దేశంలో ఎక్కడాలేని విధంగా యాదాద్రి నిర్మాణాలు


Wed,September 18, 2019 12:18 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సమస్త కర్మలకు ప్రతినిధిగా విశ్వకర్మ అని వైటీడీఏ ప్రధాన స్తపతి డాక్టర్ ఆనందచార్యుల వేలు, వృత్తి కళాకారుల సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అడ్లూరి రవీంద్రాచారి అన్నారు. మంగళవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా వృత్తి కళాకారుల సేవా సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి శిల్ప కళాశాలలో స్తపతులు, ఉప స్తపతులు, శిల్ప శాస్త్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది కర్మములకు ప్రతినిధిగా విశ్వకర్మ ఉంటారని చెప్పారు. వృత్తి కళాకారులైన శిల్పులు, శిల్పశాస్త్రం అభ్యసించిన ఉప స్తపతులు, స్తపతులు దేవుడికి ఇండ్ల నిర్మాణం చేసి ఇచ్చేవారని అలాంటి అదృష్టం అందరికీ రాదని చెప్పారు. పద్మభూషన్ అవార్డును తీసుకున్నవారికి కూడా రూ. 1000 కోట్లతో ఆలయాన్ని నిర్మాణం చేసే అవకాశం రాలేదని సీఎం కేసీఆర్ వల్ల యాదాద్రిలో పని చేసిన శిల్పులు, ఉప స్తపతులకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పారు. ఈశ్వరుడు సర్వప్రాణుల సౌఖ్యం కోసం తనంతకు తానుగా విశ్వకర్మ రూపంలో అవతరించాడని చెప్పారు. పంచ ముఖములతో దివ్యశక్తి సమన్విత బంగారు శిఖరములతో తేజరిల్లు మేరు శిఖరంబున దివ్యరత్న మణిమయ సింహాసనాసీనుడై ఉంటాడని చెప్పారు. పంచతత్వాత్మకుడై ప్రాక్, దక్షిణ, పచ్చిమ, ఉత్తర, ఈశాన్యములనేడి పంచ దిక్కులను ప్రభావితం చేస్తుంటాడని వివరించారు. అలాంటి ఎంతో ఉత్తమమైన వృత్తిని చేపట్టిన విశ్వకర్మలు చాలా గొప్పవారని చెప్పారు. విశ్వకర్మలకు కులం, మతం లేదని శిలను పట్టిన ప్రతి ఒక్కరూ విశ్వకర్మ వంశీయులేనని స్పష్టం చేశారు. శిలను పట్టి ఉలితో చెక్కి దేవాధిదేవతలకు రూపం ఇచ్చే శిల్పకళాకారుడు ఎంతో గొప్పవాడని చెప్పారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా యాదాద్రి నిర్మాణాలు
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా యాదాద్రి నిర్మాణాలు జరిగాయని డాక్టర్ ఆనందచార్యుల వేలు, వృత్తి కళాకారుల సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అడ్లూరి రవీంద్రాచారి అన్నారు. మధురై లాంటి కట్టడాల్లో కూడా కేవలం స్లాబు వరకు రాయికట్టడం ఉపయోగించారని యాదాద్రిలో ఆధారశిల నుంచి మహారాజగోపురాలకు చివరన అమర్చే కలశం వరకు రాయికట్టడాలేనని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఎక్కడా రాతి నిర్మాణాలు జరుగలేదని చెప్పారు. ఒక వేళ జరిగినా స్లాబు వరకే జరిపారని చెప్పారు. శిల్పకళాకారులను గుర్తించి వారిలో ఉత్సాహం తీసుకురావడం కోసమే స్తపతులకు, ఉప స్తపతులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రవీంద్రాచారి వెల్లడించారు. యాదాద్రిలో శిల్ప నిర్మాణాల వైభవం ప్రపంచానికి తెలిపేందుకు త్వరలోనే యాదాద్రిలో జాతీయ శిల్ప కళాకారుల సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల శిల్ప శాస్త్రంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఉప స్తపతులు సంజీవ్‌కుమార్, మోతీలాల్, మొగిలి, హేమాద్రి, చిరంజీవి, చిరంజీవి ఆదిత్య, రామ్మూర్తి, శ్రీనివాస్‌తో పాటు శిల్పశాస్త్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 మంది విద్యార్ధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వృత్తి కళాకారుల సేవా సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరామోజు విద్యాధర్, అడ్లూరి లక్ష్మణాచారి, గుగ్గిళ్ల రాజేంద్రప్రసాద్, మహేశ్వరం బాబూరావు, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, యాదాద్రి దేవస్థానం పర్యవేక్షకుడు వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...