e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home ఖమ్మం గడప దాటని పల్లెలు

గడప దాటని పల్లెలు

గడప దాటని పల్లెలు

స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా కట్టడి
కొవిడ్‌పై పెరుగుతున్న అవగాహన

లక్ష్మీదేవిపల్లి /అశ్వారావుపేట రూరల్‌, మే 26: ఆ పల్లెవాసులు గడప దాటడం లేదు. స్వీయ నిర్బంధం పాటిస్తూ కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నాయి. ఇంట్లో చిన్నాపెద్దా భేదం లేకుండా ఆట పాటలతో సందడిగా గడుపుతున్నారు. ఏదైనా అత్యవసరమైతే ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకొస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటలలోపే నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. 10 తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తున్న వేళ వైరస్‌ నియంత్రణలో చైతన్యం ప్రదర్శిస్తున్న పల్లెలు, గిరిజన తండాలు, గూడేలపై ప్రత్యేక కథనం. -లక్ష్మీదేవిపల్లి/ అశ్వారావుపేట రూరల్‌, మే 26

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పల్లెవాసులు చైతన్యాన్ని కరబరుస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ వైరస్‌ను కట్టడి చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గ్రామాలు, తండాలు, గిరిజన గ్రామాలు, గూడేల ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. నిత్యావరాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపే కొనుగోలు చేస్తున్నారు. 10 తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. దుకాణాలు, అరుగుల వద్ద ఎప్పుడూ సందడిగా కనిపించే ప్రదేశాలన్నీ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి.

జాగ్రత్తలు పాటిస్తూ..
పల్లెవాసులు కరోనాను నివారణకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆరోగ్య స్పృహ ప్రతిఒక్కరిలోనూ పెరిగింది. మాంసం, పండ్లు, పాలు.. వంటి బలవర్థక ఆహారం తీసుకుంటున్నారు. అరటి పండ్లు, పుచ్చకాయలు, కొబ్బరిబోండాలు, మామిడిపండ్ల కొనుగోళ్లు పెరిగాయి. పాతకాలంలో తాగిన జావలు మళ్లీ తాగడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి అంతా కుటుంబంతోనే కాలక్షేపం చేస్తున్నారు. పెద్దలు టీవీలు చూస్తూ, పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటూ కనిపిస్తున్నారు. గతంలో పనులకు వెళ్తూ ఉండి కుటుంబాన్ని మిస్‌ అయినవారంతా ఇప్పుడు పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు.
వలస గ్రామాల్లో చైతన్యం..
అశ్వారావుపేట మండలంలోని చెన్నాపురం కాలనీ, రేగళ్ల, జీల్లేడుపాకల, దేవరకొండ, సెద్దమిద్ది, ఉరుమలబండ, రమణక్కపేట కాలనీ, బండారుగుంపు కాలనీ వలస గ్రామాలు. ఇక్కడ నివసించే గిరిజనులు గొత్తికోయలు. వీరంతా ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. వీరంతా ఇక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు తీసుకుని ప్రభుత్వ ఫలాలూ పొందుతున్నారు. కరోనా సమయంలో గొత్తికోయలు చైతన్యాన్ని కనబరస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు వస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ స్థానికంగా దొరికే కూలి పనులకు వెళ్తున్నారు.
రసాయనాలు లేని పదార్థాల వాడకం..
దాదాపు వీరంతా పోడు వ్యవసాయమే చేస్తారు. సాగులో వీరు క్రిమి సంహారక మందులు వాడరు. ఇప్పటికీ వీరు ఆహారంలో సామలు, కొర్రలు, తెల్ల, పచ్చ జొన్నలు, అరికలు వాడతారు. దుంపలను స్వయంగా పండిస్తారు. గుమ్మడి, అనప మొక్కలను ఇంటి వద్దే పెంచుకుంటారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోకపోయినా, ఏ ఆహారంలో ఏమి ఉందని తెలియకపోయినా వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారు. సీ విటమిన్‌ ఉన్న పండ్లు తినడమే అందుకు కారణం. ఇక్కడ నివసించే వారిలో పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ లేవు. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ గ్రామాలు క్షేమంగా ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గడప దాటని పల్లెలు

ట్రెండింగ్‌

Advertisement