e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కామారెడ్డి చెక్‌ డ్యాముల్లో చేపల వేట!

చెక్‌ డ్యాముల్లో చేపల వేట!

జలకళతో పుష్కలంగా మత్స్య సంపద
మత్స్యకార్మికులకు అదనపు ఉపాధి.. పెరిగిన ఆదాయం

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్‌ 13: భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు పంట భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెక్‌డ్యాముల నిర్మాణంతో మత్స్యకారులకు అదనపు ఉపాధి, ఆదాయం లభిస్తున్నది. చెక్‌డ్యాములు లేని సమయంలో వాగుల్లో నీరు లేక బోసిపోయేవి. ప్రస్తుతం చెక్‌డ్యాముల నిర్మాణం పూర్తికావడంతో ఎక్కడ చూసినా జలకళ సంతరించుకున్నాయి. దీంతో మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు అవకాశం లభిస్తున్నది.
బాల్కొండ నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు ప్రవహించే కప్పల వాగు, పెద్ద వాగు ఉన్నాయి. వీటిలో గతంలో వానకాలం మాత్రమే కొన్ని రోజులు నీటి ప్రవాహం కనిపించేది. దీంతో చేపల జాడ ఉండేది కాదు. నీటి ప్రవాహం ఉన్న ఆ కొద్ది రోజులు ఎగువ నుంచి వచ్చే చేపలు ప్రవాహంతోపాటే దిగువన గోదావరినదిలోకి జారిపోయేవి. వాగు నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం ఉన్న సమయంలో ఎదురెక్కి వచ్చిన చేపలు తిరిగి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టేకొద్ది, వాగుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఎక్కువ రోజులు చేపలు ఉండేవి కావు. కానీ ఈ రెండు వాగుల్లో చాలా చోట్ల భారీ చెక్‌ డ్యాముల నిర్మాణం చేపట్టారు. చెక్‌ డ్యాములు ఉన్న చోటల్లా వాగులు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బ్యాక్‌ వాటర్‌తో నెలల కొద్దీ జలాశయాల మాదిరిగా నిండుగా ఉంటున్నాయి. దీంతో నాలుగేండ్లుగా చెక్‌ డ్యాముల్లో రెండు మూడు నెలల పాటు చేపల జాడ కనిపిస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ వాగుల పరిసరాల్లోని ఎన్నో గ్రామాల చెరువులు అలుగు పారాయి. దీంతో వాగుల్లోకి ఎగువ నుంచి, చెరువుల నుంచి చేపలు చేరాయని మత్స్యకారులు అంటున్నారు. భారీ వర్షాలతో గోదావరి నదిని చేరే వరకూ నీటి ప్రవాహం కొనసాగడం, ఎస్సారెస్పీ గేట్ల ఎత్తివేతతో నదిలోకి చేరిన కొన్ని చేపలు ఎదురేగి వాగుల్లోకి చేరాయి. దీంతో చేపల లభ్యత కలుగుతున్నదని చెబుతున్నారు.
పెద్ద వాగు, కప్పల వాగుల్లో భీమ్‌గల్‌, వేల్పూర్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లో చెక్‌ డ్యాములు జూలై నెల నుంచే నిండు కుండల్లా మారాయి. అటు చెరువులు నిండుగా ఉండడంతో చేపల వేటకు అనుకూలంగా లేని ఈ సమయంలో చెక్‌ డ్యాముల్లో చేపలు లభ్యం కావడంతో మత్స్యకారులకు కొంత ఉపాధిని ఇస్తున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana