి చేసేవి. ఈ దృశ్యాలు ఎంతో చూడముచ్చటగా ఉండేవనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పిచ్చుకల మనుగడ కష్టతరంగా మారింది. మొబైల్ టవర్ల వల్ల రేడియేషన్, వాతావరణ కాలుష్యం, నీటి వనరులు లేకపోవడం, అడవీ విస్తీర్ణం అంతరించిపోవడం, పంట చేలల్లో క్రిమిసంహారక మందుల వాడకం.. ఇలా అనేక కారణాలతో పిచ్చుకల జాతి మనుగడ కష్టతరంగా మారింది.
తల్లి ప్రేమకు ప్రతీక పిచ్చుక
ఆడ పిచ్చుక గుడ్లు పెడుతుంది. పొదుగుతుంది. నోటితో ఆహారాన్ని తీసుకువచ్చి స్వయంగా పిల్లలకు అందిస్తుంది. రెక్కలొచ్చి ఎగిరేవరకూ వాటి బాగోగులు చూసుకుంటుంది. ఈ కారణం చేత పిచ్చుక తల్లి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే వీటి మనుగడ జీవ వైవిధ్యానికి ప్రతీక. ఈ కారణంగా ఏటా మార్చి 20న ప్రపంచ దేశాలు పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
పిచ్చుకల సంరక్షణకు చర్యలు
పిచ్చుకల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ పక్షులకు హాని జరుగుతున్నది. వాటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఆహారం, నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.