e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు లాక్‌ డౌన్‌తో అలర్ట్‌

లాక్‌ డౌన్‌తో అలర్ట్‌

లాక్‌ డౌన్‌తో అలర్ట్‌

గద్వాల, మే13 : రోజు రోజుకూ కరోనా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేసింది. అందరూ అనుకున్నట్లుగా కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్‌డౌన్‌ అని అన్ని వర్గాల నుంచి వస్తున్న వినతులు వస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడతో ముందస్తుగా ప్రజలే లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఇప్పటికే జిల్లాలో సంతలు బంద్‌ చేయడంతో పాటు కిరాణ, వస్త్రవ్యాపారులు, డాక్యుమెంటరీ రైటర్స్‌ స్వచ్ఛందగా లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా కట్టడిలో భాగస్వాములయ్యారు. దీనికి తోడు పోలీసులు ప్రతి రోజు ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రజల్లో అనుకున్న స్థాయిలో మార్పు రాలేదు. దీంతో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కరోనా బారిన పడకుండా ప్రభుత్వం నేటి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మార్గ దర్శకాలు విడుదల చేయడంతో ప్రజలు అలర్ట్‌ అయ్యారు. ప్రస్తుతం పది రోజుల లాక్‌డౌన్‌ ప్రభుత్వం విధించడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులు, సరుకులు, మందుల కోసం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో వ్యాపార, కిరాణ దుకాణాల ముందు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కొన్నింటికి మినహాయింపు ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ ప్రభుత్వం ప్రకటించగా వైన్స్‌ దుకాణల ఎదుట మందు బాబులు మద్యం కోసం వరుసలో నిలబడ్డారు. కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల లోపు ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర సరుకులు, పాలు, మందులు తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. లాక్‌డౌన్‌ వల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో ఉపాధి కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి కూలీలు పనికి వెళ్లవచ్చని చెప్పడంతో వారికి ఊరట లభించింది. దీంతో పాటు బ్యాంకులు, కార్యాలయాల్లో సిబ్బంది 33శాతం పని చేస్తారని చెప్పడంతో కార్యాలయాల్లో ఎక్కడ కూడా పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడాన్ని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కిక్కిరిసిన మద్యం దుకాణాలు
వనపర్తి, మే 11: బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌ ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు మద్యం కోసం వనపర్తి జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో మద్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో మద్యం దుకాణాలు ఉన్న ప్రాంతాలు మొత్తం రద్దీగా మారిపోయాయి.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, మే 11: కరోనాను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ బుధవారం నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా మందుబాబులు జాగ్రత్తలు పడుతున్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో మద్యం దుకాణాల వద్దకు మందుబాబులు చేరుకొని కరోనాను పక్కనపెట్టి భౌతిక దూరం పాటించకుండా మద్యాన్ని కొనుగోలు చేశారు. చాలచోట్ల ఒకరిపై ఒకరు తోసుకుంటూ క్యూలైన్‌లో నిలబడ్డారు. పది రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మద్యం ప్రియులు పదిరోజులకు సరిపడా మందును తీసుకె ళ్తున్నారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కరోనా బారిన పడకుండా కరోనాను కట్టడి చేయవచ్చునని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, మే 11 : ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధిస్తుండడంతో మద్యం ప్రియులు వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని వైన్స్‌ షాపుల వద్దకు వచ్చి గుమిగూడారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండానే ఒకరినొకరు తోసుకుంటూ వైన్స్‌ దుకాణాలకు ఎగబడ్డారు. ఇది గమనించిన ఎస్సై నాగ శేఖర్‌రెడ్డి తన సిబ్బందితో షాపుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి మద్యం ప్రియులను అదుపు చేశారు. గతంలో మాదిరిగా మద్యం కొరత ఉంటుందని భావించి ఒక్కసారిగా టీవీలో వార్తలు చూసి వైన్స్‌ షాపుల వద్ద గుమిగూడారు.
గట్టులో..
గట్టు, మే 11 : ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తామనే ప్రకటన వెలువడంతో జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని మద్యం దుకాణం వద్ద ప్రజలు మంగళవారం రద్దీ ఏర్పడింది. అయితే ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటును కల్పించనున్నారని తెలిసినా కూడా మద్యం దుకాణాలు తెరుస్తారా? లేదా? అనే సంశయంలో మద్యం ప్రియులు భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాగా బెల్ట్‌షాపుల నిర్వాహకులు కూడా పెద్దమొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ ప్రకటన నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణం వ్యాపారం జోరుగా కొనసాగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌ డౌన్‌తో అలర్ట్‌

ట్రెండింగ్‌

Advertisement