పదిలంగా ప్రయాణం..


Mon,November 11, 2019 12:01 AM

-యథావిధిగా నడిచిన ఆర్టీసీ బస్సులు
-సమన్వయంతో కదిలిన యంత్రాంగం
-జిల్లాలో తిరిగిన 132 బస్సులు
-కనిపించని సమ్మె ప్రభావం
-విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి అధికారుల సూచనలు

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: జిల్లాలో ఆర్టీసీ ప్రయాణం సాఫీగా సాగుతున్నది. యాదగిరిగుట్ట డిపోలోని 69 బస్సులు ప్రయాణికులకు రవాణా సౌకర్యం అందించాయి. డిపో నుంచి ఉదయం 6 గంటల లోపే 30 శాతం బస్సులను బయటకు పంపారు. అనంతరం ఉదయం 9 గంటల వరకు మరో 20 శాతం బస్సులను పంపగా సాయంత్రంలోపు 85 శాతం బస్సులు బయటకు వచ్చి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ అధికారులు, జిల్లా రవాణాధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో వ్యాప్తంగా మొత్తం 132 సర్వీసులను అందుబాటులో ఉంచారు.

జిల్లాలో 132 బస్సులు..
జిల్లావ్యాప్తంగా ఆదివారం 132 బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 55 ఆర్టీసీ బస్సులు, 14 అద్దె బస్సులు, మ్యాక్సి క్యాబ్స్ 60, మోటార్ క్యాబ్‌లు 03 ఉన్నాయి. ఆర్టీసీ రవాణా వ్యవస్థను ప్రభుత్వంలోకి చేర్చాలని గత 37 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం జిల్లాలో ఏ మాత్రం కనిపించడం లేదు. కార్మికుల సమ్మెకు దిగిననాటి నుంచి అధికారులు సమన్వయంతో బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట డిపో నుంచి ఆర్డీనరీ, పల్లెవెలుగుతో పాటు సూపర్ లగ్జరీ సర్వీసులను నడిపించారు. ప్రమాదాలు జరుగకుండా తాత్కాలిక డ్రైవర్లకు టెస్టులు నిర్వహించి విధుల్లోకి తీసుకుంటున్నారు. సూపర్ లగ్జరీలు ప్రస్తుతం విజయవాడ, కర్నూల్, హైదరాబాద్‌కు నడిపిస్తున్నారు. యాదగిరిగుట్టతోపాటు, ఆలేరు, భువనగిరి ప్రాంతాలు ప్రజలు ఎక్కువగా హైదరాబాద్‌కు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కువశాతం బస్సులను హైదరాబాద్‌కు నడిపించేలా చర్యలు చేపడుతున్నారు.

డ్రైవర్, కండక్టర్లకు అధికారుల సూచనలు..
విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేయాలని తాత్కాలిక బస్సు డ్రైవర్లకు, కండక్టర్లకు ఆర్టీసీ అధికారులు తగు సూచనలు చేస్తున్నారు. ప్రయాణికులతో మర్యాద ప్రవర్తించాలని, ఆర్టీసీకి ప్రజల్లో మంచి పేరు ఉందని, ప్రమాదరహిత సంస్థగా పేరుతెచ్చుకుందని దానిని తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు దృష్టిలో ఉంచుకొని బస్సులను జాగ్రత్తగా నడపాలని సూచించారు. మంచు కురుస్తున్నందున బస్సులు నడిపేటప్పుడు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వాహనాలను ఓవర్ టేక్‌చేసే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని.. ఎంతో మంది ఆర్టీసీపై నమ్మకంతో బస్సులలో ప్రయాణిస్తున్నారన్నారు.

37వ రోజు కొనసాగిన సమ్మె..
ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది. యాదగిరిగుట్ట డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నాకు సీపీఐ, బీజేపీ, ఏఐటీయూసీ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...