e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జగిత్యాల రాక్‌గార్డెన్‌.. అదిరెన్‌

రాక్‌గార్డెన్‌.. అదిరెన్‌

రాక్‌గార్డెన్‌.. అదిరెన్‌

బృందావనంలా కరీంనగర్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రం
రాంనగర్‌, మే 29 : కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ బృందావనాన్ని తలపిస్తున్నది. పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఆలోచనతో పచ్చలహారంగా మారింది. రాతి నిర్మాణాలు, వివిధ రకాల అటవీ జంతువుల బొమ్మలు, వాటి నడుమ నీటి కొలనులతో రాక్‌ గార్డెన్‌ ఇటీవలే రూపుదిద్దుకున్నది. నగరానికి వన్నె తెస్తూ, సందర్శకులకు ఆహ్లాదం పంచుతున్నది.

చిట్టడవుల పెంపకంతో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందిన కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి.. కరీంనగర్‌ శివారులోని కమిషనరేట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (సీపీటీసీ)ను బృందావనంలా తీర్చిదిద్దుతున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న గుట్టలతో ఉన్న శిక్షణ కేంద్రంలోని స్థలాన్ని దశల వారీగా చదును చేస్తూ పోలీస్‌శాఖ అవసరాలకు వినియోగించుకున్నారు. ప్రాజెక్టు-2లో చెట్ల పెం పకం చేపట్టిన తర్వాత అక్కడున్న కొద్దిపాటి స్థలం లో చిన్న చిన్న రాళ్లతో గుట్టలు అలాగే ఉండేవి. వాటిని ఆకర్షణీయంగా మారిస్తే సెంటర్‌ నందనవనంలా ఉంటుందని సీపీ భావించారు. కలెక్టర్‌ శశాంక, కార్పొరేషన్‌, వ్యవసాయ, అటవీశాఖ అధికారులతో రాక్‌ గార్డెన్‌ ఏర్పాటుపై చర్చించారు. అనుకున్నదే తడువుగా ప్రణాళికలు సిద్ధం చేయిం చి, పనులు ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే రాక్‌గార్డెన్‌ సిద్ధమైంది. చిన్న పాటి గుట్టలకు అదనపు హంగులు జోడించ డంతో అందంగా ముస్తాబైంది. ఫిష్‌పౌండ్‌ నిర్మించారు. కూర్చునేందుకు వీలుగా రాళ్లను ఒక చోట చేర్చి గద్దెలను ఏర్పాటు చేయించారు. ఇంకో చోట చెట్ల మొదళ్లతో కుర్చీలను తయారు చేయించి వేయించారు. జలపాతం మీదుగా నడిచేందుకు కర్రలతో వంతెన కూడా నిర్మించారు. వీటికి తోడు అందులో తిరుగుతున్నంత సేపు అడవిలో ఉన్నట్లు అనిపించేలా అటవీ జంతువులు, పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24న మంత్రి గంగుల కమలాకర్‌ రాతి వనాన్ని ప్రారం భించారు. లాక్‌డౌన్‌ తర్వాత పర్యాటకులను అనుమతించనున్నారు.

యాదాద్రి మోడల్‌ తరహాలో చిట్టడివి..
సీపీ కమలాసన్‌రెడ్డి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్లు, శిక్షణ కేంద్రాలు అని విడిచి పెట్టకుండా పోలీస్‌శాఖకు సంబంధించిన అన్ని ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్‌ తరహాలో చిట్టడవుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రాజెక్టు-1 కింద ఎకరం స్థలంలోనే పది వేల మొక్కలు నాటి సంరక్షించారు. ప్రాజెక్టు-2లో భాగంగా 12,500 మొక్కలు నాటగా, రెండేళ్ల కాలంలోనే అడవిని తలపిస్తున్నది. వాకింగ్‌ కోసం ట్రాక్‌లు వేశారు. ప్రస్తుతం వాకర్స్‌ను అనుమతిస్తున్నారు. ఇంకా నవగ్రహ వనం కూడా ఏర్పాటు చేశారు. అందులో గ్రహాలు, రాశులకు తగినట్లు మొక్కలను నాటించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాక్‌గార్డెన్‌.. అదిరెన్‌

ట్రెండింగ్‌

Advertisement