కార్మికుల్లో అంతర్మథనం


Mon,October 7, 2019 11:47 PM

- సమ్మెపై సర్కార్ కఠిన నిర్ణయం
-చర్చలకు ససేమిరా అన్న ప్రభుత్వం
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
-అందుబాటులోకి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు
-తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల నియామకం
-ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఆర్టీసీ సమ్మెతో కార్మికుల్లో ఆంతర్మథనం మొదలైంది. సమ్మెకు తలొగ్గేది లేదని రాష్ట్ర ప్రభు త్వం తెగేసి చెప్పింది. చర్చలకు సైతం ససేమిరా అన్న కఠిన నిర్ణయానికి సీఎం కేసీఆర్ ప్రకటించడంతో విధుల్లో చేరే ఆలోచనలో కొందరు కార్మికులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1100 మంది కార్మికులు విధుల్లో చేరారని తెలియడంతో జిల్లాలో పనిచేసే ఆర్టీసీ కార్మికుల్లో పునరాలోచన మొదలైంది. సోమవారం మూడో రోజు జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు.

కార్మికుల ఆలోచన విధానంలో మార్పు !
సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ సమ్మెపై పూర్తిస్థాయిలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీంతో కార్మికుల ఆలోచన విధానంలో మార్పు వస్తున్నది. పండుగల వేళ సమ్మె పేరిట యూనియన్లు బ్లాక్ మెయిల్ చేయడం, ఆందోళనకు రాజకీయ రంగు పులుమడంపై ఆగ్రహంగా ఉన్నట్లు అర్థమవుతున్నది. కార్మికుల సమ్మెపై ప్రజల్లోనూ వ్యతిరేకత ప్రారంభమైంది. పండుగల వేళ ప్రజలను ఇబ్బందులు పెడుతూ సమ్మెలు చేయడ ం ఎంతవరకు సమంజసమని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కార్మికులు విధుల్లో చేరుతున్నారన్న విషయం జిల్లా కార్మికులను పునరాలోచనలో పడేస్తున్నది. యూనియన్ నాయకుల మాటలకు తలొగ్గి సమ్మెకు దిగినవారు అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుందా.. అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది కార్మికులు సైతం విధుల్లో చేరే అవకాశం లేకపోలేదు. జిల్లాలోని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో 95 ఉండగా ఇందులో నుంచి దాదాపు 90 శాతం ఆర్టీసీ బస్సులు నడిచాయి. దసరా పండుగతో పాటు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలిక పద్ధతిలో వంద మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుని ఆర్టీసీ బస్సులు నడిపారు. అద్దెబస్సులతో పాటు పాఠశాల, ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీ వాహనాలు నడవడంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. యాదగిరిగుట్ట డిపో పరిధిలో 34 ఆర్టీసీ బస్సులు, 15 ఆర్టీ సీ అద్దె బస్సులు, 12 ప్రైవేట్ స్కూల్ బస్సుల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేశారు.

కనిపించని సమ్మె ప్రభావం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి చేపట్టిన సమ్మె ప్రభావం జిల్లాలో పెద్దగా కనపడలేదు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికలు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందు లో భాగంగా రెవెన్యూ, రవాణా, పోలీసు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్మాయ చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం భారీ సంఖ్యలో యువకులు డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసేందుకు డిపోల వద్దకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం అర్హత గల యువకులను ఎంపిక చేసిన అధికారులు ఆర్టీసీ బస్సులను డిపోల నుంచి బయటకు తీయించి వివిధ ప్రాంతాలను ప్రయాణికులు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

పకడ్బందీ ప్రణాళికలు...
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసి విజయవంతంగా అమలు చేశారు. ఉదయం నుంచి అధికారులు, పోలీసులు సిబ్బంది బస్టాండ్లకు చేరుకుని బస్సులను నడిపేలా చర్యలు తీసుకున్నారు. యాదగిరిగుట్ట డిపోలో 61 మంది డ్రైవర్లతో పాటు మరో 61 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వీరిచే 34 ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. 15 ఆర్టీసీ అద్దెబస్సులు, 12 ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిచాయి. ప్రైవేట్, స్కూల్ బస్సులను బస్టాండ్‌లోకి అనుమతించారు. బస్టాండ్ ఆవరణలో ప్రైవేట్ వాహనాలు సైతం ఏర్పాటు చేసిన అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.

ర్యాలీ నిర్వహించిన కార్మికులు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద మౌనం పాటించారు. ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రసంగాలు చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన కార్మికులు మౌనం పాటించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...