e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు ‘నకిలీ’పై నజర్‌..

‘నకిలీ’పై నజర్‌..

‘నకిలీ’పై నజర్‌..

విత్తన దందాపై సర్కారు ఉక్కుపాదం
నిరంతరం తనిఖీలు.. దాడులు చేస్తున్న అధికారులు
అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలపై కొరడా
ఇప్పటికే పెద్దమొత్తంలో ప్యాకెట్లు స్వాధీనం
రైతులు నష్టపోకుండా అవగాహన సదస్సులు

మంచిర్యాల, జూన్‌ 10, నమస్తే తెలంగాణ : నాసిరకం విత్తన ముఠాలపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. వానకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన విక్రయాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు, వ్యవసాయ అధికారుల సమన్వయంతో ఏర్పాటైన ఈ బృం దాలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నిఘా పెట్టడం, తనిఖీలు నిర్వహించడం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంవంటి పకడ్బందీ వ్యూహాలతో రంగంలోకి దిగారు. పత్తి, ఇతర విత్తనాలు, ఎరువులు, అనుమతి లేని పురుగు మందుల విక్రయాలను అరికడుతున్నారు. ఇప్పటికే రైతులకు, డీలర్లకు అవగాహన కల్పించారు. తాజాగా తనిఖీలు ముమ్మరం చేశారు. విత్తనాలను అక్రమంగా నిల్వ చేసినా, రికార్డులు సరిగ్గా నిర్వహించకున్నా, నకిలీవి అమ్మినా, ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ వసూలు చేసినా కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే పీడీ యాక్టు కూడా నమోదు చేసేందుకు వెనుకాడడం లేదు. అడుగడుగునా తనిఖీలతో అక్రమార్కులకు వణుకు పుట్టిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెద్ద గోపాల్‌పూర్‌లో వ్యవసాయ అధికారులతో కలిసి మంచిర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన, పర్యావరణానికి హాని కలిగించే గడ్డిమందు (ైగ్లెఫోసెట్‌) డబ్బాలను పట్టుకున్నారు. రూ.7 వేల విలువైన మొత్తం 20 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు.
12 కేసులు.. 30 మంది అరెస్టు
ఈ యేడాది నాసిరకం విత్తనాల విక్రయాలపై 12 కేసులు నమోదు చేశామని, 30 మందిని అరెస్టు చేశామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. 11,198 కిలోల నాసిరకం విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ రూ. 23,17,344 ఉంటుందని ఆయన వెల్లడించారు. నాసిరకం విత్తనాలు విక్రయించేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. రెండో సారి పట్టుబడితే పీడీ యాక్ట్‌ బుక్‌ చేయనున్నారు.
రైతులకు అవగాహన..
రైతులకు మేలు జరుగాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర సర్కారు ఉంది. నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నది. అందుకనుగుణంగా అధికారులకు మార్గనిర్దేశనం చేసింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు ప్రారంభం కాగా, నాసిరకం విత్తన ముఠాపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకోసం జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసు, వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ పలు వేదికల ద్వారా గ్రామాల్లోని రైతులందరికీ సదస్సుల ద్వా రా వివరించారు. వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాతో పాటు వాయిస్‌ మెస్సేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. నకిలీ విత్తనాలను ప్రోత్సహించవద్దని రైతుబంధు సమితులు, గ్రామస్థాయిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు పలువురికి అధికారుల ద్వారా సూచనలు ఇచ్చారు. మరోవైపు నాసిరకం విత్తనాలతో మోసపోవద్దని, వ్యవసాయ శాఖ అనుమతిచ్చిన అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. విత్తనాలు కొన్నప్పుడు బిల్లుపై నంబర్‌, విత్తన రకం, గడువు తేదీ, డీలర్‌ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లూజు(విడి)గా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలను కొనుగోలు చేయవద్దని పేర్కొంటున్నారు. కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్‌ సీల్‌ ఉందా? లేదా? అని సరిచూసుకోవాలంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నకిలీ విత్తన దందాపై సర్కారు సీరియస్‌గా ఉంది. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై నిఘా పెట్టి నిరంతరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీలను విక్రయిస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా సిర్పూర్‌ నియోజకవర్గంలో ఈ నకిలీ విత్తనాల దందా ఎక్కువగా సాగుతున్నట్లు ఇటీవల పట్టుబడ్డ ఘటనలు బట్టి అర్థమవుతోంది. సిర్పూర్‌-టీ, కౌటాల, బెజ్జూర్‌, దహెగాం, పెంచికల్‌పేట్‌, మండలాల్లో రైతులు అధికంగా పత్తి పంట సాగుచేస్తారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నకిలీలను రైతులకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.
8 మందిపై కేసులు..
ఈ యేడాది కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 8 మందిపై కేసులు నమోదు చేసి సుమారు రూ. కోటి విలువైన 700 కిలోల నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘నకిలీ’పై నజర్‌..

ట్రెండింగ్‌

Advertisement