మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న
భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ
జములమ్మకు బోనం సమర్పించిన భక్తులు
అయిజ, ఆగస్టు 2: సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న పేర్కొన్నారు. సోమవారం ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ సంబురంగా జరుగుతుందన్నారు. ఈ ఏడాది అయిజ పట్టణంలో బోనాల ఉత్సవాన్ని నిర్వహించాలని సంకల్పించి నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోతురాజుల నృత్యాలు, బీరప్పడోళ్ల చప్పుళ్లు, చిన్నారుల కోలాటాల ప్రదర్శనల నడుమ తెలంగాణ చౌరస్తాలోని తెలంగాణ తల్లికి నివాళి అర్పించిన అనంతరం భక్తులు బోనాలను తలపై ఎత్తుకుని జములమ్మ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జములమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్, ఏఈ గోపాల్, కౌన్సిలర్లు, భక్తులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.