డ్రమ్ సీడర్‌తో ఉపయోగాలెన్నో..


Fri,October 18, 2019 11:02 PM

నీలగిరి : వరి సాగులో ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతో రైతాంగం లాభాల బాటన నడిచేందుకు డ్రమ్ సీడర్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీని వల్ల కూలీల సమస్యలను అధిగమించడంతో పాటు రూ.వేలల్లో పెట్టుబడుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. రైతులకు అనువైన సమయంలో కూలీలు దొరక్క ఇబ్బందులు పడడంతో పాటు ముదిరిన నాట్లు వేసి పంట దిగుబడి రాక ఇబ్బందులు, రకరకాల మందులు వాడకుండా ఉండే విధంగా రైతాంగానికి అనువైన వ్యవసాయ విధానం అందుబాటులో ఉంది.
తెలంగాణలో వరి సుమారు 44 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇందులో సుమారు 85 శాతం బోర్లు, బావులు, చెరువుల కింద సాగవుతుంది. సాధారణంగా వరిని నాట్లు పోసి వేయడం పరిపాటి. సకాలంలో వర్షాలు కురవకపోవడం, నార్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యమవడం, కూలీల అధిక రేట్లు ఇలాంటి పరిస్థితుల కారణంగా సాగు ఖర్చు పెరిగి దిగుబడి తగ్గడం వల్ల వరి సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నయ పద్ధతుల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఏరువాక డాట్ సెంటర్ శాస్త్రవేత్త నరేందర్ రైతులకు పలు సూచనలు తెలిపారు అవేంటో చూద్దాం.

డ్రమ్ సీడర్‌తో సాగు-ఉపయోగాలు...
-ఈ పద్ధతిలో ఎకరాకు 10 నుంచి 15 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
-డ్రమ్ సీడర్ పద్ధతిలో నారు ప్రత్యేకంగా పెంచుకోవాల్సిన అవసరం లేదు.
-నాటు వేసే పని ఉండదు. కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చు సుమారు రూ.3 నుంచి 3500 తగ్గించవచ్చు.
-డ్రమ్ సీడర్‌తో నాటినప్పుడు ఒక చ.మీ.కు ఉండాల్సిన మొక్కల సంఖ్య ఖచ్చితంగా ఉండడం వల్ల నాటు వేసినప్పటి కన్నా దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
-ప్రతికూల పరిస్థితుల్లో అంటే వర్షాలు ఆలస్యమైనా, నీరు సకాలంలో అందనప్పుడు, కాల్వల ద్వారా నీరు ఆలస్యమైనా రైతులు ముదురు నార్లతో నాట్లు వేయడం, ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడులు తగ్గుతాయి. అలాంటి పరిస్థితిలో కూడా డ్రమ్‌సీడర్ పద్ధతి అనువుగా ఉంటుంది.
- నాటు వేసిన వరి కన్నా డ్రమ్ సీడర్‌తో వేసిన వరి 5 నుంచి 7 రోజుల ముందుగానే కోతకు వస్తుంది.
డ్రమ్ సీడర్‌తో సాగు అవరోధాలు...
-డ్రమ్ సీడర్ పద్ధతి (బౌండు/క్షారం/ఆమ్లం) సమస్యాత్మక నేలకు అనుకూలం కాదు.
-చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అనుకూలం కాదు.
l పొలం ఎత్తు, వంపులు లేకుండా చదునుగా ఉండాలి. ఇలా లేకుంటే నీరు నిల్వ ఉండి, మొలక మురిగి మొక్కల సంఖ్య తగ్గుతుంది.
సాగు పద్ధతులు..
నేలలు : సమస్యాత్మక భూములు తప్ప, వరిని సాగు చేసే అన్ని నేలలు అనుకూలం. ముంపునకు గురయ్యే భూములు అనుకూలం కావు.
ప్రధాన పొలం తయారీ : సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిలో కూడా తయారు చేయాలి. సాధ్యమైనంత వరకు పొలమంతా సమానంగా ఉండేలా చూసుకోవాలి.
కాలం : రబీ సీజన్
విత్తన శుద్ధి : కిలో విత్తనానికి ఒక గ్రా. కార్బండజిమ్ పొడి, నీటిలో కలిపి 12 గంటలు నానబెట్టాలి.
విత్తనాన్ని మండె కట్టడం
- 12 గంటలు నానబెట్టిన తర్వాత 24 గంటలు మండె కట్టాలి. మండెకట్టిన విత్తనాలకు ముక్కు పగిలితే చాలు.
- ఆలస్యమైతే విత్తనం నుంచి మొలక వస్తుంది.
- వీటిని డ్రమ్ సీడర్‌లో వేసి లాగినప్పుడు గింజ రాలదు.
ప్రధాన పొలంలో విత్తడం
- విత్తే సమయానికి పొలంలో నీరు లేకుండా బురదగా ఉంటే చాలు.
- డ్రమ్ సీడర్ వరి ఎకరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు రెండు చివరలా 20 సెం.మీ. దూరంలో డ్రమ్ము చుట్టూ సమాన దూరంలో రంధ్రాలుంటాయి.
-గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో కేవలం 3/4వ వంతు మాత్రమే గింజలను నింపాలి. ఒకసారి డ్రమ్ సీడర్‌లో లాగితే 8 వరుసల్లో వరుస వరుసకు మధ్య 20 సెం.మీ. వ్యయంతో గింజలు పడతాయి.
-ఒక వరుసలో కుదుళ్ల మధ్య దూరం 5 నుంచి 8 సెం.మీ. ఉంటుంది.
ఎరువుల యాజమాన్యం : ఆరు టన్నుల పశువుల ఎరువు, 48 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులతోపాటు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను ఒక ఎకరానికి వేయాలి.
కలుపు యాజమాన్యం విత్తిన 3 నుంచి 5 రోజుల్లోపు అయితే ప్రెటిలాక్లోర్ 500 మి.లీ. లేదా ఆక్సాడీయార్జిల్ మందును 35 నుంచి 45 గ్రా. విత్తిన 8 నుంచి 10 రోజులకు ఇసుకలో కలిపి చల్లాలి.
-విత్తిన 15 రోజుల్లోపు అయితే ఫెనాక్సి ప్రాప్ పీ ఈథైల్ 250-300 మి.లీ., 20 రోజులైతే బిస్‌పైరిబాక్ సోడియం 100 మి.లీ. 200 లీ. నీటికి కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...