అభివృద్ధి పరుగులు


Fri,October 11, 2019 01:34 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: 2016 ఆక్టోబర్ 11న యాదాద్రిభువనగిరి జిల్లా ఆవిర్భవించింది. 17 మండలాలు, 6 మున్సిపాలిటీలు, రెండు రెవెన్యూ డివిజన్లూ ఏర్పాటయ్యాయి. కలెక్టరేట్, డీసీపీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు కావడంతో ప్రజలకు పాలన చేరువైంది. పునర్విభజన తర్వాత పాలనాసౌలభ్యం మెరుగు పడగా అనేక ప్రభుత్వ శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని శాఖలను ప్రభుత్వం ఒకే చోట విలీనం చేయగా కొన్ని కనుమరుగు కాగా మరికొన్ని తమ స్వరూపం మార్చుకొని ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల చొరవ, జిల్లా అధికారుల కార్యదక్షత వల్ల అభివృద్ధి వేగవంతమైంది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ్ణారెడ్డి, భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ జిల్లా అభివృద్ధికి పునాదులు వేసే పనులకు ఐదేండ్ల కిందటే అంకురార్పణ చేయడంతో నేడు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాక కొత్తగా ఏర్పడిన జడ్పీకి తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎలిమినేటి సందీప్‌రెడ్డి 30 రోజుల కార్యాచరణలో చూపిన చొరవ అందరిని ఆకట్టుకున్నది.

వైద్య సేవలకు తలమానికంగా..
జిల్లా కీర్తి కీరిటంలో కలికితురాయిలా ఎయిమ్స్ మారిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రూ.1,028 కోట్లతో కేంద్రం ఎయిమ్స్‌ను మంజూరు చేసి ఇటీవలే బీబీనగర్‌లో ప్రారంభించింది. ముందుగా వైద్య విద్యను ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న ఓపీ సేవలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ కృషితో ఏర్పాటైన ఎయిమ్స్ యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు మరో పది జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించనున్నది. అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఇతర రాష్ర్టాల ప్రజలకు కూడా వైద్య సేవలందించే అవకాశం ఈ వైద్యవిద్యా సంస్థకు ఉంది.

విశ్వవిఖ్యాతిగా భువనగిరి రాక్‌ైక్లెంబ్ కళాశాల..
భువనగిరిలో ఏర్పాటైన రాక్‌ైక్లెంబ్ కళాశాల పేరు ప్రఖ్యాతలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఇక్కడ ఉన్న భువనగిరి ఖిల్లా రాక్‌ైక్లెబింగ్‌కు ఎంతో అనువుగా ఉండటంతో ఇక్కడే కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో శిక్షణ తీసుకున్న కామారెడ్డికి చెందిన పూర్ణ, ఖమ్మంకు చెందిన ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. నల్లగొండకు చెందిన అరుణ్, శ్రీకుమార్ కిలిమంజారో(ఎల్బర్ట్స్) పర్వతాన్ని అధిరోహించారు. దీంతో రాక్‌ైక్లెంబ్ కళాశాల జిల్లా పేరును అగ్రభాగంలో నిలుపుతున్నది.

మెరుస్తున్న రహదారులు..
ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్న సీఎం కేసీఆర్ జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. జిల్లాలో ప్రధానంగా 14 రహదారులను చేపట్టారు. జిల్లాలో రూ.825 కోట్లతో 62 రోడ్ల పనులను చేపట్టారు. అదేవిధంగా తొమ్మిది భవనాలకు శ్రీకారం చుట్టారు.

మిషన్ భగీరథతో తాగునీటి జలాలు..
ఫ్లోరైడ్ రక్కసిని శాశ్వతంగా రూపుమాపేందుకు రూ. 40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభమయ్యాయి. భగీరథ పైలాన్‌ను చౌటుప్పల్‌లో రూ.2 కోట్లతో జూన్ 8,2015న సీఎం కేసీఆర్ ప్రారంభించగా జిల్లాలోని అన్ని ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. జిల్లాలోని 777 ఆవాస ప్రాంతాలకు ఇప్పటికే 758 ఆవాసాల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. 568 గ్రామాలకు 8 నెలల నుంచి గోదావరి జలాలు నిరంతరంగా సరఫరా అవుతున్నాయి. మిగిలిన మరో 19 ఆవాసాల్లో అసంపూర్తి పనులను పూర్తి చేసి నూరుశాతం గ్రామాల్లో నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 1092 కిలోమీటర్ల పైపులైన్ పూర్తి చేశారు. అదేవిధంగా 85, 681 ఇళ్లకు నల్లా కనెక్షన్లు పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు 344 పూర్తయ్యాయి.

మిషన్ కాకతీయతో 72 వేల ఎకరాలు సాగు..
జిల్లాలోని 1093 చెరువులు, కుంటలను మిషన్ భగీరథ ద్వారా బాగు చేసి 72,000 ఎకరాల బీడు భూములను సాగులోకి తేవడం కోసం ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదటి దఫాలో 193 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. ఇందుకోసం రూ.86.35 కోట్లు ఖర్చు చేశారు. రెండో దఫాలో 277 చెరువులకు గాను 270 చెరువుల్లో పనులు ప్రారంభించారు. మూడో విడుతలో మరో 270 చెరువులకు మహర్దశ పట్టింది. నాలుగో విడుతలో మరో 353 చెరువుల పునర్నిర్మాణానికి నిధులను కేటాయించారు.

