దళితుల జీవితాల్లో వెలుగులు


Sun,November 17, 2019 11:20 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: దళిత యువత జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకనుగుణంగా భారీగా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నది. డ్రైవర్లుగా పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న యవకులు ప్రభుత్వ రుణాలతో కార్లను కొనుగోలు చేసి ఓనర్లుగా మారారు. మరోవైపు నైపుణ్యం ఉన్న ఎస్సీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తున్నది. జిల్లాలో నైపుణ్యం ఉన్న ఎస్సీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తున్నది. 2014 నుంచి 2018 వరకు 2268 మందికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సహకార సంఘం ద్వారా రూ. 2689.30 లక్షల సబ్సిడీ రుణాలు అందజేసింది. కాగా 2018-19 ఏడాదికి లబ్ధిదారుల ఎంపిక పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికసహకార పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.222.34 కోట్లు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు లబ్ధిదారులకు కేవలం రూ.లక్షలోపు సబ్సిడీ రుణాలు అందజేయగా.. తెలంగాణ సర్కార్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు, 2017-18లో రూ.12 లక్షలకు పెంచింది. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా ఇచ్చే సబ్సిడీ పోగా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకురుణంగా అందజేస్తారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారికి 80 శాతం సబ్సిడీ. రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 70 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు రుణం పొందేవారికి ప్రభుత్వం 60 శాతం సబ్సిడీని అందజేస్తున్నది.

రూ.2689.30 లక్షల సబ్సిడీ రుణాలు
జిల్లాలో దళిత యువత ఆర్థికంగా ఎదుగాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు వారు ఎంచుకున్న విభాగాలను ఉపాధిగా మలచుకోవాలని సంకల్పించింది. వారికి కావాల్సిన రుణాలు అందజేసి, యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సాహం అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ.లక్ష రుణంతో సరిపెట్టుకునేది కానీ, తెలంగాణ సర్కార్ ఇందుకు భిన్నంగా రుణాలను పెంచుతూ యువతను ఆదుకున్నది. ఐదేండ్ల కాలంలో 2268 మంది షెడ్యూల్డ్ కులాల యువతకు రూ.2689.30 లక్షల సబ్సిడీ రుణాలను అందజేసింది. జిల్లాలో కార్లు, జిరాక్స్ సెంటర్లు, ప్యాసింజర్ ఆటో, చికెన్ సెంటర్, ట్రాక్టర్, టెంట్ హౌస్, పాడి గేదేలతో పాటు వివిధ రకాల ఉపాధిలపై సబ్సిడీ రుణాలను అందజేశారు.

డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకం..
డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకం ద్వారా ఎస్సీ యువతకు వాహనాలను ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సేవా సంఘం ద్వారా అందజేస్తున్నది. ఒక యూనిట్ ఖరీదుపై 60 శాతం రాయితీ లభిస్తుంది. లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లిస్తే మిగతా డబ్బులు బ్యాంకు ద్వారా రుణం అందుతుంది. యూనిట్ మంజూరైన వారు హైదరాబాద్‌లోని ఉబర్ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఇందుకు లబ్ధిదారుడికి కనీస అర్హత ఉండాలి. 21 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. కనీస విద్యార్హత 8వ తరగతి ఉత్తీర్ణత, పదోతరగతి ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆర్టీఏ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ లైసెన్సు కలిగి ఉండాలి. రవాణా బ్యాడ్జి ఉండాలి. గ్రామీణ ప్రాంతంవారి వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతంవారిది రూ. 2 లక్షలు మించరాదు. ఐదేండ్ల వరకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి రుణం పొందనివారుగా ఉండాలి. అభ్యర్థి రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

96 మందికి వాహనాలు అందజేత..
డ్రైవర్లుగా పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకోలేక అవస్థ పడుతున్న దళితయువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రవాణారంగంలో విస్తరించిన ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని సబ్సిడీ రుణాలు అందజేసి డ్రైవర్లుగా ఉన్న దళిత యువతకు ఓనర్లుగా మార్చింది. జిల్లాలో మొత్తం 2016 నుంచి 2019 వరకు 96 మంది షెడ్యూల్డ్ కులాల యువతకు కార్లను షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా అందజేశారు. ఇందులో 2016-17 సంవత్సరంలో 56 మంది యువతకు, 2017-18 సంవత్సరంలో 40 మంది యువకులకు అందజేశారు. దీంతో గతంలో డ్రైవర్లుగా ఉన్న దళిత యువకులు ఓనర్లుగా మారి, తమ జీవితంలో పెను మార్పులను సాధించారు. ఆర్థికంగా ఎదుగడంతో పాటు సమాజంలో గౌరవంగా జీవనం సాగిస్తున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles