e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు ఆమెకు అండగా

ఆమెకు అండగా

దిగ్విజయంగా నడుస్తున్న సెంటర్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ ‘181’కు ఫోన్‌ చేస్తే క్షణాల్లో సేవలు
రెండేళ్లలో 312మందికి సాయం
ఆపత్కాలంలో అమ్మలా చేరదీత
బాధితులకు మేమున్నామంటూ భరోసా

పెద్దపల్లి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ);దిక్కూమొక్కులేని అతివలకు అమ్మలా.. ఆపతిలో ఉన్నవారికి సోపతిలా.. కుటుంబ కలహాలు, ప్రేమలో మోసాలు, దాడులు, హింసించడం, లైంగిక వేధింపులతో సతమతమవుతూ.. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న మహిళలకు జిల్లాలోని సఖీ కేంద్రం అండగా నిలుస్తున్నది. ఆపత్కాలంలో టోల్‌ ఫ్రీ నంబర్‌ 181కు కాల్‌ చేసిన వెంటనే బాధితుల చెంతకు చేరుకొని, అయినవారిలా చేరదీస్తూ.. సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. గడిచిన రెండేళ్లలోనే 312మందికి సాయం అందించి మేమున్నామనే భరోసానిస్తున్నది.

సమాజంలో స్త్రీలు, బాలికలకు వేధింపులు, హింసల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సఖీ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. గృహ హింస, పనిచేసే చోట లైంగికవేధింపులు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, హింసల నుంచి రక్షణ, అవసరమైన అన్ని సహాయాలు ఒకే చోట అందించడం కేంద్రం ప్రత్యేకత. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామాలవారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేనివారు సఖీ కేంద్రానికి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సాయం చేస్తున్నది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయ, సలహాలు, పోలీసు, వైద్య సాయాన్ని అందిస్తున్నది.

- Advertisement -

312 మందికి బాసట..
ప్రధానంగా భార్యాభర్తల గొడవలు, మహిళలపై అత్యాచారాలు, పెండ్లి చేసుకుంటామని మోసం చేసిన కేసులు, విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్‌, యాసిడ్‌ దాడి, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు సంబంధించిన కేసుల్లో బాధిత మహిళలకు అండగా ఉండేందుకు జిల్లా కేంద్రంలో 2019 సెప్టెంబర్‌లో సఖీ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ కేంద్రంలో ప్రత్యేక అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేయడంతోపాటు ఆయా శాఖల నుంచి 16 మంది అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని నియమించారు. ఇందులో ఒక సెంటర్‌ అడ్మిన్‌, లీగల్‌ కౌన్సిలర్‌, అకౌంటెంట్‌ అసిస్టెంట్‌ అడ్మిన్‌, ఐటీ అసిస్టెంట్‌, ఇద్దరి చొప్పున సైకో సోషల్‌ కౌన్సిలర్లు, కేస్‌ వర్కర్లు, సెక్యూరిటీ గార్డ్స్‌, మల్టీపర్పస్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, వాహన డ్రైవర్లు ఉన్నారు. కాల్‌ చేస్తే క్షణాల్లో ఆ గ్రామానికి చేరుకునేలా 181 టోల్‌ ఫ్రీ నంబర్‌తో పాటు కార్యాలయ నంబర్‌ 0878- 224224 అందుబాటులో ఉంచగా, గడిచిన రెండేళ్లలో కేంద్రానికి 463 ఫిర్యాదులు అందాయి. ఇందులో 312కేసుల్లో పురోగతి సాధించి బాధితులకు భరోసా కల్పించింది.

మహిళల రక్షణకు 181ఎంతో ఉపయోగం..
జిల్లాలోని మహిళల రక్షణకు 181ఎంతగానో ఉపయోగపడుతున్నది. రెండేళ్లలో 312 మందికి సాయం చేసింది సఖీ కేంద్రం. చిన్నారి నుంచి మొదలు కొని వృద్ధురాలి దాకా సాయం చేయడమే సఖీ ధ్యేయం. అత్యవసర సమయాల్లో మహిళలు తప్పకుండా సమాచారం ఇవ్వాలి.
-పీ. లక్ష్మీరాజం జిల్లా సంక్షేమ శాఖ అధికారి.

బాధితులకు న్యాయం జరుగుతున్నది..
సఖీ కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతున్నది. జిల్లాలో ప్రధానంగా ఇప్పటి వరకు వరకట్న వేధింపులు, కోడళ్లు అత్తలపై దాడులు చేసిన కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కేసుల తీవ్రతను బట్టి చర్యలుంటున్నాయి. చిన్నారి నుంచి మొదలు కొని వృద్ధురాలి దాకా వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ఇక్కడ పరిష్కారం లభిస్తుంది.

  • రాజ్‌కమల్‌రెడ్డి, సీఈఓ సహాయ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 312 కేసులు పరిష్కరించాం..
    సఖీ కేంద్రం ద్వారా గడిచిన రెండేళ్లలో 462 కేసులు నమోదయ్యాయి. అందులో 312 కేసులలో పురోగతి సాధించి పరిష్కారం చూపాం. మహిళలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఆపద వచ్చినా టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. వెంటనే వచ్చి అవసరమైన సాయం చేస్తాం.
  • దారవేని స్వప్న, సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌, సఖీ కేంద్రం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana