e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home జగిత్యాల పిడకల కరోనా కల్లోలం

పిడకల కరోనా కల్లోలం

కొవిడ్‌ అలజడికి ఏడాది
కరీంనగర్‌లో తొలి కేసు నమోదైంది ఈ రోజే
ఇండోనేషియా మతప్రచారకుల ద్వారా వ్యాప్తి
మరుసటి రోజు నుంచే రెడ్‌ జోన్లుగా ప్రకటింపు
దేశవ్యాప్తంగా సంచలనం
మరో ఐదు రోజుల్లోనే జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌
భయం గుప్పిట ఉమ్మడి జిల్లా
ఇప్పుడిప్పుడే తొలుగుతున్న ముప్పు
విజయవంతంగా వ్యాక్సినేషన్‌
కరీంనగర్‌, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్‌:ఎక్కడో కరోనా విజృంభిస్తున్నదన్న వార్తలు అప్పడప్పుడే వస్తున్నా, అప్పటిదాకా కరీంనగర్‌ ప్రశాంతంగా ఉన్నది. కానీ, అంతలోనే ఉలిక్కిపడ్డది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కల్లోలం లేచింది. ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకుల ద్వారా వైరస్‌ వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరుసటి రోజు నుంచే రెడ్‌ జోన్లు ప్రకటించగా, మరో ఐదు రోజుల తర్వాత అంటే మార్చి 22న దేశమంతటా కేంద్రం జనతా కర్ఫ్యూ నిర్వహించింది. ఆ వెంటే లాక్‌డౌన్‌ అమల్లోకిరాగా, దాదాపు ఆరు నెలలపాటు మహమ్మారి ముప్పుతిప్పలు పెట్టి, ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కొవిడ్‌ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్నా, ప్రజానీకం ఇంకా భయం నుంచి పూర్తిగా తేరుకోలేకపోతున్నది.

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను జిల్లాలో గుర్తించి సరిగ్గా ఏడాది అవుతున్నది. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకుల్లో ముందుగా ఈ వైరస్‌ను గుర్తించారు. దేశంలో అప్పుడప్పుడే రేగుతున్న కరోనా కలకలం ఇక్కడ కూడా వెలుగు చూడడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారికి ఎదురు తిరిగి పోరాడుతున్నాం. అప్పటంత కాకపోయినా ఇప్పటికీ జిల్లా ప్రజలు దీని బారిన పడుతూనే ఉన్నారు.

- Advertisement -

సరిగ్గా ఏడాది కింద కరోనాతో యావత్‌ ప్రపంచం వణికి పోయింది. అయితే మన వరకు వస్తుందా..? అనుకుంటున్న జిల్లా వాసుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. 2020 మార్చి 16న రాష్ట్రంలోనే మొదటి కేసు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకుల్లో ఒకరికి పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలడంతో జిల్లా కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. క్రమంగా అతనితో వచ్చిన పది మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వెంటనే సర్కారు మంత్రులు, జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. ఆ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టర్‌, సీపీ, వైద్యాధికారులతో సమీక్షించారు. మత ప్రచారకులు ఎక్కడెక్కడ తిరిగారో గుర్తించిన కరీంనగర్‌ జిల్లా అధికారులు నగరంలోని ముకరంపుర, కశ్మీర్‌గడ్డ తదితర ప్రాంతాల్లో గత మార్చి 17న కంటైన్మెంట్‌ జోన్‌ విధించారు. రెడ్‌ ఏరియాలుగా ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేశారు. అయితే వారితో సన్నిహితంగా ఉన్న వాళ్లని, మరికొందరిని గుర్తించి పరీక్షలు చేశారు. పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కాగా, దేశంలోనే తొలి కంటైన్మెంట్‌ జోన్‌ను జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో విధించినట్లు రికార్డుల కెక్కింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌కు ముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

చేదు జ్ఞాపకం..
కరీంనగర్‌లో మార్చి 17 నుంచి రెడ్‌జోన్లు ప్రకటించగా, దేశవ్యాప్తంగా వైరస్‌ విజృంభణతో మరో ఐదు రోజులకే కేంద్రం అలర్ట్‌ అయింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించింది. ఆ వెంటే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ప్రజాజీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. కరోనా భయం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగానే కనిపించింది. మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్‌ తప్పనిసరి అయ్యా యి. కొంతకాలంపాటు ప్రజలు ఎక్కడికక్కడ ఇండ్లకే పరిమితమయ్యారు. మాస్కులు లేనిదే బయటకు రాలేకపోయారు. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికీ ఇబ్బంది పడ్డారు. తర్వాత దశల వారీగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేయగా, ప్రజలు రోడ్లపైకి ఎక్కారు. మొత్తంగా 2020 ప్రజలకు ఓ చేదుజ్ఞాపకంలా మిగిలింది. అయితే తర్వాత కాలంలో కరోనా ప్రభావం తగ్గినా ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉండగా, జిల్లా వైద్య, ఆరోగ్య, వైద్య విధాన పరిషత్తు అధికారులు అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటి మీద కునుకు లేకుండానే శ్రమిస్తున్నారు. ఇప్పటికీ కరోనా కట్టడికి ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు.

విజయవంతంగా వ్యాక్సినేషన్‌..
కరోనాకు విరుగుడుగా టీకా వచ్చింది. జనవరి 8న డ్రైరన్‌ విజయవంతమైంది. 15న వ్యాక్సిన్లు జిల్లాలకు చేరాయి. అదే నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. దశలవారీగా మొదట హెల్త్‌కేర్‌ వర్కర్లకు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 60 ఏండ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా టీకాలు వేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఇస్తుండగా, ప్రైవేట్‌ సెంటర్లలో 250 ఫీజుతో ఇస్తున్నారు. మొదటి డోస్‌ వేసిన 28 రోజులకు రెండో డోస్‌ వేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాల్సిందే..
కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలిగిపోలేదు. అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రజా రవాణాలో జాగ్రత్తలు పాటించాలి. కరోనా టెస్టులు ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. మూడు మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశాం. టెస్టులు చేయించుకుని హోం ఐసోలేషన్‌లో ఉంటేనే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది. ఎప్పటి లాగే ప్రతి పీహెచ్‌సీకి రోజుకు 100, ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు 120 చొప్పున టెస్టులు చేయాలని లక్ష్యం విధించాం. ఇప్పటికీ అక్కడక్కడా కేసులు కనిపిస్తున్నాయి. అయితే స్టేట్‌ ఆవరేజ్‌ 1.5 కంటే తక్కువే నమోదవుతున్నాయి. అలాగని మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదు. 60 ఏండ్లు దాటిన వాళ్లు, 45 నుంచి 59 మధ్య వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు టీకా వేయించుకోవాలి.

  • జీ సుజాత, డీఎంఅండ్‌హెచ్‌వో (కరీంనగర్‌)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement