ధర్మారం,మే16: కరోనా బాధితులకు దాతల సహాయం కొనసాగుతున్నది. ఇంటి వద్దకే ఆహా రం అందుతున్నది. ధర్మారం మండలం నర్సింహులపల్లి టీఆర్ఎస్వై గ్రామ శాఖ అధ్యక్షుడు పంబాల మధూకర్ కరోనా బాధితులకు భోజనం అందిస్తున్నాడు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి ఇంట్లో భోజనం వండుకోలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి సాయం చేయాలని ఆయన సంకల్పించాడు. నర్సింహుపల్లి, బుచ్చయ్యపల్లికి చెందిన 10 మంది కరోనా బాధితులకు నాలుగు రోజుల నుంచి రోజు రెండు పూటలా భోజనాన్ని వారి ఇం డ్లకు వెళ్లి అందిస్తున్నాడు. ఒక పూట చికెన్ రైస్, సాయంత్రం గుడ్డు, కూరగాయలతో భోజనాన్ని పంపిణీ చేస్తున్నాడు. మధూకర్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
మంథని టౌన్, మే 16: కరోనా పేషంట్లు, వలస కార్మికులు, పేదలు, యాచకులకు మంథని మిత్ర బృందం సభ్యులు ఆదివారం ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంథని సీఐ జీ సతీశ్ హాజరై పలువురు కరోనా పేషంట్ల కుటుంబాలకు ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతుల మిన్నా అని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మంథని మిత్ర బృందం సభ్యుల సేవలను ఆయన అభినందించారు. మి త్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ముందుకు రావాలని కోరారు.
పెద్దపల్లి జంక్షన్, మే 16: పెద్దపల్లిలోని కొవిడ్ హోమ్ ఐసొలేషన్ పేషంట్లకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో కొట్టె మంగాదేవి లక్ష్మ య్య వివాహ వార్షికోత్సవం సందర్భంగా మధ్యా హ్నం హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు భో జనాన్ని పంపిణీ చేశారు. అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌కుమార్, జోన్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, కోశాధికారి సంపత్‌రావు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ గుజ్జుల కుమార్, సతీశ్‌రెడ్డి, కౌన్సిలర్ పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయ పూజారికి ..
కోల్‌సిటీ, మే 16: రామగుండం 48వ డివిజన్ పరిధిలోని హనుమాన్ ఆలయ పూజారి రాజరాజేశ్వర సురేశ్ శర్మకు కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్‌గౌడ్ సాయం అందించారు. కరోనా తీవ్రత కారణంగా ఆలయం కొద్ది రోజులుగా మూసి ఉంచడంతో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న పూజారి పరిస్థితి తెలుసుకొని పూజారి సురేశ్ శర్మకు 25 కిలోల బియ్యం, నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమం లో నాయకులు అల్లూరి రమేశ్ చారి, పన్నాల శంకర్, వడ్లకొండ లింగయ్య, కృష్ణ ఉన్నారు.