e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు ఎంత ఖర్చయినా..కొవిడ్‌ను ఎదుర్కొందాం

ఎంత ఖర్చయినా..కొవిడ్‌ను ఎదుర్కొందాం

ఎంత ఖర్చయినా..కొవిడ్‌ను ఎదుర్కొందాం

కార్మికులందరినీ కుటుంబ సభ్యుల్లా కాపాడుకుందాం
కరోనా కట్టడికి పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలి
50 వేల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కొంటున్నాం
కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి
సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆదేశం
అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌

శ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 30 : కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా వైద్య సేవలు అందించాలని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీధర్‌ డైరెక్టర్లను, అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి కొవిడ్‌ వైద్య సేవలపై ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ కొవిడ్‌ నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. కరోనాను అదుపు చేయాలంటే పెద్ద ఎత్తున ర్యాపిడ్‌ పరీక్షలు చేయాలని, లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌ సెంటర్లలో, తీవ్ర లక్షణాలుఉన్న వారిని దవాఖానకు తరలించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీరియస్‌ కేసులను ఆలస్యం చేయకుండా వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌లోని సింగరేణి రెఫరల్‌ దవాఖానలకు తక్షణమే తరలించాలని సూచించారు.

అంబులెన్స్‌లు సరిపోకపోతే ప్రైవేట్‌వి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ర్యాపిడ్‌ టెస్టుల కోసం 50 వేల కిట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వీటిని వెంటనే ఏరియాలకు పంపిస్తామన్నారు. ఇప్పటికే 20 మంది డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నామని అవసరాన్ని బట్టి ఏరియాల వారీగా స్థానిక జనరల్‌ మేనేజర్లు డాక్టర్లు, నర్సులు, వార్డు బాయిలు, టెక్నీషియన్లను నియమించుకోవచ్చని అన్ని ఏరియాల జీఎంలకు అనుమతులు ఇచ్చామన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియా దవాఖానల్లో రోజుకు కనీసం 200 మందికి వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని, మే చివరికల్లా మొదటి టీకా పూర్తి చేయాలని , జూలై చివరి నాటికి రెండో డోసు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న 700 పడకలకు అదనంగా మరో 500 పడకలను సమకూర్చుతున్నామని చెప్పారు.

అలాగే సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచేందుకు సిలిండర్లతో పాటు ఎక్కడిక్కడ ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొవిడ్‌ నివారణకు కావాల్సిన మందు లు, ఇంజెక్షన్లు కనీసం 2 నెలలకు సరిపడా స్టాకు తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి ఏరియాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి 24 గంటలు సమాచారం ఇవ్వాలన్నారు. ఏరియాల జీఎంలు ప్రతి రోజూ విధిగా ఏరియా దవాఖానను సందర్శిస్తూ పరిస్థితిని సమీక్షించాలని, కావాల్సిన సౌకర్యాలను ఖర్చుకు వెనకాడకుండా సమకూర్చాలని ఆదేశించారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడా నిత్యం కంపెనీ తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తూ లోపాలను సవరిస్తూ ముందుకుసాగాలన్నారు. గతేడాది కొవిడ్‌ను అన్ని ఏరియాల అధికారులు, జట్టుగా ఎదుర్కొని విజయం సాధించారని, తద్వారా జాతీయ స్థాయిలో సింగరేణికి మంచి పేరు వచ్చిందని, ఈ సారి కూడా ఆదే స్పూర్తితో పని చేయాలని కోరారు. సమావేశంలో హైదరాబాద్‌ నుంచి డైరెక్టర్లు బలారాం, జీఎం కార్పొరేషన్‌ కే సూర్యనారాయణ, మెడికల్‌ ఆఫీసర్‌ బాలకోటయ్య, కొత్తగూడెం కార్పొరేట్‌ నుంచి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, సత్యనారాయణ, శ్రీరాంపూర్‌ నుంచి జీఎం సురేశ్‌, ఎస్వోటూ జీఎం గుప్తా, డీవైసీఎంవో విజయలక్ష్మి, హెల్త్‌ ఆఫీసర్‌ సుమన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎంత ఖర్చయినా..కొవిడ్‌ను ఎదుర్కొందాం

ట్రెండింగ్‌

Advertisement