పండుగవేళ ప్రయాణం సాఫీగా


Sat,October 5, 2019 12:44 AM

- అధికారులతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- ప్రయాణికులకు ఇబ్బందులులేకుండా చర్యలు తీసుకోవాలని సూచన
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు
- తాత్కాలికంగా ప్రైవేట్ వ్యక్తుల నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ ప్రభావం సాధారణ ప్రయాణికులతోపాటు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారిపై పడకుండా జాగ్రత్తలు తీసుకునే చర్యలను వేగవంతం చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రమేశ్ పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. స్కూల్ బస్సులను అదనంగా నడపడానికి పాఠశాలల నిర్వాహకులకు రవాణా శాఖ అధికారుల ద్వారా ఫోన్లు చేయించి ఆర్టీవో కార్యాలయానికి పిలిపించి బస్సులను నడపాలని, మీ వద్ద ఉన్న డ్రైవర్ల జాబితాను వెంటనే ఇవ్వాలని ఆదేశించగా ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ట్రస్మా నాయకులు డ్రైవర్ల ఫోన్ నంబర్లను జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్‌రెడ్డికి అందజేశారు. ఉదయం 6 గంటల వరకు యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చేరుకుని ఏఎంవీఐ రఘుబాబుకు రిపోర్టు చేయాలని డ్రైవర్లకు సమాచారం ఇచ్చారు. క్వాలిఫైడ్ డ్రైవర్ల ఎంపిక బాధ్యతలను రవాణా శాఖ అధికారులు పూర్తి చేశారు. శాఖ ఉదయం 6 గంటల నుంచి డిపో నుంచి బస్సులను బయటకు తీయడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రయాణికులు అధికంగా ఉన్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్ని బస్సులు అవసరం అవుతాయనే విషయంపై ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. డిపో నుంచి బస్సులు తీయడానికి వీలు కానట్లయితే ప్రైవేట్ పాఠశాలల బస్సులను రంగంలోకి దించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర ఆదేశించారు. జిల్లాలో సుమారు 295 ప్రైవేట్ బస్సులు, 93 ఆర్టీసీ బస్సులు, 15 అద్దె బస్సులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అందుబాటులో ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వాటన్నింటిని ఉపయోగించుకుని దసరా పండుగకు సొంతూరుకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రముఖంగా సూచనలు చేయడంతో ఆ మేరకు ఆర్టీసీ అధికారులు.. రవాణా శాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ప్రయాణికులకు తమ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల సమన్వయంతో..
ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల సమన్వయంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిన నేపథ్యంలో మూడు శాఖల అధికారులు కార్యాచరణను ఖరారు చేశారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ కె.నారాయణరెడ్డి, డీటీవో సురేందర్‌రెడ్డి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని బస్సులు ఎలా నడపాలనే విషయంపై ఏ రూట్లలో నడపాలి అనే విషయాలపై క్లారిటీకి వచ్చారు.

గుట్ట డిపో పరిధిలో 144 సెక్షన్ అమలు
- ఏసీపీ టి.మనోహర్‌రెడ్డి
యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఇద్దరు, ముగ్గురు గుమ్మిగూడి ఉండటం నిషేధించినట్లు ఏసీపీ టి.మనోహర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను నిషేధించినందున కార్మికులు ఎవరూ బస్సులను అడ్డుకోవడంగానీ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేపట్టరాదని చెప్పారు. 10 మొబైల్ పార్టీలు, 6 పికెట్ల్లు, డిపో వద్ద వీడియో కెమెరాలు, సరిహద్దున గల జిల్లాల మూడు శాఖల అధికారులతో సమాచార వ్యవస్థ దృష్టి పెట్టినట్టు ఏసీపీ వివరించారు.

హైదరాబాద్ రూట్లో అధికంగా బస్సులు..
హైదరాబాద్ రూట్లో అత్యధికంగా బస్సులు నడపాలని ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారు అధికంగా ఉంటున్నందున అధిక బస్సులు ఈ రూట్లో నడపడానికి డ్రైవర్లను సిద్ధం చేసినట్టు డీటీవో సురేందర్‌రెడ్డి చెప్పారు. ప్రతి బస్సులో ఒక కానిస్టేబుల్‌ను పంపి బస్సులు నడిపేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 100 మంది డ్రైవర్లను రవాణా శాఖ అధికారులు ఎంపిక చేశారు. బస్సులు ఎలా నడపాలి..? ఒక్కో బస్సులో డీజిల్ ఎంత పోయించాలి..? పల్లె వెలుగుకు ఎంత చెల్లించాలి..? డ్రైవర్లకు వేతనం తదితర వివరాలు కూడా ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు తెలియజేశారు.

ప్రయాణికులకు ఇబ్బందులు కలగనివ్వం : జేసీ రమేశ్
ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రయాణీకులపై పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జేసీ రమేశ్ తెలిపారు. ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారినే డ్రైవర్లు గా తీసుకోవాలని బస్సును అప్పగించేముందు అన్ని రకాలుగా డ్రైవర్లను పరీక్షించిన మీదటే అప్పగించాలని సూచించారు.

ఎక్స్‌ప్రెస్‌కు రూ.ఐదు వేలు.. పల్లె వెలుగుకు రూ.నాలుగు వేలు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెను తిప్పకొట్టేందుకు ప్రైవేటు అద్దె బస్సులను ప్రథమంగా రోడ్లపైకి తిప్పాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆర్టీసీ డీఎం రఘు నమస్తేతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతు ఎక్స్‌ప్రెస్‌కు రూ.ఐదు వేలు, పల్లె వెలుగుకు రూ. నాలుగు వేలు చెల్లించిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి పూర్తి చేసిన వ్యక్తులకు బస్సును అప్పగిస్తామని చెప్పారు. వారు ఎంత కలెక్షన్ తెచ్చుకున్నా సంబంధం లేదన్నారు. డీజిల్ కూడా తమ డిపోల్లోనే పోస్తామని చెప్పారు. కాగా ఆర్టీసీ కార్మికులు స్థానిక ప్రైవేటు డ్రైవర్లను కలిసి ఎవరూ తమ పొట్టలు కొట్టే ప్రయత్నం చేయవద్దని విధులకు ఎవరూ హాజరుకావద్దని విజ్ఞప్తి చేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...