e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు బీజేపీలోకి ఎట్లపోతవ్‌?

బీజేపీలోకి ఎట్లపోతవ్‌?

బీజేపీలోకి ఎట్లపోతవ్‌?

ఏ స్వార్థం కోసం చేరుతున్నవో ప్రజలందరికీ తెలుసు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌
ఎవరైనా బాధలో ఉంటే నవ్వేవాడు : ఎమ్మెల్సీ నారదాసు
రాజీనామాతో నష్టమేమీ లేదు : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌
కార్యకర్తలను తయారు చేసింది టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌
చల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశం

వీణవంక/హుజూరాబాద్‌ రూరల్‌, జూన్‌ 13: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కమ్యూనిస్టు భావాలున్న ఆయన బీజేపీలోకి ఎలా పోతున్నావని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు. నువ్వు ఏ స్వార్థం కోసం వెళ్తున్నావో ప్రజలందరికీ తెలుసుననీ, సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆదివారం వీణవంక మండలం చల్లూరు వేంకటేశ్వర ఫంక్షన్‌ హాలులో టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంతోపాటు హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో మీడియాతో కొప్పుల మాట్లాడారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను ఈటల రాజేందర్‌ తప్పుదోవ పట్టిస్తున్నాడని, నమ్మొద్దని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు వేంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంతోపాటు సింగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏ వ్యక్తి అయినా అందరికంటే తానే గొప్పవాడినని అనుకున్నపుడే ఆత్మగౌరవం అడ్డువస్తుందని, అసలు పంచాయితీ అప్పుడే మొదలవుతుందని తెలిపారు. ఈటల వ్యక్తిగత వ్యాపార లావాదేవీలతో ప్రభుత్వానికి, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఏం సంబంధమని, అనవసరంగా అంటగడుతూ సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీల భూములు స్వాధీనం చేసుకుంటే బాధితులంతా తమ సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తేనే ఈటల మీద చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అతితక్కువ కాలంలో పూర్తి చేసి, సస్యశ్యామలం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని, ప్రాజెక్ట్‌కు ఒక్క పైసా ఇవ్వని, తెలంగాణను అణగదొక్కాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈటల తాకట్టుపెట్టాడని దుయ్యబట్టారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ర్టాలు పోటీ పడుతాయా అని ప్రశ్నించారు. వ్యక్తులు వస్తరు పోతరు.. వ్యవస్థ ముఖ్యమని, కమ్యూనిస్టు భావాలున్న నీవు బీజేపీలోకి ఎలా వెళ్తావని..? ఏ స్వార్థం కోసం వెళ్తున్నావో ప్రజలకు తెలుసునని, అన్నీ గమనిస్తున్నారన్నారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుందని, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన ఘనత ఆ పార్టీదని మండిపడ్డారు. ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు వైద్యం అందజేస్తుందని, కేంద్ర ప్రభుత్వం మాత్రం టీకాలను వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నదని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దుతో రూ.12 లక్షల కోట్లు దేశానికి నష్టం వచ్చేలా చేసింది బీజేపీ అని, కోట్ల రూపాయలు బ్యాంకులకు కన్నం పెట్టిన వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి పార్టీలోకి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో ఏనాడు సీఎం కేసీఆర్‌పై కానీ, సంక్షేమ పథకాలపై కానీ అభిమానం చూపించలేదని, ఎప్పుడు చూసినా ‘జై ఈటల’ అనే నినాదమే తనవాదమని ఈటలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్టం వచ్చాక సీఎం కేసీఆర్‌ అనేక ప్రాజెక్టులు నిర్మించడంతోనే ఇవ్వాళ రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాలకు నీరందుతున్నదని, ఎక్కడ చూసినా సిరుల పంటలు పండుతున్నాయని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
రాజీనామాతో నష్టమేమి లేదు: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఎంతో మంది వస్తరు.. పోతరు.. అలాగే ఈటల రాజీనామా వల్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టమేమి లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ రాకముందు హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు కూడా నిండుకుండలా అలాగే ఉందని, సామాన్య కార్యకర్తగా వచ్చిన ఈటలకు పెద్ద పదవులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అందిస్తున్న టీఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని వివరించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంచితే గ్రామాలు అభివృద్ధిలో పరుగులు తీస్తాయని సూచించారు.
ఎవరైనా బాధలో ఉంటే ఆయన నవ్వేవాడు: ఎమ్మెల్సీ నారదాసు
రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమ పథకాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటే ఒకే ఒక్కరు ఏదో కోల్పోయినట్లు ఉండేవారని, ఆయనే ఈటల రాజేందర్‌ అని, ఇంకా ఎవరైనా బాధలో ఉంటే ఆయన నవ్వేవారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు విమర్శించారు. “2003కు ముందు ఈటల నథింగ్‌.. ఆ తర్వాత సమ్‌థింగ్‌ అయ్యారు. గుండె మీద చెయ్యివేసుకొని చెప్పు.. సంక్షేమ పథకాలపై ఎప్పుడయినా ప్రేమగా మాట్లాడావా.. ఏనాడైనా బీసీల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రతిపాదించావా అని ప్రశ్నించారు. పెద్ద మనసుతో నిన్ను తమ్ముడిలా, కుటుంబ సభ్యుడిగా చూసుకొని పెద్ద పదవులు ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. సమావేశాలలో సంక్షేమ పథకాలను విమర్శించినందుకే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని, కమ్యూనిస్టువని చెప్పుకునే నీవు ఈ రోజు మతతత్వ పార్టీలో ఎలా చేరుతున్నావని అడిగారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్న సీఎం కేసీఆరే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కొనియాడారు. అందరం ఐక్యంగా ఉండి పార్టీ కోసం పని చేసి విజయాన్ని సాధించడానికి కృషి చేయాలని కోరారు. అయినా కడుపునిండినోడికి సంక్షేమ పథకాలు పరిగలాగే కనబడతాయని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి: టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, ఆయనే తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అభివర్ణించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ర్టాన్ని సాధించింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని చెప్పారు. ఈటల చెట్టుపెట్టి నీళ్లు పోయలేదని, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నాయకులను తయారు చేసింది సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. కలిసి పని చేస్తడని ఈటలకు మంత్రి పదవులు ఇచ్చారని, రాష్ట్ర ప్రజలు బాగుపడడం ఆయనకు ఇష్టంలేదని దుయ్యబట్టారు.
టీఆర్‌ఎస్‌తోనే ప్రగతి: ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య
టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం అని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతోనే అన్ని వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య పేర్కొన్నారు. వ్యక్తి కోసం కాకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సూచించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ సూచించిన వ్యక్తిని గెలిపించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారు. ఇక్కడ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బాలకిషన్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, కో ఆప్షన్‌మెంబర్‌ హమీద్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీలు శ్రీదేవి, ప్రభాకర్‌, సర్పంచ్‌లు పొదిల జ్యోతి, ఎంపీటీసీ ఎలవేన సవిత ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీజేపీలోకి ఎట్లపోతవ్‌?
బీజేపీలోకి ఎట్లపోతవ్‌?
బీజేపీలోకి ఎట్లపోతవ్‌?

ట్రెండింగ్‌

Advertisement