e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు కరోనా కన్నుపడని పల్లెలు

కరోనా కన్నుపడని పల్లెలు

కరోనా కన్నుపడని పల్లెలు

ముందస్తుగా అప్రమత్తమైన గ్రామాలు
వైరస్‌ కట్టడికి దోహదపడిన అవగాహన కార్యక్రమాలు
పకడ్బందీగా లాక్‌డౌన్‌ నిబంధనల అమలు
సత్ఫలితాలనిచ్చిన పంచాయతీల చర్యలు

పెద్దపల్లి, జూన్‌ 17(నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్‌ రూరల్‌:ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేసిన కరోనాను ఆ పల్లెలు సమర్థవంతంగా కట్టడి చేశాయి. రోజూ పారిశుధ్య పనులతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలతో వైరస్‌ మహమ్మారి తమ గ్రామాల్లోకి రాకుండా చూడడంలో సఫలీకృతమయ్యాయి. దీనికి తోడు వంద శాతం వ్యాక్సినేషన్‌ దిశగా గ్రామస్తులను ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

కరోనా చింతలేని లక్ష్మీదేవిపల్లి
పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిన గ్రామం లక్ష్మీదేవిపల్లి. ప్రపంచాన్ని వణికించిన కరోనాకు జంకలేదు. ఈ గ్రామం మండల కేంద్రానికి దాదాపు 13కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జనాభా మూడంకెల లోపే. గ్రామస్తులంతా దాదాపు వ్యవసాయం చేసుకునే జీవిస్తారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ గ్రామంలో కరోనా రెండు దశల్లోనూ ఒక్క కేసు నమోదు కాలేదు. గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడగా, కరోనా వచ్చిన తర్వాత ఇక్కడ హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వారికి తప్ప గ్రామంలో నివసిస్తున్న ఎవరికీ వైరస్‌ సోకలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కరోనా మొదటి వేవ్‌లో చాలా గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు వచ్చిన తరుణంలో సర్పంచ్‌ కరివేద పద్మజ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. దీంతో సెకండ్‌ వేవ్‌లోనూ పక్కనున్న గ్రామాల్లో పెద్ద మొత్తంలో కేసులు నమోదైనప్పటికీ ఈ ఊరిలో ఒక్కరూ కరోనా బారిన పడలేదు.

- Advertisement -

నేదునూర్‌ సైతం ఆదర్శం..
లక్ష్మీదేవిపల్లి గ్రామానికి ఆనుకునే ఉండే మరో గ్రామం నేదునూర్‌. ఈ గ్రామంలో సైతం ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. కానీ, ఇటీవలే గ్రామానికి చెందిన వారి ఇంటికి బంధువులు రాగా, వారి ద్వారా ఓ కుటుంబంలోని ఇద్దరికి సోకింది. అవి తప్ప ఈ గ్రామంలో సైతం కొవిడ్‌ కేసులు లేవు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడం, సర్పంచ్‌ వడ్లూరి శంకర్‌ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం నేదునూర్‌ కరోనా రహితంగా నిలిచేందుకు దోహదపడింది.

