e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు నిబంధనల మేరకే వేలం నిర్వహించాలి

నిబంధనల మేరకే వేలం నిర్వహించాలి

మేనేజర్‌ డిప్యుటేషన్‌ రద్దు చేయాలని కౌన్సిల్‌ తీర్మానం
గద్వాలటౌన్‌, జూలై 31 : మున్సిపల్‌ దుకాణాల వేలం మున్సిపల్‌ నిబంధనల మేరకే నిర్వహించాలని మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అధికారులకు సూచించారు. దుకాణాల లీజు వేలంపై శనివారం మున్సిపల్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చైర్మన్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి ఎజెండాను కౌన్సిల్‌ ముందు ప్రవేశపెట్టారు. ఎజెండాలోని రెండో అంశమైన దుకాణాల వేలం మీదనే చర్చ సాగింది.

కౌన్సిలర్లు ప్రస్తావించిన అంశాలు..
పట్టణంలో అక్రమ నిర్మాణాలు, కట్టడాలపై తాము ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎవరి పరిధిలోకి వస్తుందని ప్రశ్నించారు. ఇందుకు చైర్మన్‌ సమాధానం ఇస్తూ అక్రమ నిర్మాణాలు, కట్టడాలపై మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని మొత్తం బాధ్యతలు కలెక్టర్‌కు ఇచ్చినట్లు తెలిపారు. సమస్యలు ఉంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని కమిషనర్‌ వెల్లడించారు
కమిషనర్‌, మేనేజర్‌ విధులు ఏమేమి ఉంటాయో వాటిని కౌన్సిల్‌కు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.
దుకాణాల లీజు వేలంలో మేనేజర్‌ అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. కౌన్సిలర్లంటే మేనేజర్‌కు ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దుకాణాల వేలం నిర్వహణలో పోలీసులతో బయటికి నెట్టే స్థాయిలో మేనేజర్‌ వ్యవహరించడం వంటి చర్య కౌన్సిల్‌కే అవమానకరమని చెప్పారు.
కౌన్సిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, వెంటనే వారి పనితీరు మార్చుకోవాలని సూచించారు.
దుకాణాల వేలం పారదర్శకంగా ఉండాలని కోరారు.
మేనేజర్‌ మల్లారెడ్డి వ్యవహార శైలి కౌన్సిల్‌కు విరుద్ధంగా ఉందంటూ వెంటనే ఆయనను తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు చైర్మన్‌ స్పందిస్తూ మేనేజర్‌ డిప్యుటేషన్‌ రద్దు చేస్తూ ఆయనను సీడీఎంఏ కార్యాలయానికి సరెండర్‌ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు కౌన్సిల్‌ సభ్యులందరూ ఆమోదించారు. కాగా ఈ ఘటనపై స్పందించిన మేనేజర్‌ తాను ఇక్కడ విధులు నిర్వర్తించలేనని వెంటనే తనకు లీవ్‌ ఇవ్వాలని సమావేశంలోనే కమిషనర్‌ను కోరారు. దీంతో కొద్ది సేపు గందరగోళ వాతావరణం నెలకొన్నది. మేనేజర్‌ తీరు పట్ల చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ అధికారులు, కౌన్సిల్‌ సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చడంలో అధికారులకు సహకరిస్తామన్నారు. కౌన్సిల్‌కు విరుద్ధంగా పనిచేయాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana