e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు బాధితులకు భరోసా

బాధితులకు భరోసా

బాధితులకు భరోసా

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంవోగా శోభ
అంచెలంచెలుగా ఎదిగిన ఖమ్మానికి చెందిన డాక్టరమ్మ
కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం
కష్టకాలంలో అలుపెరుగని సేవలు

ఖమ్మం డెస్క్‌:చిన్నప్పటి నుంచి ఆమెకు వైద్యవృతి చేపట్టాలనే తపన ఉండేది. మధ్యతరగతి కుటుంబమే అయినా లక్ష్యం కోసం నిరంతరం శ్రమించింది. కృషి, పట్టుదల, సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగింది. ‘వైద్య విద్య అంత ఆషామాషీ కాదు.. దానికి చాలా కష్టపడాలి. నీవు డాక్టరు అవుతావా..?’ అంటూ ఎంతోమంది హేళన చేశారు. నిరుత్సాహ పరిచారు. అయినా వెనుకడుగు వేయలేదు. పట్టువదలకుండా లక్ష్యం కోసం తపించారామె. చివరకు అనుకున్నది సాధించి తానేంటో నిరూపించుకున్నారు. వైద్యవృత్తిలో అడుగు పెట్టి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో ఆర్‌ఎంవోగా విధులు నిర్వర్తిస్తున్నారు ఖమ్మం నగరానికి చెందిన కేసా శోభ. ఆమె వైద్యవృతి వైపునకు రావడానికి గల కారణాలు, లక్ష్యం సాధించిన తీరు, కొవిడ్‌ జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన భరోసా తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.

మధ్యతరగతి కుటుంబం నుంచి..ఖమ్మం నగరానికి చెందిన కేసా వీరన్న, సుగుణమ్మకు ఇద్దరు సంతానం. కుమారుడు భాస్కర్‌ ఓ ప్రైవేట్‌ పాఠశాల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కూతురు శోభ చిన్నప్పటి నుంచి చదవులో చురుగ్గా ఉండేది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను డాక్టర్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఆమెను ప్రోత్సహించారు. నగరంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం, ఇంటర్‌ పూర్తి చేశారామె. అనంతరం ఎంసెట్‌ రాసి ఉత్తమ ర్యాంకు సాధించి కామినేని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. మొదటి సంవత్సరంలో కొంత భయపడినా.. తర్వాత ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ద్వితీయ సంవత్సరంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అంతటి ఆగిపోకుండా యూఎస్‌ వెళ్లారు. అక్కడే రెండేళ్లపాటు యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌లో పిడియాట్రిక్స్‌ రీసెర్చ్‌ డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. తిరిగి హైదరాబాద్‌ వచ్చి పీజీ కోర్సు చేయాలనుకుంటున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యవిభాగంలో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఆమె దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. కొణిజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలిగా ఎంపికయ్యారు.

ఓపీ పెరిగింది..
శోభ 2014లో కొణిజర్ల పీహెచ్‌సీలో వైద్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. తొలినాళ్లలో అక్కడికి రోగులెవరూ వచ్చేవారు కాదు. ఆమె ప్రత్యేక చొరవ తీసుకొని బాధితుల వద్దకు వెళ్లి సేవలందించారు. ఆ తర్వాత పీహెచ్‌సీకి క్రమక్రమంగా ఓపీ పెరుగుతూ వచ్చింది. వివిధ వ్యాధులతో సతమతమవుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఆమె ఎంతో ఓపికతో వైద్యం అందించేవారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ఎంతో శ్రమించారు. గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలగకుండా ఆమె అందుబాటులో ఉంటూ వైద్యమందించారు. మూడేళ్లపాటు ఇక్కడ సేవలు అందించిన తర్వాత నీట్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష రాశారు. సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎండీ పల్మనాలజీ పూర్తి చేశారు. అక్కడే ఆర్‌ఎంవోగా విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం గాంధీలో సేవలందించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని శోభ పేర్కొన్నారు. అమ్మానాన్న, భర్త సహకారంతో ముందుకుసాగుతున్నట్లు తెలిపారు.

