భారీ వర్షం


Mon,October 7, 2019 12:44 AM

-జలమయమైన రహదారులు
-పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి
-నేలకొరిగిన వరి, ఇతర పంటలు
-ఇబ్బందులు పడ్డ వాహనదారులు

యాదాద్రి భువనగిరి, జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో వరుణుడి ప్రతాపం కొనసాగుతున్నది. పొద్దంతా తీవ్ర ఎండ ఉంటుండగా.. సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తున్నది. ఎన్నడూ లేని విధంగా రెండు రోజులుగా భువనగిరి పట్టణ, మండలంలో శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక వైపు ఉరుములు వాటికి తోడు మెరుపులు కూడా పోటీపడుతున్నట్లుగా భయభ్రాంతులకు గురి చేస్తూ రెండు గంటల పాటు బీబీనగర్ నుంచి యాదాద్రి వరకు జాతీయ రహదారిని చిమ్మచీకట్లు కమ్మేశాయి. తుర్కపల్లిలో 74.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భువనగిరి పట్టణంలో 69.8 మి.మీ వర్షం కురిసిందని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. చౌటుప్పల్‌లో 12.8 మీ.మీ, బొమ్మలరామారంలో 7.4 మి. మీ, రాజాపేటలో 7.0 మి.మీ, వర్షం కురిసింది. సాధారణ సగటు వర్షపాతం 585. 2 మి.మీ కాగా 595.7 మి.మీ వర్షం కురింసిందని కలెక్టర్ చెప్పారు. ఒకవైపు మహిళలు సాయంత్రం కాగానే బతుకమ్మ వేడుకలకు సన్నద్ధం అవుతుండగా మరోవైపు వరుణుడు ప్రతాపం చూపించాడు. ఎడతెరపి లేకుండా సుమారు రెండు గంటల పాటు 69.8 మి.మీ మేర వర్షం కురిసింది. వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొన్నది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో నీరు పూర్తిగా నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈదురుగాలికి వృక్షం నేలకొరిగింది. పట్టణానికి చెందిన రాసాల కిరణ్‌కు చెందిన రెండు పాడి గేదెలు పిడుగుపాటుతో మృతిచెందాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు కోరారు. భూదాన్‌పోచంపల్లి మండల వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో పొట్టదశకు వచ్చిన వరిపంట నేలకు ఒరిగింది. ఆదివారం సైతం పలు గ్రామాల్లో చిరుజల్లులు కురిశాయి. వలిగొండలో చిరు జల్లులు కురిశాయి.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...