యాదాద్రిలో భక్తుల సందడి


Sun,September 8, 2019 11:45 PM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : పుణ్యక్షేత్ర సందర్శన.. ఇష్టదేవుడి దర్శనం.. మొక్కు పూజలతో యాదాద్రి పంచనారసింహ క్షేత్రం ఆదివారం జన సందోహంతో నిండుకుంది. శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. యాత్రికుల వాహనాలతో ఆలయ దారులు, పట్టణ వీధులు గజిబిజిగా మారాయి. సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వా మివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 66, 000 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది.

నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ.100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. 9, 91, 143 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.9, 91, 143 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1, 31, 116, 150 రూపాయల టిక్కెట్‌తో రూ.90, 850, గదులు విచారణ శాఖతో రూ. 65, 620, ప్రసాదవిక్రయాలతో రూ.4, 07, 740 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకుని రూ. 9, 91, 143 ఆదాయం వచ్చిందని ఆమె వివరించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...