బాసర భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. కాగా.. భక్తులు తమ చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు నిర్వహించగా.. రూ.1000ల అక్షరాభ్యాసాలు 1590, రూ.100 అక్షరశ్రీకారాలు 2044లు నమోదయ్యాయి. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.32 లక్షల ఆదాయం సమకూరింది.
బాసర, అక్టోబర్ 2 : మూలా నక్షత్రం సందర్భంగా బాసర సరస్వతీ క్షేత్రం ఆదివారం సందడిగా మారింది.దుర్గానవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆదివారం సుహాసిని పూజ, మూలా నక్షత్రపూజ, మంత్రపుష్పం, తదితర పూజలు చేశారు.
అమ్మవారికి మంత్రి ఐకేరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఒడి బియ్యం,పట్టువస్ర్తాలను సమర్పించారు. బాసరకు చేరుకున్న మంత్రికి ఆలయాధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీచైర్మన్ విజయలక్ష్మి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, జడ్పీవైస్ చైర్మన్ బాశెట్టి సాగరాబాయి రాజన్న, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
ఏఎస్పీ కిరణ్‌కారే ఆధ్వర్యంలో సీఐ వినోద్, ఎస్ఐ మహేశ్, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు ఆయా సేవా సంఘాల ఆధ్వర్యంలో నీరు, పాలు, టిఫిన్లు అందజేశారు.
బాసర సరస్వతీ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షరశ్రీకార పూజలు చేయించారు. రూ. 1000 అక్షరాభ్యాసాలు 1590, రూ. 100 అక్షరాభ్యాసాలు 2044 నమోదైనట్లు ఆలయాధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.32 లక్షలఅ ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఆదివారం సుమారు 40 వేల భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు ఆధ్వర్యంలో బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జడ్పీచైర్మన్ విఠల్‌రావు జన్మదినం సందర్భంగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.