పాలకవర్గ నిర్ణయం.. మల్లెపల్లి ఆదర్శం
కరోనా కట్టడిలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లెపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది. 800 జనాభా ఉన్న ఈ గ్రామంలో కరోనా మొదటి వేవ్‌లో ఆరుగురికి పాజిటివ్‌ రాగా, అప్రమత్తమైన గ్రామ సర్పంచ్‌ ఎరుకల తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి అమీనాభానుతో పాటు పాలకవర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాల అమలుకు ప్రజలంతా సంపూర్ణ సహకారం అందించారు. ఈ మేరకు నేటికీ గ్రామంలోకి బంధువులు, ఇతరులెవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తవారు ఎవరింటికైనా వస్తే వారిని ఇంట్లోనే వారం రోజులు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఇంట్లోని వారు సైతం వారం పాటు బయటకు వెళ్లే అవకాశం లేదు. ప్రజలు సైతం అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఇక వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వారు సైతం మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఎవరు నిర్లక్ష్యం చేసినా రూ.100 జరిమానా వేయాలని నిర్ణయించారు. ఎవరు బయటకు వెళ్లి వచ్చినా స్నానం చేసి, శానిటైజ్‌ చేసుకున్న తర్వాతే ఇంట్ల్లోకి వెళ్తున్నారు. ఎవరికైనా ఏవైనా నిత్యావసర సరుకులు అవసరం ఉంటే అందరూ మంథనికి వెళ్లి తెచ్చుకోకుండా రోజుకు ఒకరు, ఇద్దరు మాత్రమే అందరికీ అవసరమైన సరుకులను కొని తెచ్చి వారికి అప్పగిస్తున్నారు. ఇలాంటి చర్యల కారణంగా అసలు గ్రామం నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తద్వారా గ్రామంలో కరోనా రెండో వేవ్‌ ప్రభావం లేకుండా పోయింది. కాగా, గ్రామంలో ఇప్పటికే 45ఏళ్లు దాటిన వారిలో 92శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తికావడం గమనార్హం.

అందరి సహకారంతోనే కరోనా కట్టడి..
గ్రామంలోని ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్లే కరోనాను గ్రామంలోకి రాకుండా చేశాం. పంచాయతీ కార్యదర్శి, ఆశ వర్కర్‌, అంగన్‌వాడీ కార్యకర్త, గ్రామైక్య సంఘం సభ్యులందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రజలు మా నిర్ణయాన్ని గౌరవించి పాటించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఊళ్లో అసలు ఫంక్షన్‌ అనేదే జరుగలేదు. ప్రజలు పెండ్లిళ్లు, ఫంక్షన్లు అన్నీ వాయిదా వేసుకున్నారు. మా ఊరి ప్రజలంతా చాలా కట్టు మీద ఉన్నారు. అందుకే కరోనా దరిచేరలేదు.
-ఎరుకల తిరుపతమ్మ, మల్లెపల్లి సర్పంచ్‌ (మంథని మండలం)

యాప్‌ డైరెక్షన్‌తో పని సులువైంది..
పంచాయతీ పాలకవర్గం పనితీరు, ప్రజల సంపూర్ణ సహకారంతో పాటు ‘పల్లె ప్రగతి ఫర్‌ పీఎస్‌’ యాప్‌ డైరెక్షన్‌తో గ్రామంలోకి కరోనాను రాకుండా చేశాం. ప్రతి రోజు వీధుల్లో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తున్నాం. రోజూ రెండు రోడ్లు, రెండు డ్రైనేజీలు శుభ్రం చేయాలని, ప్రాథమిక, అంగన్‌వాడీ స్కూల్స్‌లో పారిశుధ్య పనులు చేపట్టాలనే సూచనలు కూడా ఆ యాప్‌ నుంచే వస్తున్నాయి. ఆ ప్రకారం పనులు చేయడం వల్లే స్వచ్ఛపల్లెగా మారి కరోనాకు చోటు లేకుండా పోయింది.

  • అమీనాభాను, మల్లెపల్లి పంచాయతీ కార్యదర్శి ( మంథని మండలం)

అవగాహన కల్పించాం..
మా గ్రామానికి కరోనా రాకపోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మొదటి సారి కేసులు వచ్చినప్పుడే వ్యాధి పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే రెండో వేవ్‌లో సైతం గ్రామస్తులకు అవగాహన కల్పించి, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశాం. గ్రామ సిబ్బందితో శానిటేషన్‌ ఎప్పటికప్పుడు చేయించి, శుభ్రంగా ఉంచాం. గ్రామస్తులు సైతం ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండడంతో కరోనా రాలేదు. మా పల్లె చిన్నదైనా.. ప్రేరణ పెద్దది.
-కరివేద పద్మజ, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌(తిమ్మాపూర్‌ మండలం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కన్నుపడని పల్లెలు
కరోనా కన్నుపడని పల్లెలు
కరోనా కన్నుపడని పల్లెలు

ట్రెండింగ్‌

Advertisement