ప్రయాణం.. ప్రశాంతం


Tue,October 15, 2019 11:36 PM

-జిల్లాలో కనిపించని ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం
-పలు రూట్లలో 56 ఆర్టీసీ, 15 అద్దె బస్సులు
-ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
-100 శాతం బస్సులు నడిపేందుకు అధికారుల కరసత్తు
యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరినా జిల్లాలో ఆ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. ఆర్టీసీ, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీసులు సమన్వయంతో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు గట్టి చర్యలు చేపట్టారు. జిల్లాలో యాదగిరిగుట్ట డిపో నుంచి మంగళవారం ఏకంగా 71 బస్సులను నడిపించారు. ఇందులో 56 ఆర్టీసీ బస్సులు ఉండగా 15 అద్దె బస్సులు ఉన్నాయి. అంతే కాకుండా బుధవార నుంచి 100 శాతం బస్సులను నడిపించడంతో పాటు సుదూర ప్రయాణికుల కోసం సూపర్ లగ్జరీ బస్సులను రోడ్డుపైకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో తిరుగుతున్నాయి. యాదగిరిగుట్ట డిపో నుంచి అన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచుతున్నారు. 56 మంది తాత్కాలిక డ్రైవర్లు, 56 మంది కండక్టర్లతో బస్సులను యథావిధిగా నడిపిస్తున్నారు.

రోడ్డు పైకి లగ్జరీ బస్సులు..
జిల్లాలోని యాదగిరిగుట్ట డిపోలో 8 సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. నిత్యం విజయవాడ, కర్నూల్‌తో పాటు హైదరాబాద్, వరంగల్, హన్మకొండకు తిరుగుతూ ఉంటాయి. సమ్మె నేపథ్యంలో 8 బస్సులు నిలిచిపోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో భక్తులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. పరిస్థితిని గమనించిన కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, ఆర్డీవో వెంకటేశ్వర్లు వెంటనే సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ రంగంలో 30 ఏండ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 10 మంది డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి మంగళవారం లగ్జరీ బస్సులను ట్రయల్న్ చేశారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఎంపిక చేస్తున్నామని డీటీవో సురేందర్‌రెడ్డి తెలిపారు. సాధ్యమైనంతవరకు బుధవారం నుంచి లగ్జరీ బస్సులను నడుపనున్నట్లు ఆయన తెలిపారు.

రోడ్డెక్కిన 71బస్సులు..
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటి నుంచి అధికారులు రోజురోజు బస్సుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు. మొదటి రోజు కేవలం 30 ఆర్టీసీ బస్సులను నడిపించిన అధికారులు క్రమేపి వాటి సంఖ్యను పెంచుతున్నారు. మంగళవారం 71 బస్సులను నడిపించారు. ఇందులో 56 ఆర్టీసీ బస్సులు ఉండగా 15 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

100 శాతం బస్సులను నడిపేందుకు కరసత్తు..
జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాదగిరిగుట్ట డిపో నుంచి ఇప్పటికే 75 శాతం ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్న అధికారులు, 100 శాతం బస్సులు నడిపేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్, జేసీ ఆదేశాలతో ఆర్టీఏ వెంకటేశ్వర్లు, ఏసీపీ మనోహర్‌రెడ్డి, డీటీవో సురేందర్‌రెడ్డి, ఏఎంవీఐ రఘుబాబు, సీఐ నర్సింహారావు, మహిళా పోలీసుల సమన్వయంతో అన్ని రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతూ నడిపిస్తున్నారు. యాదగిరిగుట్ట డిపోలో మొత్తం 108 బస్సులు ఉండగా ఇందులో 93 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. మరో 15 అద్దె బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇందులో 72 బస్సులను నడిపిస్తుండగా మిగతావి 15 అద్దె బస్సులున్నాయి. 56 బస్సులకు గాను 56 మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించగా మిగతా 16 మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించనున్నారు.

పోలీసుల గట్టిబందోబస్తు ..
ఆర్టీసీ కార్మికుల సమ్మెను పురస్కరించుకుని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో డిపో చుట్టు పోలీసుల గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఒకవైపు మొబైల్ పార్టీలు, పికెట్లతో పాటు మహిళా పోలీసులు సైతం అందుబాటులో ఉన్నారు.

సమ్మెకు ఎంపీ మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు తెలిపారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం నుంచి పాదయాత్రగా వచ్చి ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు పలు అంశాలను అమలు చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట డిపో వద్ద వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు డిపో వద్ద వంట చేసుకుని భోజనాలు చేశా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు వివిధ పార్టీల అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...