ప్రట్టణ పారిశుధ్యంపై పత్యేక కార్యాచరణ


Tue,October 15, 2019 11:33 PM

భువనగిరి, నమస్తేతెలంగాణ : పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని నగరాలు, మున్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో సిటీ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనంతో గ్రామాలు సుందరంగా తయారయ్యాయని, అదే స్ఫూర్తితో నగరాలు, మున్సిపాలిటీల్లో సిటీ శానిటేషన్ ప్లాన్ కార్యక్రమం త్వరలో చేపట్టనున్నట్టు వివరించారు. మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పట్టణ పారిశుధ్యంపై ప్రతి పురపాలక, పట్టణ పారిశుధ్య ప్రణాళిక (సిటీ శానిటేషన్ ప్లాన్) తయారు చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త సేకరణ నుంచి రీసైక్లింగ్ వరకు అన్ని వివరాలను ఈ ప్రణాళికలో ఉంచాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల మేరకు పురపాలికల్లో ఉండాల్సిన పారిశుధ్య కార్మికుల సంఖ్య, వాహనాల సంఖ్య ఉండేలా చూడాలని ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే పాత మున్సిపాలిటీల్లో స్వచ్ఛ ఆటోలు ఇచ్చామని, ఇంకా అవసరం ఉంటే వాహనాలను, సిబ్బందిని పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రతి పారిశుధ్య కార్మికుడుకి యూనిఫాంతోపాటు అవసరమైన రక్షణ సామగ్రిని సమకూర్చాలన్నారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించేలా ఆయా ఏజెన్సీలను ఆదేశించాలన్నారు. పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం కల్పిస్తున్న భీమా మాదిరిగా పురపాలిక సిబ్బందికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి పట్టణానికి ఒక డంపింగ్ యార్డు ఉండాలని, డంప్ యార్డు లేని చోట స్థల సేకరణకు కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైరీ సోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్‌సీసీ) ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పట్టణంలో ఇప్పటికే అన్ని పురపాలికలు ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ (ఓడీఎఫ్)సాధించాయని, కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన వాటిల్లోనూ ఓడీఎఫ్ సాధించేలా చూడాలన్నారు. ప్రతి పట్టణంలోఉన్న పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై దృష్టి సారించాలని, అవసరమైన చోట మరిన్ని టాయిలెట్స్ నిర్మాణం చేయాలన్నారు. దీంతోపాటు ప్రతి నగరంలో మహిళల కోసం ప్రత్యేక షీ-టాయిలెట్స్ నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలో టాయిలెట్స్‌ను ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఈ మేరకు వాటి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

దీంతోపాటు అందుబాటులో ఉన్న టాయిలెట్స్ సైన్స్ బోర్డులను సైతం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం వరంగల్, సిరిసిల్లలో మాదిరిగా ప్రతి పట్టణంలో మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసి వారం రోజుల్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు సమర్పించాలన్నారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు పురపాలిక బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణాలకు దగ్గరలో గ్రీన్ లాంగ్ స్పేస్ (పెద్ద పార్కులను) ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలన్నారు. పట్టణాల్లో ఉన్న తాగునీటి వనరుల మదింపు(ఆడిట్) చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 251 అనుసరించి సిటీ శానిటేషన్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రమేశ్, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి తదితరులున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...