సాహిత్యం విస్తరించాలి


Sat,September 14, 2019 11:40 PM

-తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి
మోత్కూరు : గ్రామీణ ప్రాంతాల్లో సాహితీ, సంపద విస్తరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వైజే ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ప్రజా భారతి సాహితి, సాంస్కృతిక సేవా సంస్థ ఐదో వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కవులు, కళాకారులు, సాహితి పరులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ పల్ల్లె ప్రాంతం నుంచి సాహిత్యం పుట్టిందని గుర్తించిన ప్రభుత్వం కవులు, కళాకారులకు గొప్ప ప్రాధాన్యం కల్పించి గౌరవించిందన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహితీ సంపదకు నెలువైందన్నారు. మోత్కూరు ప్రజా భారతి సంస్థ పోతన ఉత్సవాల ప్రేరణతో స్థాపించబడి గత ఐదు సంవత్సరాలుగా అనేక సాహిత్య సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సామాజిక సేవా రంగాల్లో లబ్ధి ప్రతిష్టులైన కవులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.

సంస్థ అధ్యక్షుడు కాంభోజు మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆలేరుకు చెందిన ప్రముఖ కవి డాక్టర్ లింగంపల్లి రామచంద్రుకు ప్రజాభారతి జీవన సాఫల్య పురస్కారాన్ని అంద జేశారు. ఇటీవల దాశరథి సాహిత్య పురస్కారం పొందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు అభినందన సత్కారం అందజేశారు. వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న డాక్టర్ నలిమెల భాస్కర్, కందుకూరి శ్రీరాములు ప్రముఖ చరిత్ర పరిశోధకులు ఎస్ హరగోపాల్, కవి యాకుబ్, ప్రముఖ నవలా కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, పెద్దిరెడ్డి గణేశ్, డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి, భువనగిరి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జయశ్రీ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పొరెడ్డి రంగయ్యలకు సంస్థ పక్షాన సాహిత్య పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్, బండారు జయశ్రీ, మోత్కూరు ప్రజాభారతి గౌరవ అధ్యక్షుడు ఎస్‌ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి గుమిడెల్లి వెంకన్న, పూర్వ అధ్యక్షుడు దేవినేని అరవిందరాయుడు, ప్రతినిధులు తొగటి మనోహరాచారి, మొగుళ్లపల్లి సోమయ్య, వారాల యాదగిరి, గాదే వెంకటేశ్వర్లు, కోమటి మత్స్యగిరి, బయ్యని రాజు, బయ్యని వెంకటేశ్వర్లు, మోత్కూరు బ్రహ్మచారి, మెరుగు మల్లేశం, టి ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ, మండల పరిధిలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కవితా పఠనం సభికులను ఎంతగానో అలరించాయి.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...