ప్రగతిపథంలో పంచాయతీలు..
బొమ్మలరామారం మండలంలోని హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నిధులు విడుదల చేసింది. వీటితో ఆలేరు పట్టణంలో పెండింగ్‌లో ఉన్న ైఫ్లె ఓవర్ బ్రిడ్జి, మార్కెట్ గోదాముల నిర్మాణం, అంబేద్కర్ భవనం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనం, చెక్‌డ్యామ్, అండర్ పాస్ బ్రిడ్జి జూనియర్ కళాశాల భవనం, ఐటీఐ బిల్డింగ్, గుండాల టూ జీడికల్, కొలనుపాక డబుల్‌రోడ్డు, మండల పరిషత్ భవనం, సాయిగూడెం బీటీ రోడ్డు, ఆలేరులో విద్యుత్ సబ్‌స్టేషన్, చేనేత సహకార సంఘం, గ్రామ పంచాయతీ భవనాలు, వైద్యశాలల పునరుద్ధరణ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుతో పాటు పలు అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు ఖర్చు చేయగా, తుర్కపల్లి, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, యాదగిరిగుట్ట మండలాలోని కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనాలు, బీటీ, అషుర్‌ఖానా, శ్మశాన వాటిక నిర్మాణాలకు ఇప్పటికే రూ.280 కోట్లు కేటాయించారు.

మల్కాపూర్‌లో పరిశ్రమలు..
మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాలోని మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, చౌటుప్పల్‌లోని క్లస్టర్‌లో వేలాది పరిశ్రమలకు బీజం పడింది. 442 ఎకరాల్లో రూ.1553 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కులో పరిశ్రమల కోసం 450 మందికి స్థలాలు కేటాయించారు. ఈ నెల 14న కేటీఆర్ చేతుల మీదుగా మల్కాపురంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని సమాచారం.

గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులతో జలకళ..
ఎలాంటి సాగునీటి వనరులకు నోచుకోని ఆలేరుకు గంధమల్ల వరంగా మారనున్నది. గంధమల్ల చెరువు ప్రస్తుత నీటి నిల్వ కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే.. ప్రభుత్వం రిజర్వాయర్‌గా మార్చి 9.8 టీఎంసీలు నిల్వ చేయాలని ప్రతిపాదించింది. అదేవిధంగా బస్వాపూర్ ప్రాజెక్టుతో 14.5 టీఎంసీల నీరు నిల్వ చేసుకునేందుకు ఆస్కారం ఉన్నది. అయితే ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయని ఆందోళనలు వెల్లువెత్తడంతో సామర్థ్యాన్ని 1.5 టీఎంసీకి తగ్గించారు. అంతేకాక బస్వాపూర్‌లో 200 ఎకరాల్లో బృందావన్ థీమ్ పార్కు ఏర్పాటు కానున్నది. ఇప్పటికే 250 ఎకరాల భూమి లభ్యతపై సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపారు.

సంక్రాంతి నాటికి సమీకృత కలెక్టరేట్..
జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం సంక్రాంతి నాటికి అందుబాటులోకి రానున్నది. 2017 దసరా రోజు సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. 2018 దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినా పూర్తికాలేదు. కలెక్టరేట్ నిర్మాణం కోసం రూ.40 కోట్లు మంజూరయ్యాయి. భువనగిరి మండలం రాయగిరి శివారులో 11 ఎకరాల స్థలంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లక్షా ఇరవై వేల చదరపు అడుగల వైశాల్యంలో నాలుగు బ్లాకుల జీ ప్లస్ 2 భవన నిర్మాణాలను చేపట్టారు. ఏడాదిలోగా పూర్తికావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏ,బీ,సీ,డీ బ్లాకులుగా విభజించి చేపట్టిన పనుల్లో ఏ, బీ బ్లాకుల పనులు ముందుగా పూర్తి చేస్తున్నారు. ఏ,బీ బ్లాకుల్లో ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, ఏసీలు, ఫ్లోరింగ్, ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. కంపౌండ్, విద్యుత్ జనరేటర్, అంతర్గత రోడ్లు, ఏసీలు, మురుగు నీటి పారుదల, మంచినీటి వసతి, పచ్చదనం వంటి వాటిని చేపడుతున్నారు. ప్రస్తుతం శానిటేషన్, విద్యుత్ వైరింగ్, నీటి సంపులు, నల్లాల వంటి సప్లమెంటరీ పనులు జరుగుతున్నాయి. అయితే ముందుగా కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జాప్యం, కూలీల కొరతతో పనులు మందకొడిగా జరుగుతున్నాయి. అయితే జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయింపు జరిగినా పనులు ప్రారంభం కాలేదు.

స్ఫూర్తివంతంగా మూడేండ్ల కలెక్టర్ పాలన..
సీనియర్ ఐఏఎస్ అధికారి అనితారామచంద్రన్ నూతన జిల్లాకు కలెక్టర్‌గా వచ్చి మూడేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలులో ఆమె అధికారులను సమన్వయం చేస్తూ ముందుకుసాగుతున్నారు. స్థానికంగా ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉన్న కలెక్టర్‌గా హెడ్‌క్వార్టర్ మెయింటేన్ చేయాలని చెప్పి చూపించిన అధికారిగా ఆమె మన్ననలు పొందారు. 2016 అక్టోబర్ 11న జిల్లా కలెక్టర్‌గా అనితారామచంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలులో ఆమె అధికారులను సమన్వయం చేస్తూ ముందుకుసాగుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యల పరిష్కారానికి మూలాలంటూ ఒకవైపు కలెక్టర్ మరోవైపు డీసీపీ నారాయణరెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఒకవైపు మౌలిక వనరులు లేకపోయినా రాజీపడుతూ ప్రజా సమస్యలపై సమరం పూర్తిస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. జేసీ రమేశ్ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగక శ్రమిస్తున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...