కొవిడ్‌ సేవల్లో..
కేరళలోని కొచ్చిలో 2019 నంబర్‌లో న్యాప్‌కాన్‌ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌)లో శ్వాసకోస సంబంధించిన వ్యాధులపై ఆమె పేపర్‌ ప్రజెంటేషన్‌ చేసే అవకాశం దక్కింది.
నిరుడు ఆగస్టులో గాంధీ ఆసుపత్రిలో ఆమె ఆర్‌ఎంవోగా విధుల్లో చేరారు. అంతకు ముందు గాంధీలో పీజీ చేస్తున్న క్రమంలో కొవిడ్‌ కేసులు ప్రారంభమయ్యాయి. దీంతో కరోనా బాధితులకు వైద్యం అందించారు. కొవిడ్‌ అంటే వణికిపోతున్న రోజులవి. అయినా ఏమాత్రం భయపడకుండా బాధితులకు వైద్యమందిస్తూ వారిలో మానసిక ైస్థెర్యాన్ని నింపారు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబాన్ని సమన్వయం చేస్తూనే బాధితులకు అండగా నిలిచారు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం అందించారు. ఆసుపత్రికి వచ్చే బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారిలో భరోసా నింపారు.

అప్రమతంగా ఉండాలి
కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. ఇంట్లో ఒకరికి వస్తే కుటుంబ సభ్యులందరూ వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం అసలే వద్దు. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి, దగ్గు వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. ఇల్ల్లు, ఇరుగు పొరుగు ఇళ్లు, పని ప్రదేశాల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. మనకు కూడా లక్షణాలున్నట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాలి. కొంతమందికి ఎక్కువ ఒళ్లునొప్పులు ఉంటున్నాయి. గొంతు నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొవిడ్‌గా భావించి వీలైనంత తొందరగా ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తే ప్రమాదం నుంచి బయట పడొచ్చు. కొవిడ్‌ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. బాధితులు తుమ్మినా, దగ్గినా ఇతరలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారిని ఐసోలేషన్‌లో ఉండడం మంచిది. సర్జికల్‌ మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ బాధితులకు సేవలు అందించవచ్చు. అందరూ తప్పనిసరిగా సర్జికల్‌ మాస్కులు ధరించాలి. వ్యాయామం, యోగాసనాలు వేయడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. ప్రాణాయమం, డీప్‌బ్రీత్‌ వ్యాయామం చేయాలి. శరీరానికి ఇమ్యూనిటి పవర్‌ చాలా ముఖ్యం. అయితే ఇమ్యూనిటీ అనేది రాత్రికి రాత్రి పెరిగేది కాదు. క్రమక్రమంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
-కేసా శోభ, గాంధీ దవాఖాన ఆర్‌ఎంవో

ఇటు కుటుంబం.. అటు వృత్తి..
ఇప్పుడు వైద్యవృత్తి కత్తి మీద సాముగా మారింది. కొవిడ్‌ విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దవాఖానకు తరలివస్తుండగా.. వారిని కాపాడేందుకు వైద్యులు చెమటోడుస్తున్నారు. వచ్చిన బాధితులకు వైద్యం, బెడ్లు, ఆక్సిజన్‌ అందేలా ఏర్పాట్లు చేస్తుంటారు. విధులకు హాజరైనప్పటి నుంచి ఇంటికొచ్చేవారు బిజీలైఫ్‌ గడుపుతున్నారు. పీపీఈ కిట్‌ ధరించి దవాఖానలో అడుగుపెడితే కనీసం ఫోన్‌ మాట్లాడే అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో తన భర్త సహకారంతో ఇటు కుటుంబాన్ని.. అటు ఉద్యోగాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు శోభ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాధితులకు భరోసా

ట్రెండింగ్‌

Advertisement