యాదాద్రిలో భక్తుల పరవశం


Sun,November 17, 2019 11:18 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. వేలాది మంది భక్తులు సత్యనారాయణస్వామి వారి వ్రతపూజలు ఆచరించేందుకు తరలిరావడంతో మండపాలు భక్తులతో పోటెతాయి. వారాంతపు సెలవురోజు కావడంతో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. కొండపై తిరువీధులన్నీ నిలబడటానికి సందులేనంతగా కిటకిటలాడాయి. భక్తులు నారసింహుడి దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆలయం లో అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు, సుదర్శనహోమం, పూజా కైంకర్యాల్లో భక్తులు పాల్గొని మొ క్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట పడుతుందని భక్తులు చెబుతున్నారు. భక్తుల రద్దీ పెరుగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించలేదు. ఆర్జిత పూజలు కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి ప్రారంభమయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి.

వైభవంగా వ్రత పూజలు.. కార్తిక దీపారాధనలు..
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తికమాసం సందర్భంగా దీపారాధన కార్యక్రమం యాదాద్రిలో ఘనంగా జరిగింది. ఆదివారం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీవారి ఖజానాకు రూ.29,92,301 ఆదాయం..
శ్రీవారి ఖజానాకు రూ.29,92,301 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్‌తో రూ.4, 75,328, 150 రూపాయల దర్శనంతో రూ.4,45,750, వ్రతాల ద్వారా రూ. 6,50,000, కల్యాణకట్టతో రూ.60, 000, ప్రసాద విక్రయంతో రూ.6,44,050, శాశ్వత పూజల ద్వారా రూ.1,00,270, టోల్‌గెట్ తో రూ.2,190, అన్న ప్రసాదంతో 37,378, వాహనపూజలతో రూ.21,200, ఇతర విభాగాలతో రూ.4,29,903 కలుపుకుని రూ.29,92 ,301 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
స్వామిని దర్శించుకున్న మేయర్ బొంతు రామ్మోహన్..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, ప్రముఖ హాస్యనటుడు రాం జగన్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles