వినాయకుడికి వీడ్కోలు


Tue,September 10, 2019 11:52 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: వినాయకుడి వీడ్కోలుకు సమయమైంది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని బుధవారం నిమజ్జనం చేసేందుకు ఊరూ వాడా సిద్ధమైంది. మంగళవారం కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ జిల్లాలోని పలు చెరువుల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. బీబీనగర్‌, వలిగొండ, తుమ్మలగూడెం, చౌటుప్పల్‌లోని చెరువులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. భువనగిరి, బీబీనగర్‌, ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట చెరువుల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ లైటింగ్‌ అమర్చడంతో పాటు ఈసారి కొత్తగా ఆటో రిలీఫ్‌ హుక్స్‌ క్రేన్స్‌ వినియోగించనున్నారు. శోభాయాత్రలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు సిద్ధం చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జిల్లాలో నిమజ్జనం ఏర్పాట్లను జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు, భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. భువనగిరిలోని చెరువులతో పాటు ఆయా గ్రామాల చెరువుల్లో భారీ క్రేన్లు ఏర్పాటు చేయడం,తాగునీటి సదుపాయం, లైటింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో రెండు రోజుల పాటు సాగిన నిమజ్జన కార్యక్రమాన్ని ఈ సారి వేగంగా పూర్తి చేసేందుకు ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. ఇప్పటి వరకు విగ్రహాల నిమజ్జనం కోసం అధికారులు భారీ ప్లాట్‌ఫాంలు ఉన్న క్రేన్లను వినియోగించేవారు. దీని వల్ల భారీ వినాయకులను ఈ ప్లాట్‌ఫాం మీదికి ఎక్కించేందుకు మండపాల నిర్వాహకులు, నిమజ్జనం సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చేది. దీంతో నిమజ్జన కార్యక్రమం కూడా ఆలస్యమయ్యేది. ఈసారి అలాకాకుండా ఆటో రిలీఫ్‌ హుక్సును వినియోగించనున్నారు. దీని వల్ల భారీ వినాయక ప్రతిమలకు ఈ హుక్స్‌ తలిగించి నిమజ్జనం వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. మూడు ప్రాంతాల్లో ఈ క్రేన్లు వినియోగిస్తారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో వారం రోజులుగా పిచ్చి మొక్కల తొలగింపు, క్రేన్లు నిలబడేందుకు వీలుగా చదును చేసే పనులు చేపట్టారు. జిల్లాలో భారీ వినాయక ప్రతిమలను జిల్లా కేంద్రంలోని చెరువు, మధ్య, చిన్న విగ్రహాలను ఆయా గ్రామాల్లోని చెరువులకు తరలించాలని ఇప్పటికే అధికారులు మండపాల నిర్వాహకులకు సూచించారు.

పరిశీలించిన రాచకొండ సీపీ
కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, సీపీ మహేశ్‌భగవత్‌ జిల్లాలోని పలు చెరువుల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆయా మండలాల్లో సాగనున్న నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, అదనపు సీపీ సుధీర్‌బాబు, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. జయింట్‌ కలెక్టర్‌ రమేశ్‌ వలిగొండ, భువనగిరి చెరువుల వద్ద చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఊరేగింపును క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. ఊరేగింపు కొనసాగే ప్రధాన ప్రాంతాలతో పాటు గల్లీల నుంచి ప్రధాన రోడ్డుకు చేరుకునే ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఊరేగింపులను కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షిస్తూ ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు ఎల్‌సీడీ స్క్రీన్‌ను అమర్చారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి ఆపై స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. జిల్లాలోని శోభాయాత్రను డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించనున్నారు.

జిల్లాలో 2011 గణపతుల నిమజ్జనం
జిల్లాలో మొత్తం 2011 గణపతి ప్రతిమలను నిమజ్జనం చేయనున్నట్లు, ఇందుకోసం 12 క్రేన్‌లను వాడుతున్నామని భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలోని తీనం చెరువులో భువనగిరి పట్టణానికి చెందిన 124 గణపతులు, బొమ్మలారామారం మండలానికి చెందిన 82 గణపతులను నిమజ్జనం చేయనున్నారని తెలిపారు. భువనగిరి రూరల్‌లోని 123 గణపతులను రాగిరు చెరువు, బీబీనగర్‌ మండలంలోని 144 గణపతులను బీబీనగర్‌, రాఘవపురం చెరువులోకి, ఆలేరు మండలంలో 120 గణపతులను గొదుమకుంట చెరువు, మోటకొండూర్‌ మండలంలో 80 గణపతులను మోటకొండూర్‌ చెరువు, యాదగిరిగుట్ట మండలంలోని 150 గణపతులను నల్లచెరువు, చౌటుప్పల్‌లోని 222 గణపతులను పెద్దకందుకూరు చెరువు, పోచంపల్లిలో 117 గణపతులను పోచంపల్లి చెరువు, రామన్నపేట మండలంలోని 149 గణపతులను తుమ్మలగూడెం చెరువు, వలిగొండ మండలంలో 95 గణపతులు, వలిగొండ చెరువుతోపాటు, భీమలింగం కాల్వ సంగెం వద్ద, మోత్కూరు మండలంలోని 80 గణపతులను మోత్కూరు చెరువులో నిమజ్జనం చేయనున్నారని తెలిపారు. తుర్కపల్లిలో 120 గణప

తులు, రాజాపేటలో 120 గణపతులు, నారాయణపూర్‌లో 128 గణపతులు, ఆత్మకూరు(ఎం)లో 93 గణపతులు, అడ్డగూడూరులో 60 గణపతులను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఒక్కో చెరువులో ఒక క్రేన్‌ను అందుబాటులో ఉంచామన్నారు. మొత్తం 364 మంది పోలీసు సిబ్బంది నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఒక డీసీపీ, ఐదుగురు ఏసీపీలు, 11 సీఐలు, 27 మంది ఎస్సైలు, 40 ఏఎస్సైలు, 240 మంది కానిస్టేబుళ్లు, 40 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...