మహిళలకు అండగా ‘సఖీ’


Thu,December 5, 2019 12:14 AM

-విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
-మంచి సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపు
-సమస్యల పరిష్కార వేదిక సఖీ
-గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: బాలికలు, మహిళల సంరక్షణకు సఖీ కేంద్రాలు అండగా నిలువాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సఖీ ఒన్‌స్టాప్‌ కేంద్రాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు సఖీ వాల్‌పోస్టర్‌ ఆయన ఆవిష్కరించగా.. సఖీ హెల్ప్‌లైన్‌ నెం. 181 వాహనాన్ని ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్‌, వైద్య,ఆరోగ్యం, రెవెన్యూ, స్త్రీ సంక్షేమశాఖలు సమన్వయంతో పనిచేసి మహిళల భద్రతకు కృషి చేయాలన్నారు. సఖీ కేంద్రాలు మహిళలకు సహాయ సహకారాలు అందించి వారి రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మహిళలు చైతన్యంగా ముందుకు సాగాలన్నారు.

సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే సఖీ కేంద్రాల్లో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలన్నారు. కౌన్సిలింగ్‌ ద్వారా పరస్పర గౌరవభావం పెంపొందించి మార్పు తీసుకురావడం సఖీ కేంద్రాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమస్య వచ్చినప్పుడు భార్యా భర్తలు కూర్చుని మాట్లాడుకోవాలి అలాంటప్పుడు సఖీ కేంద్రాలు చేయూతనివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. బజారులో ఉండే ఆకతాయిల నుంచి ఇంట్లో ఉండే పిల్లల వరకు ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెట్టి ఉండాలన్నారు. ఎవరికైనా తమ పిల్లలంటే అభిమానం ఉంటది... అది భుజాలమీదకు ఎక్కించుకునే విధంగా ఉండటం వల్ల తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. శిక్షలు పడటమే పరిష్కారం కాదు... అసలు సంఘటనలు జరుగకుండా చూడటమే ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు. సమాజం బాగుంటే ఎలాంటి ఫిర్యాదులు రావని చెప్పారు. పోలీసులు సఖీ కేంద్రాలకు పూర్తిగా అండదండలు అందించాలని కోరారు. సఖీ కేంద్రాల్లో వసతి కూడా ఉంటుందని వివరించారు. 181కు ఫోన్‌ చేస్తే ఇంటికి వచ్చి సఖీ నిర్వాహకులు, అవసరమైతే పోలీసులు సహాయం చేస్తారని చెప్పారు. మంచి సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. భువనగిరి హౌజింగ్‌ బోర్డులో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని, సంక్షేమం కోసం ఎంత రిస్కు వచ్చినా భరిస్తామని డ్రైనేజీ సమస్యలను వివరించేందుకు వచ్చిన మహిళలను ఉద్దేశించి మంత్రి స్పందించారు.


సమస్యల పరిష్కార వేధిక సఖీ
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సఖీ కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదై రాజీ కుదరని, సఖీ కేంద్రాల ద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. సరైన భవనం లేకపోవడం వల్ల సఖీ కేంద్రాన్ని ఇప్పటి వరకు ప్రారంభించేందుకు వీలుకలుగలేదన్నారు. మహిళలు తమ బాధలను ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిష్కరించుకోవాలన్నారు.

మహిళలకు తోడ్పాటు
మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటునిస్తుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. విద్యార్థినులు 181 నంబర్‌ను ఉపయోగించుకుని ఆకతాయిల నుంచి రక్షన పొందవచ్చని చెప్పారు. షీ టీములు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సమస్య ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే ఫిర్యాదు అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, స్త్రీశిశుసంక్షేమాధికారి కృష్ణవేణి, జడ్పీ మహిళా సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ప్రణీతాపింగల్‌రెడ్డి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీపీ నిర్మలా వెంకటస్వామి పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...