e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home జిల్లాలు కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ

కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ

కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ

వారి నుంచే ఇతరులకు..
సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బలహీనమే..
మ్యుటేషన్‌ చెందితే ఇబ్బందులు తప్పవు
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయి..
సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలం

సూర్యాపేట, ఏప్రిల్‌ 22 (నమస్తే తెలంగాణ) : ‘కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో బలహీనంగానే ఉంది.. ఒకవేళ వైరస్‌ మ్యుటేషన్‌ చెంది బలపడితే ఇబ్బందులు తప్పవు.. అందుకే ప్రజలు నిర్లక్ష్యం వీడాలి.. లేదంటే బతికి బట్టకట్టడం కష్టం.. అత్యధికంగా 20 నుంచి 40 ఏండ్ల వయస్సు వారే ఎక్కువ కరోనా బారిన పడుతున్నారు.. వారి ద్వారానే కాంటాక్ట్స్‌ పెరుగుతున్నాయి.. ఒక వేళ కరోనా కోరలు చాచి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది.. మందులు, బెడ్లతోపాటు ఆక్సిజన్‌ కూడా సరిపోను ఉంది. క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేశాం.. కరోనా పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్‌ను పెంచాం’ అని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం తెలిపారు. జిల్లాలో కరోనా పరిస్థితి, చికిత్స, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలను గురువారం ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.జిల్లాలో కరోనా పరిస్థితి, చికిత్స అందిస్తున్న తీరు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై గురువారం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం నమస్తే తెలంగాణ ప్రతినిధితో మాట్లాడారు.

“గతేడాది మార్చిలో కరోనా వ్యాప్తి చెందగా.. ఈ సంవత్సరం కూడా మార్చిలోనే సెకండ్‌ వేవ్‌ ప్రభావం ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో పాజిటివ్‌ కేసులు బాగానే నమోదవుతున్నప్పటికీ మరణాల సంఖ్య పూర్తిగా తగ్గింది. సెకండ్‌ వేవ్‌ బలహీనంగానే ఉండడమే ఇందుకు కారణం. ఒకవేళ వైరస్‌ మ్యూటేషన్‌ చెంది బలపడితే ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలా సీరియస్‌గా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వైరస్‌ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. దీని ద్వారా శరీరంలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది” అన్నారు.

ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి
కొవిడ్‌ వ్యాధి రాకుండా ఉండాలంటే… దాని నుంచి విముక్తి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలని. ఎవరికైనా టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే వెంటనే ఐసోలేట్‌ కావాలని. సదరు వ్యక్తికి కాంటాక్ట్‌లో ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు లేకున్నా ఐదు రోజుల వరకు హోం ఐసోలేట్‌ అయి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌ వైరస్‌ ముక్కు, నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తున్నందున ఈ రెండింటినీ మాస్క్‌తో కప్పివేయడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం, ఇతరులను తాకకుండా భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. దీంతో పాటు అత్యంత ప్రధానమైనది వాక్సిన్‌ తీసుకోవడమే అని జిల్లా వైద్యాధికారి వివరించారు. ఆహారం విషయంలో ఎవరి స్థాయిలో వారు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. దీంతో పాటు మన శ్వాసనాళాలు ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండి మార్గం సక్రమంగా ఉంటే ఎలాంటి వైరస్‌ వచ్చినా వెంటనే కిందికి వెళ్లిపోతుందని, ఒకవేళ ఏదైనా అడ్డుపడితేనే అక్కడ వైరస్‌ నిల్వ ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో చేరిన వారికే పరిస్థితి విషమిస్తోంది. శ్వాసనాళాలు పరిశుభ్రంగా ఉండాలంటే రోజుకు రెండు సార్లు వేడినీటితో అందులో ఎలాంటి కెమికల్స్‌ వేయకుండా ఆవిరి పట్టాలి. దీంతో పాటు ప్రాణాయామం చేస్తే కొవిడ్‌తో ఇబ్బందులు ఉండవని తెలిపారు.

వాక్సిన్‌ తీసుకుంటే ప్రాణహాని ఉండదు
కరోనా వచ్చిన తరువాత ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టడం కంటే ముందస్తుగానే వాక్సిన్‌ తీసుకోవాలని వైద్యాధికారి కోటాచలం పిలుపునిచ్చారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్‌ ఇస్తుండగా.. వచ్చే నెల నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. వాక్సిన్స్‌లో కొవాగ్జిన్‌, కొవీషీల్డ్‌ ఉన్నాయని. కొవాగ్జిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న వారికి రెండో డోస్‌గా ఇస్తుండగా, కొవిషీల్డ్‌ మొదటి డోస్‌, రెండో డోస్‌ ఇస్తున్నామని తెలిపారు. మొదటి డోస్‌ వాక్సిన్‌ తీసుకున్న తరువాత వారం రోజుల వ్యవధిలో యాంటీ బాడీస్‌ తయారవుతాయని. రెండో డోస్‌ తరువాత శరీరంలో అవి బాగా పెరిగి కొవిడ్‌ నుంచి మనిషిని రక్షిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 4,625 మందికి ఇవ్వాల్సి ఉండగా మొదట్లో చాలా తక్కువ మంది వచ్చారని, టార్గెట్‌ దాటడమే కష్టతరంగా ఉండేదని, నేడు రోజుకు 4625 మందికే కాకుండా అదనంగా మరో మూడు వేల మందికి పైనే వాక్సిన్‌ వేస్తున్నామని తెలిపారు.

ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం
జిల్లాలో ఒకవేళ కరోనా మహమ్మారి విజృంభించినా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉంచినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కోటాచలం అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్‌ దవాఖానలో 121 పడకలు, హుజూర్‌నగర్‌లో 20, కోదాడలో 10 బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, సూర్యాపేటలో అన్నింటికీ ఆక్సీజన్‌, వెంటిలేషన్‌ ద్వారా అందించవచ్చ న్నారు. ప్రస్తుతం ఇక్కడ 9 మంది చికిత్స పొందుతున్నారని, జిల్లా కేంద్ర దవాఖానతో పాటు 22 పీహెచ్‌సీలు, 4 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఆక్సీజన్‌ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు సూర్యాపేట పట్టణానికి అతి సమీపంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదాయంలో 100 పడకలతో కూడిన ఐసోలేషన్‌ కేంద్రం సిద్ధం చేశామన్నారు. అక్కడ ముగ్గురు ఉన్నారని, పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉన్న వారికి రెమిడెసివర్‌తో పాటు ఇతర ఇంజక్షన్లు, మందులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Advertisement
కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement