స్వచ్ఛందంగా..


Wed,September 18, 2019 12:23 AM

-పల్లెల ప్రగతికి చేయీచేయి కలుపుతున్న గ్రామస్తులు
-అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళాసంఘాల శ్రమదానాలు
-ఊరూరా పారిశుధ్య పనులు
-వాడవాడలా అవగాహన ర్యాలీలు
-కొనసాగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
-చందేపల్లి, గిరిబోయినగూడెంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..
-ప్రణాళికతో గ్రామాలు ప్రగతిబాట వైపు అడుగులు
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పల్లెల్లో ఎక్కడ చూసినా ఒక్కటే ఉత్సాహం కనిపిస్తున్నది. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా తమ గ్రామాలను నందనవనంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మంగళవారం ర్యాలీలు తీస్తూ, ఇంటింటికీ వెళ్లి పారిశుధ్యం, పచ్చదనంపై చైతన్య పరుస్తూ ముందుకుసాగారు. మోటకొండూర్ మండలంలోని చందేపల్లి, గిరిబోయినగూడెం గ్రామాల్లో కలెక్టర్ అనితారామచంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్‌పేటలో 24 మహిళా సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు.

గ్రామస్తులతో కలిసి ప్రణాళిక అమలు
జిల్లాలోని అన్ని గ్రామాల్లో అధికారులు, గ్రామస్తులతో కలిసి ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని ఎంపీపీ, ఎంపీడీవో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో పర్యటించి వీధుల్లో ఉన్న పిచ్చిమొక్కలు, చెత్త తొలగింపు పనులు చేపట్టారు. అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచులు, పాలకవర్గం సభ్యులు, పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని వివరించారు.

పిచ్చి మొక్కల తొలగింపు
యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్‌పేటలో సుమారు 200 మంది మహిళలు శ్రమదానంలో పాల్గొన్నారు. మా గ్రామాన్ని మేమే బాగు చేసుకుంటామని ప్రతినబూనారు. దాతారుపల్లిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తీసివేశారు. డోజర్లు, ట్రాక్టర్ల సాయంతో గ్రామాల్లో చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. పాడుబడిన బావులను పూడ్చి వేశారు. బొమ్మలరామారం మండలంలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ స్పీడందుకున్నది. ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు సాగుతున్నాయి. రాజాపేట మండలంలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక జోరుగా కొనసాగుతున్నది. బొందుగులలో నిర్వహించిన శ్రమదానంలో మండల ప్రత్యేకాధికారి మంక్తనాయక్, ఎంపీపీ గోపగాని బాలామణి, ఎంపీడీవో రామారావు, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్ పాల్గొన్నారు. తుర్కపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు
ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గుండాల మండలంలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టి, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో పాత బావులు, బోర్లను పూడ్చి వేశారు. డోజర్లసాయంతో మురుగు కాల్వలను పునరుద్ధరించారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు కొనసాగాయి.

చందేపల్లి, గిరిబోయినగూడెంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న పనులతీరుపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలోని మోటకొండూర్ మండలంలోని చందేపల్లి, గిరిబోయినగూడెం గ్రామాల్లో కలెక్టర్ అనితారామచంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. చందేపల్లిలో వీధులన్నీ తిరుగుతూ జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన పనుల వివరాలను పరిశీలించారు. గిరిబోయినగూడెంలో రికార్డులను పరిశీలించి, అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పెద్ద ఎత్తున గ్రామ ప్రణాళిక
చౌటుప్పల్ డివిజన్ వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దేశానికే పట్టుగొమ్మలైన గ్రామాలభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక అన్ని మండలాల్లో జోరుగా జరుగుతున్నది .అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్నారు. చౌటుప్పల్‌లో గ్రామ ప్రణాళిక ఉత్సాహంగా కొనసాగుతుంది. అన్ని గ్రామాల్లో గ్రామప్రణాళికలో భాగంగా ఇప్పటికే గుర్తించిన పనులను సత్వరమే పూర్తిచేసేందుకు అందరూ సమష్టిగా పనులు చేస్తున్నారు. మంగళవారం అన్ని గ్రామాల్లో శ్రమదానం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు యువత, ప్రజలు పాల్గొని శ్రమదానం చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన పిచ్చి, కంపచెట్లను తొలగించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేశారు. సంస్థాన్‌నారాయణపురం మండలం వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్నది. అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మండలంలోని గుడిమల్కాపురం, చిమిర్యాలలో నిర్వహించిన గ్రామ ప్రణాళికలో ఆర్డీవో ఎస్. సూరజ్‌కుమార్‌తో కలిసి జేసీ రమేశ్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామ ప్రణాళిక విజయవంతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. రోడ్లకు ఇరువైపుల, ఇండ్ల మధ్య ఉన్న కంప చెట్లను తొలగించారు. మోరీలను శుభ్రం చేయించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించారు. రామన్నపేట మండలం వ్యాప్తంగా గ్రామప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. మండలంలోని సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ ప్రణాళికలో జేసీ రమేశ్ పాల్గొన్నారు. పనులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. మోత్కూరు మండలం వ్యాప్తంగా గ్రామప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామాల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించారు. మోరీలను శుభ్రం చేయించారు. అడ్డగూడూరు మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్ల వెంట ఉన్న కంప, పిచ్చి చెట్లను తొలగించారు. ఇండ్ల మధ్య పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు.

ప్రగతిబాట వైపు అడుగులు
భువనగిరి డివిజన్‌లో 30రోజుల ప్రణాళికలతో గ్రామాల రూపురేకలు మారిపోతాయని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అన్నారు. మంగళవారం మండలంలోని బండసోమారం, అనాజీపురం, వీరవెల్లిల, తుక్కాపురం, గౌస్‌నగర్, అనంతారం, తాజ్‌పూర్, బీఎన్ తిమ్మాపురం, చందుపట్ల, కూనూరు, కేసారం, బాలంపల్లి గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. గ్రామ వీధుల్లో చెత్తా చెదారం లేకుండా, పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బండసోమారంలో సర్పంచ్ నానం పద్మకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో పాడుబడిన ఇండ్లను కూల్చివేశారు. రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలగించారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనులు చేపట్టారు. భూదాన్‌పోచంపల్లి మండల వ్యాప్తంగా 22 గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యమవుతున్నారు. పెద్దరావులపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసి సభ్యురాలు కోట పుష్పలతామల్లారెడ్డి పాల్గొని రోడ్లను శుభ్రం చేయించి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వలిగొండ మండలంలో మంగళవారం వలిగొండ పట్టణంతోపాటు మండలంలోని అన్నిగ్రామాల్లో శిథిలావస్థకు చేరిన గోడలతోపాటు పాడుబడిన ఇండ్లను కూల్చివేశారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని వలిగొండ ఎంపీడీవో వెంకటమ్మ కోరారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...