e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home జిల్లాలు శ్రావణం.. శుభకరం

శ్రావణం.. శుభకరం

  • రేపటి నుంచి శ్రావణ ప్రారంభం
  • సకల శుభాల సమాహారం
  • ఓవైపు పండుగలు.. మరోవైపు శుభకార్యాలు
  • కరోనా వేళ జాగ్రత్తలు తప్పని సరి
  • భక్తిశ్రద్ధ్దలతో జరుపుకోవాలని అంటున్న పండితులు
  • జాగ్రత్తలు తప్పని సరి అంటున్న పురోహితులు

మంచిరోజుల మామిడి తోరణం.. వాతావరణంలో సానుకూల మార్పులకు సంకేతం.. ప్రాణాధారమైన వర్ష రుతువుకు నాంది శ్రావణం మాసం. పిల్లాపాపలు సుఖంగా ఉండాలని కోరుకునే నాగపంచమి.. కట్టుకున్నవాడు చల్లగా ఉండేలా వరమిచ్చే వరలక్ష్మీవ్రతం.. అన్నదమ్ములు ఆనందంగా ఉండేలా దీవించే రాఖీపూర్ణిమ.. గీత మార్చే గీతాసారాన్ని బోధించిన శ్రీకృష్ణుడి జయంతి.. కన్నపిల్లల కష్టాలు కరిగించే పొలాల అమావాస్య.. భరతజాతి భవ్యతను కీర్తించే పంద్రాగస్టు.. ఈ నెల ప్రత్యేకతలు. ఆగస్టు 9 నుంచి ప్రారంభమయ్యే శ్రావణమాసం సకల శుభాల సమాహారంగా పరిగణిస్తారు. ఈ నెలలో వచ్చే పండుగలను ఆనందంగా జరుపుకొంటారు.

సంతానం క్షేమం కోసం నాగపంచమి..

తమ సంతానంతో పాటూ కుటుంబసభ్యులను క్షేమంగా ఉంచమని నాగదేవతను ప్రార్థించే పండుగ ఇది. ఈసారి శ్రావణశుద్ధ పంచమి ఆగస్టు13న జరుపుకోవాలని సిద్ధ్దాంతులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయమే నాగదేవత ఆలయాలతో పాటూ పుట్టలో పాలుపోసి తమ భక్తిని చాటుకుంటారు మహిళలు. ఈ రోజు చేసే ప్రత్యేక పూజలతో కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. పుట్టమట్టిని కుటుంబసభ్యులు శరీరమంతా రాసుకోవడంతో ఆరోగ్యం చేకూరుతుందని వారి నమ్మకం.

అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీపూర్ణిమ…

- Advertisement -

‘నాకు నువ్వు రక్ష…నీకు నేను రక్ష’ అంటూ అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రక్షాబంధనం చేసే పండుగ ఇది. ఎంతదూరంలో ఉన్నా ఈ పండుగ నాడు ఆడపడుచులు తోబుట్టువుల ఇంటికి చేరుకొని చేతికి రాఖీ కడతారు. ఈసారి శ్రావణపూర్ణిమ ఆగస్టు 22 ఆదివారం జరుపుకోవాల్సిందిగా సిద్ధ్దాంతులు సూచిస్తున్నారు. వివిధ కారణాలతో దూరంగా ఉంటున్న సోదరీసోదరుల మధ్య అనుబంధాలను గుర్తుచేయడం ఈ పండుగ ప్రధాన లక్ష్యంగా పండితులు అభివర్ణిస్తున్నారు. పౌరాణికంగా అనేక ఆధారాలు ఉన్నా, ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవన విధానంలో ఆత్మీయతలను పంచుకునే వేదిక ఈ పండుగ అన్నది వారి అభిప్రాయం.

గీతాసారాన్ని గుర్తు చేసే శ్రీకృష్ణ జయంతి..

మానవాళికి మంచి నేర్పే భగవద్గీతను అందించిన శ్రీకృష్ణుడి జయంతి శ్రావణమాసంలోనే రావడం విశేషం. శివార్చకులు ఆగస్టు 29 నాడు, విష్ణుసేవ చేసేవారు 31నాడు వారి సంప్రదాయాలను అనుసరించి జయంతి వేడుకలను నిర్వహించాలని పండితుల సూచిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ దేవాలయాల్లో మూలవిరాట్టుకు అభిషేకాలు,ప్రత్యేక పూజలు జరుపుతారు. సామూహిక గీతా పారాయణాలు ప్రవచిస్తారు.

