e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home జిల్లాలు కొర్రీలు లేకుండా కొనుగోళ్లు

కొర్రీలు లేకుండా కొనుగోళ్లు

కొర్రీలు లేకుండా కొనుగోళ్లు

రైతులకు అండగా రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌
సాకులతో ఇబ్బంది పెట్టొద్దంటూ హెచ్చరికలు
తాలు ఎక్కువగా ఉంటే మండల స్థాయిలో నిర్ణయం
తేమ శాతం, తూకంలో తేడాలుంటే కేసులు నమోదు
దిగుమతుల్లో జాప్యం తగదని మిల్లర్లకు విజ్ఞప్తి
చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు సిద్ధం

నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్‌ 22(నమస్తే తెలంగాణ):యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. వివిధ కారణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే కఠిన చర్యలకు సిద్ధమైంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రవాణా వాహనాల యజమానులు ఎవరు సమస్యలు సృష్టించినా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. మూడు నాలుగు రోజులుగా అక్కడక్కడా రైతులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో గురువారం మరోసారి కొనుగోళ్లతో భాగస్వామ్యం ఉన్న శాఖల అధికారులు, సంస్థల ప్రతినిధులతో నల్లగొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులను మోసం చేయాలని చూస్తే చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్లను మరింతవేగవంతం చేసేలా అందరూ సహకరించాలని కోరారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత యాసంగితో పోలిస్తే ఈ సారి అదనంగా లక్ష ఎకరాల్లో వరిసాగైనట్లు అంచనా. సుమారు 11.50 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరిపంట సాగైంది. ప్రాజెక్టులతో పాటు చెరువుల్లోనూ పుష్కలంగా సాగునీరు లభించడంతో రైతుల పెద్ద ఎత్తున వరిసాగుకు ఉపక్రమించారు. అయితే ఈ నెలారంభం నుంచి పెద్ద ఎత్తున వరికోతలు మొదలవగా ధాన్యం మార్కెట్లకు వస్తున్నది. దీంతో ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రారంభంలో నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు సీరియస్‌గా స్పందించకపోవడంతో అక్కడక్కడా రైతులు ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం వెంటనే చర్యలకు సిద్ధ్దమైంది. ఎస్పీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసు శాఖ కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నది.

పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్‌, తూనికలు కొలతలు, రవాణా శాఖల అధికారులతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అకారణంగా, కుంటి సాకులతో కొనుగోళ్లలో సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే వెంటనే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. తేమశాతంలో అవకతవకలు, తూకంలో తేడాలు చేసినా కేసులు పెట్టడానికి సిద్ధ్దమయ్యారు. దీనికి తోడు ఈ సీజన్‌లో తలెత్తుతున్న మరో సమస్య తాలు. ఈ సారి దోమకాటు, చీడపీడలతో ధాన్యం లోనాణ్యత తగ్గిందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. దీన్ని సాకుగా పెట్టి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు రైతులను అక్కడక్కడ ఇబ్బందులకు గురిచేశారు. దీనిపైనా జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిజంగా నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువ తాలు ఉంటే ఆ ధాన్యాన్ని మండల స్థాయిలోని వ్యవసాయ అధికారుల బృందం పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. దానికి అనుగుణంగా కొనుగోలుదారులు నడుచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
నేరుగా కాల్‌ చేయవచ్చు
ఇలాంటి వ్యవహారాలను తమ దృష్టికి తీసుకువస్తే నేరుగా రంగంలోకి దిగుతామని ఇప్పటికే జిల్లా ఎస్పీ రంగనాథ్‌ పోలీసు శాఖ తరుఫున ప్రకటించారు. రైతులను కావాలని ఇబ్బందులకు గురిచేస్తే నేరుగా తన మొబైల్‌ నెంబర్‌ 9440795600కి కాల్‌ చేయవచ్చని లేదంటే వాట్సప్‌ చేయవచ్చని ఎస్పీ రైతులకు సూచించారు. ఇక మరోవైపు ఆయా మిల్లుల్లో ధాన్యం దిగుమతుల విషయంలో జాప్యం చేస్తే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధ్దంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లకు వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల మిల్లింగ్‌ సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి మిల్లులకు ప్రాధాన్యతా ప్రకారం కేటాయిస్తున్నారు. 1.20లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇప్పటివరకు 12వేల మంది రైతుల నుంచి లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలు వస్తే నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారిస్తూ… రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. నిరంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ అక్కడి నుంచి రవాణా వాహనాలను పర్యవేక్షిస్తూ రైస్‌ మిల్లుల్లోనూ దిగుమతుల్లో జాప్యం చేయడమే లక్ష్యంగా బృందాలు పనిచేస్తున్నాయి. రైతుల వద్ద నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారిస్తూ వెంటనే సమస్యను పరిష్కరిస్తూ రైతులకు బాసటగా నిలుస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీలతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. ప్రారంభంలో తేమశాతం, తాలు, మట్టి ఇతరత్రా సాకులతో కొనుగోళ్లల్లో కొంతమేరకు జాప్యం జరిగితే ఇప్పుడంతా గాడిలో పడేలా చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడడమే లక్ష్యంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

RGV దెయ్యం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా

వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..

మ‌హేశ్ బాబు ముఖ్య‌మైన సందేశం

ఈ యాప్‌లు మీ మొబైల్ ఉన్నాయా? వెంట‌నే డిలీట్ చేయండి

Advertisement
కొర్రీలు లేకుండా కొనుగోళ్లు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement