e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు దూదిపూల సాగు.. బహుబాగు..

దూదిపూల సాగు.. బహుబాగు..

దూదిపూల సాగు.. బహుబాగు..

ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
మద్దతు ధర పెంపుతో రైతుల ఆసక్తి
ఈ ఏడాది 76,662 హెక్టార్లలో సాగు

మంచిర్యాల, జూన్‌ 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, జన్నారంతో కలిపి 5 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లిలో రెండు, చెన్నూర్‌లో 4, లక్షెట్టిపేటలో ఒకటి కలుపుకొని మొత్తం ఏడు జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. వీటి వద్ద భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలో ప్రధాన పంటలు పత్తి, వరి, కందులు, మొక్కజొన్న కాగా, నైరుతి రుతుపవనాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఏడాదిలో సాధారణ వర్షపాతం 1126.7 మి.మీగా నమోదవుతున్నది. 48 శాతం మాత్రమే ప్రాజెక్టులు, బావులు, చిన్న నీటి వనరుల ద్వారా పండిస్తారు. మిగిలిన 52 శాతం వర్షాల మీదే ఆధారపడి సాగు చేస్తుంటారు. 18 మండలాల్లో వరి లక్షా 60 వేల ఎకరాల్లో పండిస్తుండగా, పత్తి లక్షా 90 వేల ఎకరాల్లో సాగవుతున్నది. జిల్లాలో అత్యధికంగా భీమిని మండలంలో 25,950 ఎకరాలు, కోటపల్లిలో 22,287 ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. వరిని మించి దూదిపూల సాగుకు మొగ్గు చూపుతున్నారు. కాగా జొన్న 150 ఎకరాలు, మక్క 278 ఎకరాల్లో సాగవుతున్నది. 2019-20లో పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.5,550 కాగా, 73,627 హెక్టార్లలో 10,31,610 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సీసీఐ 5,77,075 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. 2021లో వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారంగా 76,662 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.5,725 కాగా, ఈ సీజన్‌లో 19,74,722 క్వింటాళ్ల (19.74 లక్షల) దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం సీసీఐ ద్వారా చెన్నూర్‌, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, ఇందారం కలిపి నాలుగు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు సీసీఐ 5,25,00 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది.

ప్రధాన పంటగా పత్తి..
జిల్లాలో పత్తి సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఏటా లాభాలు వస్తుండడంతో దూదిపూల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడం.. గిట్టుబాటు ధరలు రావడంతో చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో భారీగా పత్తి సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఏటా మద్దతు ధరలు పెరుగుతుండడంతో రైతులు ఏటికేడాది పత్తి సాగుపై దృష్టి సారిస్తున్నారు. సకాలంలో రైతుబంధు పెట్టుబడి సాయం, పంట రుణాలతో పాటు ఎరువులు, విత్తనాలు అందిస్తుండడంతో పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ప్రధాన పంట పత్తి, వరి, పప్పులు కాగా, ఇతర పంటలనూ తక్కువ ఎకరాల్లో పండిస్తున్నారు.

- Advertisement -

లక్షా 90 వేల ఎకరాల్లో..
ఈ యేడాది జిల్లాలో 3,62,360 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 1,90,000 ఎకరాల్లో పత్తి, 1,60,000 ఎకరాల్లో వరి, 100 ఎకరాల్లో పల్లి, 900 ఎకరాల్లో పెసలు, 60 ఎకరాల్లో మినుములు, 11,000 ఎకరాల్లో కందులు, ఇతరాలు 300 ఎకరాల్లో పంట వేసేలా ప్రణాళికలు రచించారు. జిల్లాలో వ్యవసాయ భూమి 3,62,556 ఎకరాలు కాగా, ఉద్యానవన (హార్టికల్చర్‌) ప్రాంతం 20,749 ఎకరాల్లో ఉంది. ఇందుకోసం సరిపడా, విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు సరిపడా విత్తనాలు తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం పంటలు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. విత్తనాలు, ఎరువుల కోసం నివేదికను రూపొందించారు. కాగా, జిల్లాకు సంబంధించిన వరి, పత్తి, పెసర, మొక్కజొన్న, పల్లి, మినుములు, పెసలు, కందులకు సంబంధించిన ఇండెంట్‌ను మండలాలవారీగా తయారు చేశారు. జిల్లాలో 18 మండలాల వారీగా ఇండెంట్‌ తయారు చేసి నివేదికలు పంపించారు. పత్తి 4.75 లక్షల ప్యాకెట్లు, వరి 3,200 క్వింటాళ్లు, జొన్న 120.1 క్వింటాళ్లు, పల్లి 25.1 క్వింటాళ్లు, మినుములు 4.8 క్వింటాళ్లు, పెసలు 72 క్వింటాళ్లు, కందులు 880 క్వింటాళ్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనావేశారు. కాగా, రబీ సీజన్‌లో వరి, మొక్కజొన్న, నూనె విత్తనాల పంటలు ఎక్కువగా వేస్తుంటారు.

పత్తికి అనువైన నల్ల, ఎర్ర నేలలు..
జిల్లాలో ఏడాదిలో సాధారణ వర్షపాతం 1126.7 మి.మీగా నమోదవుతున్నది. 52 శాతం పంటలు వర్షాధారమైనవి. కాగా, 48 శాతం భూమిలో ప్రాజెక్టులు, చెరువులు, బావుల సాయంతో పంటలు పండిస్తున్నారు. జూన్‌ మూడో వారంలో వర్షాలు ప్రారంభమవుతాయి. జిల్లాలో సాధారణంగా 11 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, 30 నుంచి 48.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జిల్లాలో 65 శాతం నల్ల నేలలు, 30 శాతం ఎరుపు, 5 శాతం ఇసుక నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అధిక శాతం రైతులు పత్తి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటి అవసరం, ఎక్కువ కాలం పదును ఉండడంతో జిల్లా కర్షకులు దూదిపూల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

మేలు రకం విత్తనాలు అందిస్తున్నాం..
దిగుబడులు పెరుగడం, మద్దతు ధర లభిస్తుండడంవంటి కారణాలతో రైతులు పత్తి పంటపై మక్కువ చూపుతున్నారు. రైతులందరూ వ్యవసాయ శాఖ సిబ్బంది సూచనలు, సలహాలు పాటించాలి. నకిలీ విత్తనాల అమ్మకాల నియంత్రణకు పోలీసు శాఖ సహాయంతో కృషి చేస్తున్నాం. రైతులకు మేలు రకమైన విత్తనాలు అందించి అధిక దిగుబడికి కృషి చేస్తున్నాం.

  • వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి, మంచిర్యాల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దూదిపూల సాగు.. బహుబాగు..
దూదిపూల సాగు.. బహుబాగు..
దూదిపూల సాగు.. బహుబాగు..

ట్రెండింగ్‌

Advertisement