పిల్లలకు రక్ష..

పోలేరమ్మ దేవతను పిల్లలకు రక్షకురాలిగా పరిగణిస్తారు. ఈనాడు తల్లులు తమ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుకోసం పోలేరమ్మ వ్రతం చేసి ఉపవాసం ఉంటారు. ఈసారి సెప్టెంబర్‌6 సోమవారం నాడు పొలాల అమావాస్య వ్రతం నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గారూపిణి అయిన పోలేరమ్మను పూజించి అమ్మవారి దగ్గర ఉంచిన దోరాలను(రక్షాదారాలు) పిల్లలకు కడతారు. ఫలితంగా పోలేరమ్మ కరుణ చూపుతుందని, వర్షాకాలం ఆరంభంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆస్తికులు విశ్వాసం.

భరత జాతి భవ్యపతాక పంద్రాగస్టు…

కుల,మత, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా భారతీయులంతా నిర్వహించుకునే పండుగ పంద్రాగస్టు. దాస్య శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న భారతదేశం గత కాలపు ఔన్నత్యాన్ని గుర్తు చేసుకునే రోజిది. జాతి పునర్నిర్మాణానికి అంకితమయ్యేలా ప్రమాణం తీసుకునే వేడుక. ఈ సందర్భంగా ఇండ్ల్లపైన, వీధుల్లో, కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి జెండావందనం చేస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఘనంగా జరుపుకొనే ఈ పండుగ జాతి సాధించిన ఘనతకు ప్రతీక.

ముహూర్తాలూ ఎక్కువే…

కరోనా కారణంగా నిలిచిపోయిన అనేక ముహూర్తాలకు ఈసారి శ్రావణం వేదిక కానుంది. గతంలో వాయిదా పడిన వివాహాలు ,గృహప్రవేశాల వంటి శుభకార్యాలు శ్రావణంలో అధికంగా ఉన్నట్టు పురోహితులు చెబుతున్నారు. ఆశ్వీయుజ కార్తీక మాసాల్లో కరోనా ఉధృతి ఎలా ఉంటుందో తెలియకపోవడంతో పాటూ మాఘమాసంలో మూఢమ ఉండడంతో జాగ్రత్తలతో శ్రావణంలోనే కార్యక్రమాలు పూర్తిచేసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఓవైపు పండగలు, మరోవైపు శుభకార్యాలతో శ్రావణమంతా సందడిగా సాగనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

భక్తిశ్రద్ధ్దలు ముఖ్యం..

శ్రావణమాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఏ కార్యం తలపెట్టినా మొక్కుబడిగా కాకుండా భక్తి ప్రపత్తులతో చేయాలి. నిస్వార్థ్ధంగా చేసే ఈశ్వర సేవతో శారీరక, మానసిక కష్టాలు తొలగిపోతాయి. శ్రావణం కేవలం నాగపంచమి, పొలాల అమావాస్య వంటి పండుగల ద్వారా ఆధ్యాత్మికతను పెంచడమే కాకుండా రాఖీపూర్ణిమ వంటి పండగతో మానవ సంబంధాలను పెంచుకునేందుకు సైతం అవకాశం కల్పిస్తుంది.గౌరీభట్ల నరసింహరామ శర్మ,శివాలయం ప్రధానార్చకులు, యాదాద్రి

ఆడంబరాలు వద్దు…

రెండు మాసాల నుంచి శుభ ముహూర్తాలు లేకపోవడం, కార్తీకమాసంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఈ పరిస్థితుల్లో శ్రావణంలో శుభకార్యాలు ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంది. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మందిని పిలవకుండా శుభకార్యాలు చేసుకోవడం మంచిది. సమూహాలుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాయిదా వేయగలిగిన కార్యక్రమాలను కార్తీక, మార్గశిరాల్లో జరుపుకోవడం మంచిది. చలివేదుల రామకృష్ణ శర్మ, పురోహితుడు, రాజాపేట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement