13వ రోజు.. 133 బస్సులు


Thu,October 17, 2019 11:09 PM

-రోడ్లపైకి వచ్చిన 75 శాతం బస్సులు
-క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్న ప్రయాణికులు
-నేటి నుంచి ప్రయాణికులకు టికెట్లు
-జిల్లాలో కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం జిల్లా ప్రజలపై పడకుండా అధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు చేరనున్న గమ్యాలను బట్టి బస్సులను అందుబాటులో ఉంచారు. నిరంతరం ఆయా విభాగాల అధికారులు డిపో, బస్టాండ్‌ల వద్ద ఉంటూ పర్యవేక్షించారు. రెవెన్యూ, పోలీసు, ఆర్టీఏ అధికారుల సమన్వయంంతో గురువారం జిల్లాలో మొత్తం 133 బస్సులను నడిపించారు. ఇందులో 58 ఆర్టీసీ బస్సులు, 15 అద్దె బస్సులు, 60 ఇతర వాహనాలు ఉన్నాయి. 58 తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. నాలుగు విభాగాల అధికారుల సమన్వయంతో చేసిన కృషి జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.

ఆర్టీసీ ఇన్‌చార్జి నోడల్ అధికారిగా దేవాదుల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డి..
కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఇన్‌చార్జి నోడల్ అధికారిగా దేవాదుల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డిని నియమించారు. ఆయనతోపాటు మరో 12 మంది రెవెన్యూ, ఇతర అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ బుధవారం ఉత్తర్వులు ఇవ్వగా వారు గురువారం బాధ్యతలు చేపట్టారు.

ఆర్టీసీ అధికారులుగా వీరే..
పలువురు రెవెన్యూతోపాటు జిల్లా ఇతర విభాగాలలో పనిచేసే జూనియర్, సీనియర్ అధికారులను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ఇన్‌చార్జీలుగా నియమించారు. మోటకొండూర్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, వలిగొండ ఆర్‌ఐ నర్సింహారెడ్డి, డీఐసీ జూనియర్ అసిస్టెంట్ సిరాజుద్దీన్, బీసీ డెవలప్‌మెంట్ ఆపీస్ జూనియర్ అసిస్టెంట్ భిక్షం, జిల్లా కో ఆపరేటివ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఫరీద్ ఆహ్మద్, ఎస్సీ కో ఆపరేషన్ ఈడీ బ్రహ్మచారి, జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీస్ అసిస్టెంట్ జియాలజిస్టు రవిశంకర్, జిల్లా లేబర్ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ తహేర్, జిల్లా హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్ ఏడీవో రాజేశ్ బాబు, జిల్లా ఎస్సీ అభివృద్ధి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ విభాగం అధికారులు శివ సత్యనారాయణ, శ్రీనివాస్ సమ్మె పూర్తయ్యే వరకు విధుల్లో ఉంటారు.

నేటి నుంచి టికెట్లు..
13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉన్నతాధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి, బస్సులను నడుపుతున్నారు. అయితే తాత్కాలిక కండక్టర్లు డిపో మేనేజర్ ఇచ్చిన ధరల పట్టికను అనుసరిస్తూ ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ టికెట్‌ను ఇవ్వడం లేదు. దీంతో ఇబ్బందులు వస్తున్న విషయాన్ని గమనించిన అధికారులు టికెట్లను ఇష్యూ చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఆర్టీసీ నోడల్ ఇన్‌చార్జీ అధికారిగా దేవాదుల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డిని నియమించారు. ఆయనతోపాటు మరో 12 మంది రెవెన్యూ, ఇతర అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు నేటి నుంచి కండక్టర్లకు టికెట్లను అందజేయడంతో పాటు, డ్రైవర్లకు సంబంధించిన వ్యవహారాలు చూడనున్నారు. ప్రతి కండక్టర్‌కు టికెట్ బాక్స్‌తో పాటు ధరల పట్టికనూ ఇవ్వనున్నారు.

13వ రోజు 133 బస్సులు
జిల్లాలో గురువారం 133 బస్సులను నడపించారు. ఇందులో 58 ఆర్టీసీ బస్సులు, 15 అద్దె బస్సులతోపాటు 60 ఇతర బస్సులు ఉన్నాయి. దీంతో యాదగిరిగుట్ట డిపోలో దాదాపుగా 75 శాతం బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో జిల్లాలోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు.

ప్రభావం చూపని సమ్మె..
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం జిల్లాలో పెద్దగా కనిపించడం లేదు. ఎప్పటిలాగే బస్సులు నడువడంతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం హాయిగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యం.. విద్యార్థుల భవిష్యత్‌ను గాలికి వదిలేసి, సమ్మె చేయడమేంటని ప్రజలు ఆర్టీసీ కార్మికుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా 13వ రోజు సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల ధర్నా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి, బిక్షాటన చేశారు. వీరికి సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, టీచర్స్ జేఏసీ నాయకులు మద్దతు పలికారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...