ఆసక్తి చూపుతున్న ప్రజలు
మార్కెట్లో భారీగా అమ్మకాలు
25నుంచి 100 వరకు విక్రయాలు
సిరిసిల్ల టౌన్, మే 9: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు గాను పట్టణవాసులు పుచ్చకాయలు కొనేందుకు క్యూ కడుతున్నారు. శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను తిరిగి అందించే ఔషధ గుణాలు పుచ్చకాయలో ఉంటాయి. అలాగే శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చూస్తుంది. జీరో ఫ్యాట్ ఉండడంతో బరువు తగ్గడానికి సైతం ఔషధంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యప్రదాయిని..
వేసవిలో అరుదుగా లభించే పండ్లలో పుచ్చకాయ ముఖ్యమైనది. దీనిలో ఏ, బీ, సీ విటమిన్లు, నియాసిన్, మాంగనీస్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తే దీనిలో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. బీ కాంప్లెక్స్, విటమిన్లు అధికంగా ఉండడంతో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా వడదెబ్బకు గురైన వారికి ఉపశమనం లభిస్తుంది. పుచ్చకాయ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ప్రతి రోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. పుచ్చకాయలో విటమిన్ అధికంగా ఉండడంతో ఆయిల్స్కిన్ నివారణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పెరిగిన ధరలు ..
మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక ఔషధ గుణాలు కలిగిన పుచ్చకాయల అమ్మకాలు వేసవి ప్రారంభంలోనే ఊపందుకున్నాయి. వరంగల్ నుంచి తెచ్చిన పుచ్చకాయలు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖాన, కోర్టు, బస్టాండ్ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు. కాయ సైజును బట్టి రూ.25 నుంచి రూ.100 వర కు విక్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ధరలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి ఔషధ ఫలం కావడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.