e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు సఫాయిలే సిఫాయిలై

సఫాయిలే సిఫాయిలై

సఫాయిలే సిఫాయిలై

విపత్కర పరిస్థితుల్లో
సామాజిక స్ఫూర్తి
కరోనా సమయంలో కీలక బాధ్యతలు
సడలని ధైర్యంతో పారిశుధ్య పనులు
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు
కొవిడ్‌పై పోరులో ముందు..

వరంగల్‌, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఐనవోలు : కరోనా కారణంగా ఇప్పుడు గాలిని కూడా నమ్మలేని దుస్థితి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కోడికూతకన్నా ముందే లేచి.. తిరిగి అర్ధరాత్రి వరకు వైరస్‌కు ఎదురు నిలుస్తూ నిర్విరామ సేవలందిస్తున్న సఫాయిలు.. సిపాయిలకు ఏమాత్రం తక్కువకాదు. పల్లె, పట్టణం తేడా లేకుండా ఎక్కడ చెత్తాచెదారం ఉన్నా వెంటనే డంప్‌యార్డులకు తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వీధుల్లో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేస్తూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ వైరస్‌ను దరిచేరనివ్వకుండా చూస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ విస్తృతి కారణంగా బయటకు రావాలంటే భయపడుతున్న ఈ తరుణంలో.. కొవిడ్‌ సోకిన వ్యక్తుల ఇండ్ల ఆవరణల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుధ్య పనులు చేపడుతూ అందరి మన్ననలూ చూరగొంటున్నారు.
పంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకట్ట వేసే వారిలో పారిశుధ్య కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌పై పోరులో ఊరు, పట్టణం, నగరం.. ఎక్కడైనా సరే వారే ముందుండి పనిచేస్తున్నారు. అర్ధరాత్రి సైతం రోడ్లు, వీధులతో పాటు వైద్యశాలలనూ శుభ్రపరుస్తున్నారు. కరోనా వైరస్‌ భయంతో సొంత ఇంట్లో వాళ్లకు సేవ చేయలేని పరిస్థితిలో ఉంటే.. సఫాయి కార్మికులు మాత్రం అందరి ఇండ్లలోని చెత్తను ప్రతి రోజూ తొలగించి ఆరోగ్యాలను కాపాడుతున్నారు. అందరినీ కాపాడే బాధ్యతతో పారిశుధ్య కార్మికులు తెల్లారకముందే విధుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అండదండలే వారికి ధైర్యం కలిగిస్తున్నాయి. కరోనా బాధితుల ఇండ్లలోని చెత్తను స్వయంగా సేకరించి ఊరి అవతలకు చేర్చుతున్నారు.

మెరుగైన పారిశుధ్య నిర్వహణ..
రాష్ట్రంలోని దాదాపు 140 నగరాలు, పట్టణాలతోపాటు 12,751 పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ పెద్ద సవాలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్ఫూర్తితో ఎప్పుడూ లేని స్థాయిలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడింది. ఈ విజయంలో పారిశుధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి రోజూ సగటున 15 వేల టన్నుల చెత్త పోగవుతున్నది. మున్సిపల్‌ శాఖ పరిధిలోని దాదాపు 35వేల మంది పారిశుధ్య కార్మికులు దీన్ని నిర్వహిస్తున్నారు. నగరాలు, పట్టణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. గ్రామీణ ప్రజలు ఎక్కువగా సొంతంగానే చెత్త తరలిస్తారు. ఈ వసతి లేని చెత్త దాదాపు 10 వేల టన్నుల వరకు ఉంటోంది. దీని నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసింది. పారిశుధ్య కార్మికులు ఊర్లను క్లీన్‌ చేస్తున్నారు. మొక్కలను నాట డం, పరిరక్షించడంలోనూ వీరే కీలకంగా పనిచేస్తున్నారు. ఇలా సఫాయి కార్మికుల కృషితో పారిశుధ్య నిర్వహణలో తెలంగాణ ఎంతో ముందంజలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏటా అవార్డులు ఇస్తున్నది.

మహమ్మారికి ఎదురొడ్డి..
రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులు 40 ఏండ్లు దాటిన వారే ఉన్నారు. వీరంతా మహమ్మారి కరోనాకు ఎదురొడ్డి నిలుస్తున్నారు. నిత్యం చెత్త, వ్యర్థాల నిర్వహణలో పాలుపంచుకొని మనందరినీ కరోనా బారి నుంచి కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నారు. బాధితులు చికిత్స పొందుతున్న హాస్పిటళ్లు, హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి నుంచీ వ్యర్థాల నిర్వహణ వీరే చూస్తున్నారు. జనం ఎక్కువగా ఉండే మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లోనూ వైరస్‌ వ్యాప్తి జరుగకుండా సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేస్తున్నారు. కరోనా బాధితులు హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు, అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పడు వీరే మార్గదర్శకులుగా వారి వెంట ఉంటున్నారు.

కష్టమైనా.. తృప్తి
కరోనా సమయంలో పారిశుధ్య పనులు చేయడం కష్టంగానే ఉంటుంది. అందరు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. అదే ఎంతో తృప్తిగా ఉంది. చిన్న ఉద్యోగులమైనా పెద్ద పని చేస్తున్నామని అనిపిస్తోంది. మా పని మేం చేస్తున్నం. సర్కారు మమ్మల్ని గుర్తించింది. ప్రజలూ గుర్తిస్తున్నరు.

  • మరిపెల్లి దుర్గ, పారిశుధ్య కార్మికురాలు

గౌరవంగా చూస్తున్నారు
కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులను ప్రజలు గౌరవంగా చూస్తున్నారు. గతంలో చిన్నచూపు చూసేవారు. వైరస్‌ బాధితులు ఉన్న కాలనీల్లో సైతం పారిశుధ్య పనులు చేస్తున్నాం. కరోనా కాలంలో పనులు చేస్తున్నామంటే కుటుంబం నుంచీ సహకారం అందుతోంది. అధికారుల ప్రోత్సాహంతో పారిశుధ్య పనులు ధైర్యంగా చేస్తున్నాం. అధికారులు మా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

  • కుమ్మరి విజయ, పారిశుధ్య కార్మికురాలు

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజూ మేము మా పని చేస్తున్నాం. 14 ఏళ్లుగా నేను పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. గతంలో ఇలాంటి సందర్భాలు రాలేదు. కరోనా నుంచి ప్రజలు అనేక విషయాలు నేర్చుకున్నారు. ఎవరికి వారు తమంట తామే పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు.

  • గట్టయ్య, పారిశుధ్య కార్మికుడు, ఐనవోలు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సఫాయిలే సిఫాయిలై

ట్రెండింగ్‌

Advertisement