ఏడాదిలోగా చెరువుల్లో జలకళ


Thu,September 5, 2019 11:53 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వాడుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలతో ఏడాదిలోగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో సాగునీటి జలాలు అందుతాయని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఇటీవల కురిసిన వర్షాలతో ఇండ్లు ధ్వంసమైన వారికి నష్టపరిహారం చెక్కులను ఆమె అందజేశారు. మండలంలోని జంగంపల్లి, రాళ్లజనగాం, లప్పనాయక్‌తండా, మైలార్‌గడ్డతండా, దాతారుపల్లి, మల్లాపురం గ్రామాల్లోని 99 మంది లబ్ధిదారులకు రూ.3,66,800 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె సభను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. చెరువులకు పూర్వవైభవం రాబోతున్నాయని, బస్వాపూర్, గంధమల్ల జలాశయంతోపాటు మల్లన్నసాగర్ జలాశయం నుంచి నేరుగా కాలువల ద్వారా చెరువుల్లోకి నీళ్లు తీసుకొచ్చేదాక విశ్రమించబోనని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆలేరు నియోజకవర్గానికి సాగు నీళ్లు అందిచడమే లక్ష్యంగా పనిచేస్తామని హామీనిచ్చారు.

బస్వాపూర్ జలాశయం భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. లప్పనాయక్ తండా, రాళ్ళజనగాం గ్రామాల్లో ఇండ్లు కోల్పోయిన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. బస్వాపూర్ నిర్మాణంతో ఇక్కడి ప్రాంత నీటి సమస్య తీరుతుందన్నారు. ప్రతిఒక్కరూ నీటి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న సర్పంచ్‌లు తమ గ్రామాల్లో చెరువుల్లోకి వచ్చేందుకు ఉండాల్సిన కాలువలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువ నిర్మాణంలో కొంతమంది రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధాబీరయ్య, ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంపీపీ ఫైళ్ల జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మార్వో గణేశ్, సర్పంచులు మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, చొల్లేరు సర్పంచ్ బీరయ్య, దాతారుపల్లి సర్పంచ్ చిన్నపుల్లయ్యగౌడ్, రాళ్లజనగాం సర్పంచ్ శ్రీశైలం, వంగపల్లి ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ అసిస్టెంట్ వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...