e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు రెమ్‌డెసివిర్‌' గుట్టురట్టు

రెమ్‌డెసివిర్‌’ గుట్టురట్టు

రెమ్‌డెసివిర్‌' గుట్టురట్టు

ప్రైవేట్‌ దవాఖానలే కేంద్రంగా బ్లాక్‌ దందా
ఒక అంబులెన్స్‌, ఐదు ఇంజెక్షన్లు స్వాధీనం
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

మంచిర్యాల, మే 16, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ బ్లాక్‌ దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. కరోనా బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ అక్రమ దందాకు తెరలేపాయి. అంబులెన్స్‌ డ్రైవర్ల ద్వారా దందా నడిపిస్తున్నాయి. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.30వేలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచి బ్లాక్‌లో విక్రయాలు సాగిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక అంబులెన్స్‌, ఐదు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మంచిర్యాలలోని రెండు ప్రైవేట్‌ హాస్పిటళ్లకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్‌ యజమానులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఇందులో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణికి చెందిన పులి సంతోష్‌, మంచిర్యాల జిల్లా మందమర్రి చెందిన గొట్టె రాజేందర్‌, బెల్లంపల్లికి చెందిన పల్లె రమేశ్‌, మంచిర్యాలకు చెందిన పున్నం రంజిత్‌కుమార్‌ ఉన్నారు. వీరంతా కలిసి ఒక్కో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌కు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయించి అక్రమ దందాకు పాల్పడుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ ఐపీఎస్‌ ఆధ్వర్యంలో పట్టణ సీఐ ముత్తి లింగయ్య, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆదివారం తనిఖీలు చేయగా వీరి వద్ద అక్రమంగా నిల్వ చేసిన రెమ్‌డెసివిర్‌ ఇం జెక్షన్లు లభించడంతో వీరిని అదుపులోకి తీసు కున్నారు. వీరు ఇప్పటివరకు చాలా ఇంజెక్షన్లు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నేరానికి పాల్పడ్డారిలా..
కొవిడ్‌ బారిన పడి చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని రెండు ప్రైవేట్‌ హాస్పిటళ్లకు వచ్చిన బాధితుల వివరాలను సేకరిస్తారు. కరోనా పాజిటివ్‌ మెసేజ్‌, ఆధార్‌కార్డు వివరాలను బాధితుల దగ్గర నుంచి తీసుకుంటారు. తమకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఇప్పిస్తామని చెప్పి నకిలీ డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ తయారు చేసి హైదరాబాద్‌లోని వీరికి తెలిసిన వ్యక్తులకు పంపించి ఒక్కో పాజిటివ్‌ పేషెంట్‌ పేర్లమీద ఆరు ఇంజెక్షన్లు చూపిస్తారు. బాధితులకు మాత్రం అక్కడ స్టాక్‌ అయిపోయిందని, దొరకడంలేదని వేరే దగ్గర ప్రయత్నించామని చెబుతారు. మళ్లీ వారికి ఫోన్‌ చేసి తమకు తెలిసిన వారి దగ్గర రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఉన్నాయని గొట్టె రాజేందర్‌ ( ప్రైవేట్‌ హాస్పిటల్‌ వ్యక్తి) బాధితులకు చెబుతాడు. వారు రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు అడుగుతున్నారని, ఓకే అంటే తెప్పిస్తానని నమ్మబలుకుతాడు. వారు సరే అనగానే పల్లె రమేశ్‌కు సమాచారం ఇస్తాడు. అతను అంబులెన్స్‌ డ్రైవర్లు పులి సంతోష్‌, పున్నం రంజిత్‌కు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇచ్చి బాధితుల దగ్గరకు పంపిస్తారు. వీరిద్దరిలో ఒకరు ముందుగా బాధితుల వద్ద డబ్బులు తీసుకుంటారు. మరో వ్యక్తి అంబులెన్స్‌లో వచ్చి ఇంజెక్షన్‌ను వారికి అప్పగిస్తారు. ఇలా వచ్చిన డబ్బులను నలుగురు పంచుకుంటారు. ఇలా దవాఖానలో ఉన్న బాధితుల వివరాలు సేకరించి వారిలోని భ యాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని రోజులుగా సొమ్ముచేసుకుంటున్నారు.

పరారీలో మరో నిందితుడు..
ఈ నలుగురూ కలిసి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌ చేస్తూ విక్రయిస్తుండగా, పోలీసులు నిఘావేసి మంచిర్యాలలో పట్టుకున్నట్లు ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. మంచిర్యాలకు చెందిన పున్నం రంజిత్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
-ఏసీపీ అఖిల్‌ మహాజన్‌
కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేట్‌ దవాఖానలు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు, డయాగ్నోస్టిక్‌ కేంద్రా ల్లో ప్రభుత్వం, వైద్య శాఖ నిర్ణయించిన ధరల ప్రకారమే డబ్బులు వసూలు చేయాలని ఏసీపీ సూచించారు. హెచ్‌ఆర్‌ సిటీ స్కాన్‌ రూ.3500 వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ధరల పట్టికను ప్రతి దవాఖానలో విధిగా అమలు చేయాలన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దవాఖానల యాజమాన్యాలు సైతం ఇలాంటి కష్టకాలంలో వ్యా పార ధోరణితో కాకుండా కొంత సేవాభావంతో ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. రికార్డులు మా యం చేసే హాస్పిటల్స్‌పై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే దవాఖానలను సీజ్‌ చేయడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమ దందాకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్న మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది సంపత్‌కుమార్‌, సదానందం, వెంకటేశ్‌, రాకేశ్‌, శ్రీనివాస్‌, ఓంకార్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెమ్‌డెసివిర్‌' గుట్టురట్టు

ట్రెండింగ్‌

Advertisement