e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు కలిసికట్టుగా..

కలిసికట్టుగా..

కలిసికట్టుగా..

ఇంటికే పరిమితమవుతున్న ప్రజలు
అత్యవసరమైతేనే బయటకు..
6-10 గంటల వరకే వ్యాపారాలు
ప్రయాణాలు, ఫంక్షన్లకు దూరం
రోజురోజుకూ కేసులు తగ్గుముఖం

మంచిర్యాల, మే 19, నమస్తే తెలంగాణ: మంచిర్యాల జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌కు ప్రజలు, వ్యాపారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ 10 గంటల్లోగా పనులు ముగించుకుంటున్నారు. ఆ తర్వాత ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా వ్యాపారులు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, పూర్తిగా సహకరిస్తున్నారు. తమతోపాటు వినియోగదారుల ఆరోగ్యమూ ముఖ్యమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొంత నష్టం వాటిల్లినా, ఆపత్కాలంలో కట్టుబాట్లు తప్పవని చెబుతున్నారు. ఇలా సబ్బండవర్గాలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. -మంచిర్యాల, మే 19(నమస్తే తెలంగాణ)

కరోనా రెండో దశ కట్టడిలో ప్రజలు, వ్యాపారులతో పాటు ఇతర వర్గాల వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేలా తోడ్పాటునందిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు వస్తున్నారు. నిత్యావసర వస్తువులు, ఇతర పనులు పూర్తి చేసుకొని పది గంటల వరకు ఇండ్లకు చేరుకుంటున్నారు. సడలింపు సమయంలోనూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారు. మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వస్తువులు కొంటున్నారు. మాస్క్‌ ఉన్నవారికి, నిబంధనలు పాటిస్తున్నవారికే దుకాణాదారులు సామగ్రి ఇస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములవుతున్నారు.

తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా విందులు, వినోదాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చారు. లాక్‌డౌన్‌ దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఈ విధంగా తమ వ్యక్తిగత కార్యక్రమాలు, వ్యాపార లావాదేవీలను దూరం చేసుకుంటూ కరోనా కట్టడికి ప్రజలు, వ్యాపారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అధికారుల సేవలు, నిరంతర పర్యవేక్షణ, ప్రజలు, వ్యాపారులతో పాటు సబ్బండ వర్గాల సమష్టి కృషితోనే లాక్‌డౌన్‌ విజయవంతమవుతున్నది. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో నిబంధనలు ఏర్పరుచుకొని, వాటిని అమలు చేస్తూ కరోనా వైరస్‌ దరిచేరకుండా స్వీయనిర్బంధంలో ఉంటున్నారు.

తగ్గుముఖంలో కరోనా కేసులు
జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 1300కు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే 24 శాతం వరకు పాజిటివ్‌ వస్తున్నాయి. 15వ తేదీ నుంచి కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారి కాంటాక్ట్‌ను గుర్తించి అధికారులు వైద్యం అందిస్తున్నారు. ఇంటింటా ఫీవర్‌ సర్వే ద్వారా లక్షణాలు గుర్తించి స్వల్పంగా ఉన్నవారికి అక్కడికక్కడే మందులు ఇస్తున్నారు. నాలుగు రోజుల వరకు లక్షణాలు తగ్గకుంటే మెరుగైన వైద్యం కోసం దవాఖానకు తరలిస్తున్నారు. ప్రైవేట్‌ దవాఖానల్లో పరిస్థితిపై కలెక్టర్‌ భారతీ హోళికేరి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కరోనా రోగుల వివరాలు, తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలో 300- 500 వరకు, ఒక్కో రోజు అంతకుమించి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా బాధితులు మంచిర్యాలకు చికిత్సకోసం తరలివచ్చారు. ఈ నెల 12 నుంచి లాక్‌ డౌన్‌లో భాగంగా అధికారులు చెక్‌ పోస్టుల వద్ద రాకపోకలు, నిబంధనలు కఠినతరం చేయడంతోనూ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రజల్లో అవగాహన రావడం, ఇండ్లకే పరిమితవుతుండడంతోనూ గతంతో పోలిస్తే పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 12న జిల్లాలో 161 నమోదు కాగా, 13న 130, 14న 139 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 15వ తేదీ తర్వాత నుంచి ప్రజల్లో వచ్చిన పెను మార్పులతో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 16న 89 , 17న 122, 18న 109 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒకప్పుడు 500 వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 100కు చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

పదింటి వరకే అమ్ముతున్నం..
కన్నెపల్లి, మే 19 : ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టడంతో పొద్దున పది గంటల వరకే కూరగాయలను అమ్ముతున్నాం. ఇంతకు ముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మేవాళ్లం. ఇప్పుడు కరోనా ఊళ్లళ్లకు కూడా వచ్చింది. అది ఎక్కువ అవుతున్నదని మేం కూడా పొద్దున పదికి బంద్‌ చేస్తున్నం.కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొంటేనే అందరూ బాగుంటరు. బతికి ఉంటే ముందుముందు రోజంతా అమ్ముకోవచ్చు.

  • నికాడి సుజాత, కూరగాయల వ్యాపారి, కన్నెపల్లి

పాజిటివ్‌ కేసులు తగ్గడం సంతోషం.
చెన్నూర్‌, మే 19 : నేను వాచ్‌ రిపేరింగ్‌ సెంటర్‌ తో పాటు మొ బైళ్లు అమ్ముతుంటా. ఇంతకుముందు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు షాపు నడిపేది. మధ్యలో భోజనానికి వెళ్లినా మా ఇంట్లో వాళ్లు దుకాణంలో ఉండేవారు. ఎక్కువగా పల్లెటూరి గిరాకే ఉండేది. లోకల్‌ వారు దుకాణానికి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నం. ఆర్థికంగా ఇబ్బందైనా లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుతుండడం సంతోషంగా ఉంది.

  • నేరెడుకొమ్మ వెంకటరమణ, వాచ్‌ సెంటర్‌, గాంధీచౌక్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కలిసికట్టుగా..

ట్రెండింగ్‌

Advertisement