e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు రైతుకు రంది లేకుండా..

రైతుకు రంది లేకుండా..

రైతుకు రంది లేకుండా..

అన్నదాత చెంతకే కొనుగోలు కేంద్రాలు
నిర్వహణకు కోట్లాది నిధులు
సెంటర్లలో మౌలిక వసతులు

కరీంనగర్‌, మే 13 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. కరోనా విపత్కర వేళ, ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనైనప్పటికీ సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో పండిన ప్రతి వరి గింజనూ కొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తాము పండించిన గ్రామంలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకొని, మద్దతు ధర పొందేందుకు అవకాశం కల్పించారు. ఒకవైపు రైతులకు మద్దతు ధర అందిస్తూనే, మరోవైపు కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించడం, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించడం, కొనుగోలు చేసిన ఏజెన్సీలకు కమీషన్లు అందిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు. ఐకేపీ, సింగిల్‌ విండో, మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ కాంటాల నుంచి మొదలుకొని అనేక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది.
352 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో 313 గ్రామాలు ఉండగా 352 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 4.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ముందుగానే నిర్ణయించి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. దీనిని బట్టి ఎంత వేగంగా కొనుగోళ్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 281 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా 194 కోట్లు ఆన్‌లైన్‌లో ఫీడింగ్‌ చేశారు. 137 కోట్లు చెల్లించారు. ధాన్యం విక్రయించిన 70 శాతం రైతులకు ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో జిల్లాకు 60 లక్షల గన్నీ బ్యాగులు వచ్చాయి. ఇంకా రూ.6.76 కోట్ల విలువైన 26 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. ప్రతి కేంద్రానికి తేమ శాతం నిర్ధారణ యంత్రాలను సమకూర్చారు. ఒక్కో దానికి రూ.7 వేల వరకు ఉంటుంది. 352 కేంద్రాల్లో చూసుకుంటే సుమారు 24.64 లక్షల విలువైన తేమ శాతం నిర్ధారణ యంత్రాలను సమకూర్చారు. 320 కేంద్రాల్లో మార్కెటింగ్‌ శాఖ ద్వారా ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశారు. వీటికి సుమారు 1.60 కోట్లు ఖర్చు చేశారు. కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేసేందుకు అవసరమైన ట్యాబ్‌లను కూడా గతంలోనే ప్రభుత్వం అందించింది. వీటికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ప్రతి కేంద్రంలో 30 కంటే ఎక్కువ టార్పాలిన్లు ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ ఆదేశించారు. ఈ మేరకు అన్ని కేంద్రాల్లో సమకూర్చుకున్నారు. జిల్లాలో టార్పాలిన్‌ ఒక్క దాని ధర 1600 నుంచి 2 వేల వరకు ఉంది. సగటు ధర చూస్తే 1.90 కోట్లు టార్పాలిన్ల కోసం వెచ్చించారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు జిల్లాలో సుమారు 100 లారీలు, 60 ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి సీజన్‌లో 12 నుంచి 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక కేంద్రాల వద్ద తాత్కాలిక టాయిలెట్స్‌ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే అన్ని వసతులను కలుపుకొని (ధాన్యం ఖరీదు కాకుండానే) చూస్తే సగటున ఒక్కో కేంద్రం నిర్వహణకు 8 లక్షల నుంచి 10 లక్షల దాకా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
రవాణా చార్జీలు అదనం
కొనుగోలు కేంద్రం నిర్వహణతో పాటు ధాన్యం రవాణాకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు చేరవేసేందుకు తీవ్రమైన వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నా ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. లారీలు, ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడి ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నారు. టన్ను ధాన్యం తరలింపునకు ఎనిమిది కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న మిల్లుల వరకు అయితే కిలోమీటర్‌కు 2.74 పైసలు చెల్లిస్తున్నారు. ఇక 8 నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే 6.16 పైసలు, 20 నుంచి 40 కిలోమీటర్ల దూరమైతే 4.43 పైసలు, 40 నుంచి 80 కిలోమీటర్ల దూరం అయితే 3.75 పైసలు, 80 కిలోమీటర్ల పైన అయితే 4.90 పైసలు చెల్లిస్తున్నారు. సగటున ఒక టన్నుకు ప్రభుత్వం 526 చెల్లిస్తున్నది. ఈ లెక్కన చూసుకుంటే ధాన్యం రవాణాకే పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుకు రంది లేకుండా..

ట్రెండింగ్‌

Advertisement